మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కుంభకోణంలో ఆయన దాదాపు దొరికిపోయినట్లే. బిజెపి పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే..ఆయన అరెస్టు తధ్యం. అయితే..ఆయన ఇదొక్క కేసులోనే కాదు...ఇంకా ఇసుక, మైనింగ్, ఐ&పిఆర్, ల్యాండ్ సెటిల్‌మెంట్, భూముల కబ్జాలు, రెడ్ శాండిల్ ఇలా ఒకటేమిటి...ప్రతి దానిలో దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆరోపణలే కాదు..వాటికి ఆధారాలను కూడా కూటమి ప్రభుత్వం వెలికి తీసింది. ఈ కుంభకోణాలన్నిటిలోనూ తనతో పాటు ఉన్న అధికారులందరినీ ఆయన భాగస్వాములను చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక వెలుగు వెలిగిన ధనుంజయరెడ్డి ఇప్పటికే మద్యం కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నారు. అయితే..ఆయన భాగస్వామ్యం ఇదొక్క కేసులోనే లేదు. చాలా కేసుల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. కేవలం ఆయన కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా దీనిలో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా టిడిపి శ్రేణులు ఆయన భార్యకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసును విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. 2022లో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఒక మహిళ బంగారం అక్రమ రవాణా చేస్తూ..కస్టమ్స్ వాళ్లకు దొరికింది. అయితే ఈ కేసును కస్టమ్స్ వాళ్లు విచారణ చేయాల్సి ఉండగా రాష్ట్రానికి చెందిన సిఐడి ఎంటర్ రూల్స్‌కి వ్యతిరేకంగా ఆ కేసును వాళ్లు విచారించారు. అయితే..ఈ అక్రమ బంగారం రవాణా చేస్తోన్న సదరు మహిళ సిఎంఓ అధికారి భార్యకు సన్నిహితురాలనే అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో సిఎంఓలో చక్రం తిప్పిన సదరు అధికారి ఈ విషయాన్ని బయటకు వెళ్లడించాడని, వాట్స్‌ప్‌లో షేర్ చేశారని, సీనియర్ జర్నలిస్టు అంకబాబుపై అక్రమ కేసు పెట్టించారు. ఈ కేసులో 70ఏళ్లకు పైబడిన వృద్ధుడైన అంకబాబును పోలీసులు అర్థరాత్రిపూట అరెస్టు చేశారు. సిఎంఓ అధికారి ఒత్తిడి వల్లే ఇలా చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ కేసులో ఆయన తరువాత బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. అయితే..అక్రమ బంగారం రవాణా చేస్తోన్న మహిళ కేసు ఏమైందో ఇప్పటి వరకూ తేలలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా..ఇంత వరకూ ఈ కేసును పట్టించుకోలేదు. సిఎంఓ అధికారి వ్యవహారం దీనిలో ఉందని తెలిసినా..చంద్రబాబు ప్రభుత్వం ఎందుకో ఈ కేసును పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఈ కేసును సక్రమంగా విచారిస్తే..సదరు సిఎంఓ అధికారి భార్యకు, అక్రమ బంగారం రవాణాకు ఉన్న లింకులు, విజయవాడకు దుబాయ్‌కు ఉన్న బంగారం అక్రమ రవాణా వ్యవహారాలు బయటకు వస్తాయి. ఈ బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటకు వస్తే..దీని వెనుక ఉన్న బిగ్‌బాస్ మరోసారి వెలుగులోకి వస్తారు. మరి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టిపెడుతుందా..? అన్ని కేసులను వదిలేసినట్లు దీన్ని కూడా తూ తూ మంత్రంగా వదిలేస్తుందా..? చూడాలి మరి...?