Janam Online

ఐఏఎస్‌ల బ‌దిలీలు ఎప్పుడు...!?

అన్ని విష‌యాల్లోనూ నాన్చే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఐఏఎస్‌, ఐపిఎస్ అధికారుల బ‌దిలీల విష‌యంలోనూ నాన్చుడు ధోర‌ణిని అవ‌లంభిస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది అయినా..అధికార వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భుత్వానికి పట్టులేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఐపిఎస్‌, ఐఏఎస్ అధికారుల‌ను స‌రైన స్థానంలో నియ‌మించుకోక‌పోవ‌డ‌మే. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఏడాది అయినా..ప‌నిచేసే అధికారుల‌ను గుర్తించ‌లేక‌పోవ‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే. కీల‌క‌మైన హెచ్‌డిఓలు, జిల్లా క‌లెక్ట‌ర్లు, జిల్లా ఎస్పీలు, ఇత‌ర ముఖ్య అధికారులను నియ‌మించుకోవ‌డంపై ప్ర‌భుత్వం నాన్చివేత ధోర‌ణిని అవ‌లంభిస్తోంది. దీంతో ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌లు ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక‌పోతున్నాయి. ప్ర‌భుత్వం వేలాది కోట్లు ఖ‌ర్చు చేసి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోన్నా ప్ర‌భుత్వానికి రావాల్సిన మైలేజ్ రావ‌డం లేదు. ముఖ్యంగా అధికార కూట‌మి కార్య‌క‌ర్త‌లు ఈ విష‌యంలో ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నారు. వైకాపా హ‌యాంలో పెత్త‌నం చేసిన అధికారులే మ‌ళ్లీ ఇక్క‌డ పెత్త‌నం చేస్తున్నార‌ని, వారంతా..వైకాపాకు అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని, త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఇప్ప‌టికీ వైకాపా హ‌వానే న‌డుస్తోందంటే దానికి అధికారులే కార‌ణ‌మ‌ని వారు చెబుతున్నారు. ఏడాది త‌రువాత అయినా..ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌ని ఐఏఎస్‌, ఐపిఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తార‌నుకుంటే..అది జ‌ర‌గ‌డం లేద‌ని, మిగ‌తా విష‌యాల‌ను నాన్చిన‌ట్లే ఈ విష‌యాన్ని కూడా ముఖ్య‌మంత్రి నాన బెడుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. 


సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న త‌రువాతా...! లేక ఆ లోపేనా...!?

కాగా ఐఏఎస్‌, ఐపిఎస్‌ల బ‌దిలీల‌పై ప్ర‌భుత్వం తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ విష‌యంలో క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని అధికార‌వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే..ఎప్పుడు బ‌దిలీలు ఉంటాయ‌నే దానిపై వారు కూడా స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. భారీ స్థాయిలో బ‌దిలీలు చేయాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నార‌ని కొంద‌రు అధికారులు చెబుతుండ‌గా, అలాంటిదేమీ లేదు ప‌రిమితంగానే బ‌దిలీలు ఉంటాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. అయితే..ఈ నెలాఖ‌రుకు ముఖ్య‌మంత్రి బృందం సింగ‌పూర్ వెళుతోంది. ఆయ‌న ప‌ర్య‌ట‌న త‌రువాత బ‌దిలీలు ఉంటాయ‌ని కొంద‌రు చెబుతుండ‌గా, ఈ లోపే ఉండ‌వ‌చ్చ‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. సింగపూర్ ప‌ర్య‌ట‌న త‌రువాత అయితే భారీగా బ‌దిలీలు ఉంటాయ‌ని, అలా కాకుండా ఈలోపే బ‌దిలీలు చేస్తే ప‌రిమితంగా ఉంటాయ‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో కూడా మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు. మొత్తం మీద ఐఏఎస్‌ల బ‌దిలీల‌కు కూడా ఇంత స‌మ‌యం తీసుకోవాలా..? అంటు కొంద‌రు రాజ‌కీయ ప‌రిశీల‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని, ఆయా జిల్లాల్లో ఇప్ప‌టికైనా అధికార వ్య‌వ‌స్థపై ప‌ట్టుసాధించ‌క‌పోతే..టిడిపి భారీగా న‌ష్ట‌పోతుంద‌ని కూడా వారు హెచ్చ‌రిస్తున్నారు.