Janam Online

చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ యువ‌క‌లెక్ట‌ర్ల‌పైనే...!?

రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌గ‌తి కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. వైకాపా హ‌యాంలో నాశ‌న‌మైన వ్య‌వ‌స్థ‌ల‌న్నింటిని స‌రిచేస్తూ, కునారిల్లిన అభివృద్ధి, ప్ర‌గ‌తి కోసం ఆయ‌న త‌న‌ శ‌క్తినంతా దార‌పోస్తున్నారు. ఒక‌వైపు అభివృద్ధి, మ‌రో వైపు సంక్షేమాన్ని బాలెన్స్ చేస్తూ..రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నాల్లో కొంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృతుల‌వుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తెచ్చేందుకు ఆయ‌న యువ‌కుడిలా దేశ‌దేశాల‌న్ని తిరుగుతూ, అవ‌కాశం ఉన్న‌ ప్ర‌తి పెట్టుబ‌డిదారుడిని త‌మ రాష్ట్రంలో  పెట్టుబ‌డులు పెట్టాలంటూ కోరుతున్నారు. ఆయ‌న శ్ర‌మ‌తో, కృషితో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. విశాఖ‌ప‌ట్నం పెట్టుబ‌డుల‌కు కేంద్రంగా మారుతోంది. ఇప్ప‌టికే గూగుల్ డేటా సెంట‌ర్‌తో పాటు, ప్ర‌ముఖ ఐటి కంపెనీలన్నీ అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  ప్ర‌ముఖ కంపెనీలు ఆంధ్రాకు వ‌స్తే..ఇక్క‌డ యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు పెరుగుతాయ‌నేది ఆయ‌న భావ‌న‌. ఇప్ప‌టికిప్పుడు రాక‌పోయినా..రాబోయే ఐదేళ్లు, ప‌దేళ్ల‌లో ల‌క్ష‌లాది ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, త‌ద్వారా హైద‌రాబాద్‌కు మించి అభివృద్ది జ‌ర‌గ‌డానికి ఇక్క‌డ అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఇదే ఆయ‌న చెబుతున్నారు..ఇత‌రుల‌కు ఉద్భోధిస్తున్నారు. దీన్నే ఆయ‌న‌ త‌న మంత్రుల‌కు, అధికారుల‌కు చెబుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మూడు నెల‌ల‌కు ఒక‌సారి త‌న అధికారుల‌ను, క‌లెక్ట‌ర్ల‌ను, ఇత‌ర హెచ్ఓడీల‌తో స‌మావేశ‌మై..స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఎందుకీ స‌మావేశాలు అన్న విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న స‌న్నిహితులు పైన చెప్పిన అంశాల‌ను ఉదాహ‌రిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తేడ‌వం ఎంత ముఖ్య‌మో..వాటిని గ్రౌండింగ్ చేయ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం చేసుకుంటే కుద‌ర‌ద‌ని, వాటిలో ఎంత వ‌ర‌కు గ్రౌండింగ్ అయ్యాయ‌నే దానిపైనే ఆయ‌న ఎక్కువ దృష్టి పెడుతున్నార‌ని, ఈ క్ర‌మంలోనే క‌లెక్ట‌ర్ల స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ని త‌ద్వారా..ఏవి ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయే నేరుగా తెలుసుకుంటున్నార‌ని ఆ వ‌ర్గాలు అంటున్నాయి. 


యువ‌త‌పైనే ముఖ్య‌మంత్రి ఆశ‌ల‌న్నీ...!

కాగా చంద్ర‌బాబునాయుడు నాల్గోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత వివిధ జిల్లాల‌కు క‌లెక్ట‌ర్ల‌గా దాదాపు యువ‌త‌నే నియ‌మించారు. మ‌రీ ముఖ్యంగా మ‌హిళా ఐఏఎస్‌ల‌ను ఎక్కువ‌గా నియ‌మించారు. గ‌తంలో ఎప్పుడూ ఇటువంటి ప‌రిస్థితి లేదు. అయితే..ఈసారి ముఖ్య‌మంత్రి మ‌హిళా ఐఏఎస్‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి త‌న ఆశ‌ల‌న్నీ వారిపైనే..అని చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..ఇప్పుడు నియ‌మించిన క‌లెక్ట‌ర్ల‌లో చాలా మంది 40ఏళ్ల‌కు లోపు వ‌య‌స్సు ఉన్న‌వాళ్లే...75ఏళ్ల వ‌య‌స్సు ఉన్న చంద్ర‌బాబు 30,35,40ఏళ్ల ఉన్న క‌లెక్ట‌ర్ల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఏఐ యుగంలో...వారితో పోటీ పడుతూ వారి క‌న్నా వేగంగా ఏఐ రంగంలో వ‌స్తోన్న మార్పుల‌తో పాల‌న‌పై ప‌ట్టుబిగించాల‌ని తద్వారా రాష్ట్రాన్ని ప్ర‌గ‌తిప‌థంలో ఉంచాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న నియ‌మించిన కొంద‌రు జిల్లా క‌లెక్ట‌ర్లు ఆయ‌న ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తున్నారు. త‌మ త‌మ జిల్లాలో అభివృద్ధి కోసం పోటీ ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా వారి మ‌ధ్య పోటీత‌త్వాన్ని ప్రోత్స‌హిస్తున్నారు. వారికి ర్యాంక్‌లు కేటాయించి మంచి ర్యాంకులు వ‌చ్చిన వారిని ప్రోత్స‌హిస్తున్నారు. దీంతో క‌లెక్ట‌ర్లు త‌మ జిల్లాలో ఉన్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఉత్సాహంగా ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. త‌మ‌ను తాము నిరూపించుకోవ‌డానికి య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబ‌డులు భారీ స్థాయిలో వ‌స్తోన్న ప‌రిస్థితుల్లో భారీగా వాటిని గ్రౌండింగ్ చేయించుకునేందుకు పోటీ ప‌డుతున్నారు. ముఖ్యంగా పెట్టుబ‌డులు అవ‌కాశం ఉన్న జిల్లాల్లో ఈ స్థితిని వాడుకోవ‌డానికి వారు య‌త్నిస్తున్నారు.


2014-19 మ‌ధ్య‌ స‌మ‌యంలో అనంత‌పురం జిల్లాక‌లెక్ట‌ర్‌గా ఉన్న కోన‌శ‌శిధ‌ర్ అక్క‌డకు ద‌క్షిణ‌కొరియాకు చెందిన ప్ర‌ముఖ కార్ల ఉత్ప‌త్తి సంస్థ కియా ప‌రిశ్ర‌మ పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌గాహ‌న కుదుర్చుకుంది. దాంతో జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న కోన‌శ‌శిధ‌ర్ ఆ కార్ల సంస్థ‌కు కావాల్సిన నీటిని రికార్డు టైమ్‌లో వారికి క‌ల్పించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేత ప్ర‌శంస‌లు పొందారు. క‌లెక్ట‌ర్ చ‌ర్య ద్వారా..ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ అయిన కియా త‌రువాత వేగంగా త‌న ప‌నుల‌ను ప్రారంభించి ఉత్ప‌త్తిని కూడా వేగంగా సాధించింది. ఇప్పుడు ఈ సంస్థ అనంత‌పురం జిల్లా అభివృద్ధికి విశేషంగా తోడ్ప‌డుతోంది. ఇలాంటి అవ‌కాశాల‌ను యువ క‌లెక్ట‌ర్లు అందిపుచ్చుకోవాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కోరుకుంటున్నారు. అందుకే ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి క‌లెక్ట‌ర్ల స‌మావేశాలంటూ..ఆయ‌న పెట్టుకుంటున్నార‌ని, ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఆయ‌న ప‌ట్టించుకోర‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలుచెబుతున్నాయి. ముఖ్య‌మంత్రి ఆశ‌,ఆశ‌యాలకు అనుగుణంగా ఈ యువ ఐఏఎస్‌లు ఎంత‌వ‌ర‌కు ఫ‌లితాలు సాధిస్తారో..చూడాల్సి ఉంది. ఐఏఎస్ సాధించ‌డ‌మే కొంత మంది యువ‌త‌కు జీవిత ఆశ‌యం. కానీ..అది అంద‌రికీ సాధ్యం కాదు..దాన్ని సాధించి స‌ర్వీసులోకి వ‌చ్చిన ఐఏఎస్‌లు త‌మ జీవితంలో ఫ‌లానా జిల్లాకు ఇది చేశాన‌ని, త‌న హ‌యాంలో..ఇది సాధించాన‌ని, త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు ఈ మేలు చేశాన‌ని భ‌విష్య‌త్తులో చెప్పుకోవాలంటే..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశ‌ల‌ను నెర‌వేర్చాల్సి ఉంటుంది.