కాంగ్రెస్ అధినేతల ఆలోచన...!
హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ మధ్యవర్తిత్వం...!
షర్మిల భవిష్యత్తుపై మంతనాలు...!
అన్నాచెల్లెళ్ల మధ్య పూడ్చలేని అగాతం..!
ఇద్దరూ ఒకే పార్టీలో ఉండలేని స్థితి...!
జగన్ కాంగ్రెస్ చెంత చేరితే..టిడిపిలోకి షర్మిల..!
టిడిపి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి...!
షర్మిల భవిష్యత్తుతో రాహుల్ ఆటలు...?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఇక పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆయన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, ఆయనను మళ్లీ దగ్గరకు తీసుకుందామని హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో మంతనాలు చేస్తోన్నట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రొఫెసర్‌కు రాహుల్ వద్ద మేధావిగా పేరుంది. అదే సమయంలో..గత జగన్ ప్రభుత్వంలో ఈ ప్రొఫెసర్ ఇంగ్లీష్ మీడియంకు అనుకూలంగా ప్రచారం చేశారు. జగన్ పేదల పాలిట దేవుడని, ఇంగ్లీషు మీడియం తెచ్చి పేదలను ఉద్దరించారని ఈయన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. వివిధ మీడియా ఛానెల్స్‌లోనూ జగన్‌కు అనుకూలంగా తన వాదనను వినిపించారు. అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఈ ప్రొఫెసర్ కొన్ని మీడియాల్లో తన కథనాలను వెలువరించారు. తెలంగాణ వస్తే..దొరల రాజ్యం వస్తుందంటూ..ఆయన చేసిన వ్యాఖ్యలు, రాసిన రాతలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. బీసీల రాజ్యాధికారం జగన్ వల్లే వస్తుందంటూ కూడా వ్యాఖ్యానించారు. మొదటి నుంచి జగన్‌కు అనుకూలుడైన ఈ ప్రొఫెసర్ ఇప్పుడు ఢిల్లీ పెద్దల వద్ద జగన్ గురించి రాయబారం నడుపుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బిజెపి అధికారంలోకి రాదని, అయితే..కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను తమవైపు తీసుకుంటే...సులువుగా కేంద్రంలో అధికారంలోకి వస్తామని సదరు ప్రొఫెసర్ రాహుల్‌గాంధీకి నచ్చచెబుతున్నారని సదరు ప్రొఫెసర్ కు దగ్గరైన వ్యక్తులు చెబుతున్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పగ్గాలు జగన్‌కు అప్పగిస్తే..ఇక తిరుగుండదని, సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, రెడ్లు, బీసీల్లో క్రిస్టియన్ మతం పుచ్చుకున్నవారంతా మళ్లీ కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఆంధ్రా నుంచే అది మొదలవ్వాలని ఆయన రాహుల్‌కు చెబుతున్నారట. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల వల్ల పార్టీకి ఉపయోగం లేదని, ఆమె వల్ల ఇక్కడ సీట్లు గెలిచే పరిస్థితి లేదని, పైగా ఆమె టిడిపితో సాన్నిహిత్యం నడుపుతోందని సదరు ప్రొఫెసర్ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారట. ఆమెను వదిలించుకుని జగన్‌తో నడవాలని కూడా ఆయన గట్టిగా రాహుల్‌కు సూచించారట. ఒకవేళ జగన్ కాంగ్రెస్‌కు దగ్గరైతే..షర్మిల భవిష్యత్తు ఏమిటనే చర్చ కూడా జరిగిందంటున్నారు. వాళిద్దరి మధ్య పూడ్చలేని అగాధం నెలకొందని, జగన్ కొన్ని ఆస్తులను ఆమెకు ఇస్తే..ఆమె రాజీపడుతుందని, ఒక వేళ ఇవ్వకపోతే..ఆమె కాంగ్రెస్‌లో ఉండరని కూడా ఆ ప్రొఫెసర్ చెబుతున్నారట. అయితే..జగన్ సంగతి తెలిసిన కాంగ్రెస్ పెద్దలు..ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, జగన్‌ను నమ్మలేమని, ఆయన పార్టీకి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని, అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తమ పక్కన పెట్టుకుంటే..ఎలా అనే భావన రాహుల్‌లో ఉందని సదరు ప్రొఫెసర్ సన్నిహితులు చెబుతున్నారు.
టిడిపిలోకి షర్మిల...!
సదరు ప్రొఫెసర్ మాటలకు విలువ ఇచ్చి రాహుల్ గాంధీ జగన్‌తో చేయి కలిపితే..షర్మిల టిడిపిలో చేరతారని కూడా సదరు ప్రొఫెసర్‌ను ఉటంకిస్తూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆమె టిడిపిలో చేరితో రాజంపేట లేదా విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారని, లేదంటే రాజ్యసభ సీటు అయినా ఇస్తారని కూడా ఆ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే..రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి షర్మిలను నేడో రేపో తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె స్థానంలో నిన్నిటి వరకూ వైకాపాలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా నాయకురాలిని నియమించబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మొత్తం మీద..జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుందని, ఇంతా ఒక రూపుకు రావడానికి సమయం పడుతుందంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఇంగ్లీషు మీడియం విషయంలో జగన్‌కు మద్దతుగా మాట్లాడరని, ఇదంతా ఆ ప్రొఫెసర్ వల్లేననే ప్రచారం ఉంది. అయితే..జగన్ ఇప్పటికిప్పుడు బిజెపిని ఎదిరించి కాంగ్రెస్ వైపు వచ్చే సాహసం చేయరంటున్నారు. ఒకవేళ కనుక ఈ డీల్ కనుక జరిగితే..జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలనే భావన కూడా సదరు ప్రొఫెసర్‌లో ఉంది. ఇప్పుడు కష్టపడ్డా రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..ఆయన మీద ఉన్న అవినీతి, మనీ లాండరింగ్ కేసులను ఒక్కస్టోక్‌తో కొట్టేస్తారని చెబుతున్నారట. మొత్తం మీద..సదరు ప్రొఫెసర్ చేస్తోన్న రాజకీయ మంతనాలు విజయవంతం అవుతాయో లేదో..కొన్నాళ్లలో తేలుతుంది.