Janam Online

క‌ల్తీ మ‌ద్యంపై విఆర్ఎస్ కాల్స్‌...!?

ఒక‌ప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు విఆర్ఎస్ కాల్స్ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చేవి. ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి ఓటు వేయ‌మ‌ని, లేక‌పోతే..త‌మ అభ్య‌ర్థికి ఓటు వేయ‌మ‌ని స‌ద‌రు పార్టీ, అభ్య‌ర్థులు కాల్స్ చేయించేవారు. ఇది త‌రువాత కాలంలో..మీ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అభ్య‌ర్థిగా మీరు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తున్నారో..చెప్పాలంటూ ప్ర‌జ‌ల‌కు ఫోన్లు వ‌చ్చేవి. ప్ర‌జాభిప్రాయానికి అనుగుణంగా తాము సీట్లు ఇచ్చామ‌ని త‌రువాత ఆయా పార్టీ అధినేత‌లు చెప్పుకునేవారు. ఇలాంటి కాల్స్ చేయించ‌డంలో టిడిపి ముందుంటుంది. వైకాపా త‌క్కువ అని కాదు..కానీ..ఆ పార్టీ అధినేత‌..తాను ఎవ‌రంటే..వారికే సీటు అనే నిర్ణ‌యంతో ఉండేవారు. దీంతో వైకాపాలో ఈ వ్య‌వ‌హారం చాలా త‌క్కువ‌గా ఉండేది. అయితే..2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైకాపా తెచ్చుకున్న ఐప్యాక్ టీమ్ ఈ విష‌యంలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించి మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్టింది. అయితే..2024లో మాత్రం అటువంటి మ్యాజిక్ చేయ‌లేక‌పోయింది. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి నేత‌లు విఆర్ఎస్ కాల్స్ ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకున్నారు. కాగా...ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం విఆర్ఎస్ కాల్స్‌ను మ‌రొకందుకు వాడుతున్నారు. ఇటీవ‌ల కాలంలో వెలుగులోకి వ‌చ్చిన క‌ల్తీ మ‌ద్యం వ్య‌వ‌హారంపై వైకాపాను టార్గెట్ చేస్తూ..ప్ర‌జ‌ల‌కు విఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నారు. ఈ కాల్స్‌లో క‌ల్తీ మద్యం వ్య‌వ‌హారంలో అస‌లు దోషి వైకాపానే అని, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుట్ర‌పూరితంగా క‌ల్తీ మ‌ద్యం చేయించి విక్ర‌యిస్తూ..దాన్ని ప్ర‌భుత్వంపైకి తోస్తున్నార‌ని చెబుతున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాల్స్ ఈరోజు చాలా మంది ప్ర‌జ‌ల‌కు వ‌చ్చాయి. గ‌త వైకాపా ప్ర‌భుత్వ హ‌యాంలో ఇష్టారాజ్యంగా మ‌ద్యంపై దండుకున్నార‌ని, అవినీతితో వేల కోట్లు దోచుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై ఇప్ప‌టికే సిట్ విచార‌ణ చేస్తూ ప‌లువురిని అరెస్టు చేసింది. మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆయ‌న మందిమాగాధులు ఈ కేసులో చాలా మంది అరెస్టు అయ్యారు. వీరిలో కీల‌క నేత‌లు ఉన్నారు. ఈ కేసు చివ‌రికి మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తార‌నే ప్ర‌చారం ఉంది. మ‌ద్యం కుంభ‌కోణంలో అంతిమ‌ల‌బ్దిదారు జ‌గ‌నేన‌ని, ఆయ‌న అరెస్టు త‌ప్ప‌ద‌నే భావ‌న ఉన్న ప‌రిస్థితుల్లో క‌ల్తీ మ‌ద్యం వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తంబ‌ళ్ల‌ప‌ల్లెకు చెందిన టిడిపి ఇన్‌ఛార్జికి ఈ కేసుతో సంబంధం ఉంద‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో టిడిపి ఆగ‌మేఘాల‌పై స్పందించి ఆయ‌న‌ను పార్టీ నుంచి తొల‌గించింది. దీన్ని అలుసుగా తీసుకుని వైకాపా నారా వారి క‌ల్తీ మ‌ద్యం అంటూ యాగీ చేస్తోంది. క‌ల్తీ మ‌ద్యంతో టిడిపి నేత‌లు వేల‌కోట్లు దోచుకున్నార‌ని ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. అయితే..ఈ కేసులో అస‌లైన నిందితులు మాజీ మంత్రి జోగి ర‌మేష్ అని క‌ల్తీ మ‌ద్యం త‌యారుదారు జ‌నార్థ‌న్‌రావు చెప్ప‌డంతో..కేసు తిరిగి వైకాపా కాంపౌండ్‌కు చేరింది. అయితే..జోగి నిందితుడు అని తెలిసినా వైకాపా..త‌న ప్ర‌చారాన్ని ఆప‌క‌పోవ‌డంతో..టిడిపి విఆర్ఎస్ కాల్స్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసింది. ఈ విఆర్ఎస్ కాల్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మ‌ద్యం ఆగ‌డాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తోంది. ఒక‌వైపు విఆర్ఎస్ కాల్స్ మ‌రో వైపు బెల్ట్‌షాప్‌ల‌ను తొల‌గిస్తూ..ఈ విష‌యంలో త‌న చిత్త‌శుద్దిని చాటుకుంటోంది. అయితే..కూట‌మి ప్ర‌భుత్వం చేస్తోన్న ప్ర‌చారంపై వైకాపా ధ్వ‌జ‌మెత్తుతోంది. క‌ల్తీ మ‌ద్యం ద్వారా లోకేష్ వేల‌కోట్లు దోచుకున్నార‌ని వైకాపా ఆరోపిస్తోంది. కిలారు రాజేష్ వ్య‌వ‌హారంలో కీల‌క‌మ‌ని ఆయ‌న ద్వారానే లోకేష్‌కు మ‌ద్యం ముడుపులు అందుతున్నాయ‌ని ఆరోపణ‌లు గుప్పించింది. కాగా క‌ల్తీ మ‌ద్యం కేసులో నిందితుడైన జోగి ర‌మేష్‌ను అరెస్టు చేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. నేడో రేపో ఆయ‌న‌ను అరెస్టు చేస్తారంటున్నారు. ఆయ‌న అరెస్టు త‌రువాత క‌ల్తీ మద్యం వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.