Janam Online

కార్య‌క‌ర్త‌ల అసంతృప్తి అర్థ‌మైందా...!?



టిడిపి అంటే కార్య‌క‌ర్త‌ల పార్టీ. ఆ పార్టీ గెలుపులోనూ, ఓట‌మిలోనూ వారి భాగ‌స్వామ్యం భారీగానే ఉంటుంది. వాళ్లకు కోపం వ‌స్తే..అలుగుతార‌ని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడే ఇటీవ‌ల కాలంలో వ్యాఖ్యానించారు. అది చాలా వ‌ర‌కూ నిజ‌మే. అయితే..ఇటీవ‌ల కాలంలో..ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ అధినేత, ఆయ‌న కుమారుడి వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర‌స్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా సోష‌ల్‌మీడియాలో పార్టీ సానుభూతిప‌రులు అని చెప్పుకునేవారు ప్ర‌తిప‌క్షంక‌న్నా ఘోరంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తండ్రీ కొడుకులు పెట్టుబ‌డులు, ఐటి, బీటీ, డేటా సెంట‌ర్లు..అంటూ..నేల విడిచి సాము చేస్తున్నార‌ని, త‌మ గోడు ఆల‌కించ‌డం లేద‌ని, పార్టీ, ప్ర‌భుత్వం తాము ఆశించిన విధంగా ప‌నిచేయ‌డం లేద‌ని, ఎన్నిక‌ల‌కు ముందు త‌మ‌ను వాడుకుని ఇప్పుడు క‌రివేపాకులా తీసి పారేస్తున్నార‌ని సోష‌ల్‌మీడియా వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తుతున్నారు. వాళ్లు అలా ధ్వ‌జ‌మెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం..  ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన  వెంట‌నే గ‌తంలో త‌మ‌ను వేధించిన వైకాపా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం. ఒక‌వేళ తీసుకున్నా వారిని వెంట‌నే వ‌దిలేయ‌డం. ప్ర‌ధానంగా వేధించిన పెద్ద పెద్ద నాయ‌కుల‌ను వ‌దిలేసి, చిన్నా చిత‌కా నేత‌ల‌ను అరెస్టు చ‌య‌డం..వారికి సంతృప్తి ఇవ్వ‌లేదు. ఎటువంటి త‌ప్పుచేయ‌ని త‌మ అధినేత చంద్ర‌బాబునాయుడిని అరెస్టు చేయించిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఆయ‌న ఎన్నో అవినీతిప‌నులు చేసినా..ఎందుకు అరెస్టు చేయ‌లేద‌నే ప్ర‌శ్న వారిని తొలిచేస్తోంది. అదే స‌మ‌యంలో..అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే భ‌ర్తీ చేస్తామ‌న్న నామినేటెడ్  ప‌ద‌వులు పంప‌కం చేయ‌క‌పోవ‌డం, పార్టీ కోసం ప‌నిచేసిన వారికి స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం, ఒక‌వేళ ఇచ్చినా..అర‌కొర‌గా ఇవ్వ‌డం.. వైకాపా ప్ర‌భుత్వంలో పెత్త‌నం చెలాయించిన అధికారులే ఇక్క‌డా పెత్త‌నం చేయ‌డం, గ‌తంలో పార్టీ సానుభూతిప‌రులు అంటూ..తీసేసిన సామాజిక పెన్ష‌న్లు పునఃరుద్ధ‌రించ‌క‌పోవ‌డం, కార్య‌క‌ర్త‌ల‌కు విలువ ఇవ్వక‌పోవ‌డంతో పాటు వారు ఆశించిన స్థాయిలో ప్ర‌భుత్వం న‌డ‌వ‌క‌పోవ‌డం వంటివి వారి అసంతృప్తికి ప్ర‌ధాన కార‌ణం. వైకాపా నాయ‌కుల‌తో పైస్థాయి నాయ‌కులు కుమ్మ‌క్కయ్యార‌నే ఆరోప‌ణ‌లు కూడా వారిని తీవ్ర‌స్థాయిలో బాధిస్తున్నాయి. దీంతో..వారంతా త‌మ అసంతృప్తి బ‌హిరంగంగా వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ కోసం వీరెవ‌రూ క‌ష్ట‌ప‌డ‌ర‌ని, పార్టీ గెలుపుకోసం ప‌నిచేయ‌ర‌నే అభిప్రాయాలు పార్టీలో వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీ గెలుపుకోసం త్యాగాలు చేసిన వారిని ప‌ట్టించుకోక‌పోతే..పార్టీ ఏమ‌వుతుందోన‌న్న భ‌యాలు కూడా ఆవ‌రించాయి.


ఇటువంటి ప‌రిస్థితుల్లో ఎందుకో ఇప్పుడు హ‌ఠాత్తుగా పార్టీ పెద్ద‌లు కార్య‌క‌ర్త‌ల గోడు వింటున్నారు. వారిని క‌ల‌వ‌డానికి పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు లోకేష్‌లు ఆస‌క్తిచూపిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రూ ప‌దే ప‌దే రాష్ట్ర పార్టీ కార్యాల‌యానికి వ‌స్తున్నారు. ఒక‌రు మార్చి ఒక‌రు కార్యాల‌యానికి వ‌చ్చి కార్య‌క‌ర్త‌ల గోడు వింటున్నారు. అదే స‌మ‌యంలో..రాష్ట్ర వ్యాప్తంగా..ఎమ్మెల్యేలు, మంత్రులూ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవాల‌ని, అలా ప‌ట్టించుకోక‌పోతో ఊరుకునేది లేద‌ని గ‌ట్టిగా హెచ్చ‌రించారు. అంతేనా..లోకేష్ వివిధ జిల్లాల్లో కార్య‌క‌ర్త‌ల‌ను నేరుగా క‌లుస్తున్నారు. హ‌ఠాత్తుగా వీళ్లు ఇలా కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తుండ‌డంతో..తెర‌వెనుక ఏమి జ‌రిగిందో..తెలియ‌డం లేదు. వాస్త‌వానికి మిగ‌తా రాజ‌కీయ‌పార్టీల‌కు తెలుగుదేశం పార్టీ విరుద్ధం. ఆ పార్టీ త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, సానుభూతిప‌రుల‌కు అనేక ర‌కాలుగా అండ‌గా ఉంటుంది. అయితే..ఇటీవ‌ల కాలంలో..వాటిన్న‌టి క‌న్నా..త‌మ‌ను వేధించిన వైకాపా నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అదే స‌మ‌యంలో వైకాపా కాలంలో ప‌నిచేసిన అధికారుల‌ను తొల‌గించాల‌ని వారు బలంగా కోరుకున్నారు. అయితే..అవేవీ పెద్ద‌గా జ‌ర‌క‌పోవ‌డంతో వారి అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోయింది. తాము వ‌స్తే..ర‌పా ర‌పా చేస్తామ‌ని వైకాపా వాళ్లు బెదిరింపుల‌కు దిగ‌డం, అటువంటివారిని తాము అధికారంలో ఉండి కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌నే భావ‌న కార్య‌క‌ర్త‌ల్లో ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే..ఒక‌వేళ జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే..త‌మ ప‌రిస్థితి ఏమిటి..? అనే భావ‌న‌తో వైకాపా వాళ్లును అణిచేయాల‌ని వారు కోరుకుంటున్నారు. అలా చేయ‌డం అయ్యే ప‌నికాదు. అయితే..గ‌తంలో క‌న్నా..ఇప్పుడు టిడిపి పెద్ద‌లు వైకాపా నాయ‌కులపై, కార్య‌క‌ర్త‌ల‌పై గ‌ట్టిగానే చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన ఈ మార్పుపై పార్టీ కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే..ఇంత క‌న్నా ఎక్కువ చేయాల‌ని, అధినేత‌, ఆయ‌న కుమారుడు త‌మ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరుకుంటుండంతో..వారిద్ద‌రు వారి కోరిక‌ను మ‌న్నించారు. మొత్తం మీద‌..ఇటీవ‌ల కాలంలో..వారిద్ద‌రూ పార్టీకి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో..కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు శాంతించే అవ‌కాశం ఉంది. మొత్తం మీద‌..పార్టీలో కింద స్థాయిలో వ్య‌క్తం అవుతోన్న అసంతృప్తిని తండ్రీకొడుకులు గ్ర‌హించార‌ని, త‌ప్పులు స‌రిదిద్దుకుంటున్నార‌నే భావ‌న పార్టీలో వ్య‌క్తం అవుతోంది. ఇదే రీతిలో వారు పార్టీకి ప్రాధాన్య‌త ఇస్తే..భ‌విష్య‌త్తులో పార్టీ కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు మ‌రింత ఉత్సాహంగా ప‌నిచేస్తార‌న‌డంలో ఎటువంటిసందేహం లేదు.