Janam Online

జ‌గ‌న్ తెలివిత‌క్కువ‌గా మ‌ద్యం స్కామ్ చేశాడుఃIYR

మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తెలివిత‌క్కువ‌గా మ‌ద్యం స్కామ్ చేశాడ‌ని, ఆయ‌న మాంసం తిని మెడ‌లో బొక్క‌లు వేసుకున్న‌ట్లు ఈ స్కామ్‌లో అంద‌రికీ దొరికిపోయాడ‌ని మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సులువుగా దొరికిపోయేట‌ట్లుగా ఆయ‌న మ‌ద్యం స్కామ్ చేశాడ‌ని, ఈ స్కామ్ నుంచి ఆయ‌న బ‌య‌ట‌ప‌డ‌లేడ‌ని, బ‌య‌ట‌ప‌డ‌డం చాలా క‌ష్ట‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  త‌న‌కు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇచ్చి, విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తొలి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇచ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుపై నిత్యం విమ‌ర్శ‌లు కురిపిస్తూ, జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఐవైఆర్ నోటి నుంచి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు రావ‌డం..ప‌రిశీల‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంటే ఈ స్కామ్‌లో జ‌గ‌న్ ఎంత‌లోతులో దిగ‌బ‌డిపోయాడో అర్థం చేసుకోవ‌చ్చు.

క‌మీష‌న‌ర్ ఎక్సైజ్‌పోస్టును చాలా సీనియ‌ర్ అధికారి, అదీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి నిర్వ‌హించాల్సిన పోస్టును ఒక అనామ‌కుడు, ఇన్‌ఫ‌ర్మేష‌న్ అధికారిని తీసుకువ‌చ్చి పెట్ట‌డమే కుంభ‌కోణానికి మొద‌టి అడుగు అని ఆయ‌న అన్నారు. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అయితే..ఎంతో కొంత అవినీతి చేస్తారు కానీ..ఇంత‌లా చేయ‌ర‌ని, ఒక‌వేళ వీరు చేస్తున్నా..వారు అడ్డుకునేవార‌ని, ఏదో ర‌కంగా బ‌య‌ట‌కు వ‌చ్చేవార‌ని, కానీ ఇప్పుడు ఆ అవ‌కాశ‌మే లేకుండా చేసుకున్నార‌ట‌. అస‌లు మ‌ద్యం పాల‌సీనే తాము సొమ్ములు సంపాదించుకునేందుకు ఒక దారిగా చేసుకున్నార‌ని, అన్నిచోట్లా డిజిట‌ల్ పేమెంట్ ఉంటే..దీనికి మాత్రం క్యాష్ పేమెంట్ పెట్టారంటేనే స్కామ్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌న్నారు. మ‌ద్యం కుంభ‌కోణంలో సొమ్ములు తీసుకోవ‌డం...దాచ‌డం..అన్నీ త‌న‌కు కావాల్సిన వారినీ, అదీ త‌న కులం వారినే పెట్టుకుని దోచేశార‌న్నారు. అంద‌రికీ తెలిసిన బ్రాండ్లును మార్కెట్‌లోకి తీసుకురాకుండా ప‌నికిమాలిన, నాసిర‌కం మ‌ద్యాన్ని పేద‌ల‌తో తాగించార‌ని, దాంతో..వారి ఆరోగ్యం చెడిపోయి వేల మంది చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని ఆయ‌న ఆక్షేపించారు.

ఢిల్లీలో లిక్క‌ర్ స్కామ్ చేసిన అర‌వింద్ క్రేజీవాల్ దొరికిపోయి..ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. ఇదే స్కామ్‌లో కెసిఆర్ కుమార్తె కూడా దొరికిపోయింది. ఝార్ఖండ్‌లో కూడా ఇటువంటి స్కామ్ జ‌రిగింద‌ని, అయితే ఆంధ్రా లిక్క‌ర్ స్కామ్ వాటన్నింటిని మించి పోయింద‌ని, ఇంత విచ్చ‌ల‌విడిగా, నిసిగ్గుగా, ఓపెన్‌గా దోచుకున్న‌వారు ఎక్క‌డోచోట దొరికిపోతార‌ని, దీనివ‌ల్ల ఆయ‌న రాజ‌కీయ‌జీవితం ముగిసిపోయినా..ఆశ్చ‌ర్యం పోన‌వ‌స‌రం లేద‌ని ఐవైఆర్ అంచ‌నావేస్తున్నారు. మొత్తం మీద‌..జ‌గ‌న్‌ను నిత్యం స‌మ‌ర్ధించే ఐవైఆర్ తొలిసారిగా జ‌గ‌న్ అవినీతిపై బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను కూట‌మి వాళ్లు సోష‌ల్ మీడియాలో భారీ స్థాయిలో షేరింగ్‌లు చేస్తున్నారు.