గత ఎన్నికల్లో వైకాపాకు ప్రచారం చేశాడనే ఆరోపణలు రుజుకావడంతో ప్రభుత్వం చర్యలు
జీవో ఎంఎస్ నెంబర్ 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 20ః అమరావతి సచివాలయ ఎంప్లాయిస్ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సచివాలయంలోని పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్రటరీ (ఇన్‌ఛార్జ్) హోదాలో ఉన్నారు. ఆయన గత రెండేళ్ల నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ గత ఎన్నికల్లో వైకాపా తరుపున ఆయన ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేయించింది. కడప కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన దీనిపై తన నివేదికను ఎప్పుడో ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి తప్పుచేశారని తేలినా...ఈ ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోలేదు. దాదాపు రెండేళ్ల తరువాత ఆయనపై ఇప్పుడు చర్యలు తీసుకుంది. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయబోతున్నారంటూ వారం రోజుల క్రితమే సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ ఓ వీడియో చేశారు. ఆయన చెప్పినట్లే..ఇప్పుడు ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
గత ఎన్నికలకు ముందు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి వైకాపా కార్యకర్తల కంటే ఎక్కువగా వైకాపాకు పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. కడప జిల్లాలోని బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాల్లో ఆర్టీసీ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి సమావేశాలు నిర్వహించి, వారిని వైకాపాకు మద్దతు ఇవ్వాలని ప్రోత్సహించినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిపై విచారణ నిర్వహించింది. ఆ ఆరోపణలు నిజమని తేలడంతో ఈ రోజు జీఏడీ ఆయనను తొలగిస్తూ జి.ఓ.ఎంఎస్ నెం.43 (తేదీ: 20-04-2026) జారీ చేసింది. ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1964లోని నియమాలకు విరుద్ధమని ప్రభుత్వం నిర్ధారించింది. ముఖ్యంగా రూల్ 19(1), 19(5), అలాగే రూల్ 3(1) మరియు 3(2) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం నిషేధించబడింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించబడ్డాయి.
మొదటగా వెంకట్రామి రెడ్డిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, అనంతరం పూర్తి స్థాయి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. కడప జిల్లా కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించి, సంబంధిత ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో ఆరోపణలు రుజువైనట్లు స్పష్టంగా పేర్కొనబడింది. విచారణ నివేదికను సంబంధిత అధికారికి అందజేసి వివరణ కోరినప్పటికీ, ఆయన సమాధానం సంతృప్తికరంగా లేదని ప్రభుత్వం తేల్చింది. అనంతరం కేసును Andhra Pradesh Public Service Commission కు పంపగా, వారు కూడా పూర్తి స్థాయి పరిశీలన అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనకు సమ్మతి తెలిపారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ & అప్పీల్) రూల్స్, 1991లోని రూల్ 9 క్లాజ్ (x) ప్రకారం “సర్వీసు నుంచి తొలగింపు” అనే గరిష్ట శిక్షను విధిస్తూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వు వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న బాధ్యతలను మరోసారి గుర్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తటస్థంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగేందుకు ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి సమయంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం తీవ్రమైన తప్పిదంగా పరిగణించబడుతుంది. అలాగే, ఈ ఘటన ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు సేవా నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం స్పష్టమవుతోంది. విధి నిర్వహణలో నిష్పాక్షికత, నిజాయితీ, క్రమశిక్షణ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసింది. కాగా దాదాపు 24 సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగిగా ఉన్న వెంకట్రామిరెడ్డి మరో 14 ఏళ్లు సర్వీసు ఉండగానే ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అయితే..వైకాపాకు అనుబంధంగా వ్యవహరిస్తోన్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు వైకాపాలో చేరతారనే భావన ఆయన సన్నిహితుల్లో ఉంది. కాగా గతంలోనే వెంకట్రామిరెడ్డి భార్య వైకాపా తరుపున ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే..ఇప్పుడు ఉద్యోగం పోవడంతో వెంకట్రామిరెడ్డి నేరుగా వైకాపా కార్యకలాపాల్లో పాల్గొంటారేమోచూడాలి.
గతంలో కూడా వెంకట్రామిరెడ్డి వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉండేది. 2014-19 మధ్య ఆయన టిడిపి ప్రభుత్వాన్ని పలుసార్లు ఇరకాటంలో పెట్టారు. ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన ఒక డ్రాప్ట్ జీవోను విడుదల చేసి అప్పటి టిడిపి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొనేలా వ్యవహరించారు. అప్పట్లోనే ఆయనతో పాటు మరో ఉద్యోగిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే..అప్పట్లో వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చిన ఓ ఎమ్మెల్యే ద్వారా ఆయన సస్పెండ్‌ను ఎత్తేయించుకున్నారు. అయితే..తరువాత కూడా ఆయన తన విధానాలను మార్చుకోలేదు. టిడిపిపై ఉన్న వ్యతికేతను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. వైకాపాకు బహిరంగంగా మద్దతు ఇస్తూ..ఆయన జగన్‌పై ఉన్న స్వామిభక్తిని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. కాగా..వెంకట్రామిరెడ్డికి సన్నిహితులైన చాలా మంది సచివాలయ ఉద్యోగులు ఆయనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి సస్పెండ్‌లో ఉన్నా వెంకట్రామిరెడ్డి సచివాలయంలోనే విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శించినా..ఈ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే..ఇప్పుడు ఎందుకో ఆయనపై చర్య తీసుకుంది. మొత్తం మీద..వెంకట్రామిరెడ్డిపై చర్య తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపార్టీలకు అనుబంధంగా ఉంటే చర్యలు ఉంటాయని గట్టి సందేశాన్ని ప్రభుత్వం ఆలస్యంగానైనా పంపింది.