Janam Online

జ‌గ‌న్ ప‌రామ‌ర్శ యాత్ర వాయిదా ఎందుకు..?

  1. మిధున్‌రెడ్డిని ప‌రామ‌ర్శించ‌ని జ‌గ‌న్‌...!
  2. రాజ‌మండ్రి యాత్ర ప‌దే ప‌దే వాయిదాలు ఎందుకు..?
  3. జ‌గ‌న్‌ను రాజ‌మండ్రి వెళ్ల కుండా అడ్డుకుంటుందెవ‌రు..?
  4. చెవిరెడ్డి, ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిల‌కు ప‌రామ‌ర్శ ఉండ‌దా..?
  5. పెద్దిరెడ్డి కుటుంబం బిజెపి ట‌చ్‌లోకి వెళ్లిందా..?
  6. అందుకే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ వాయిదా ప‌డిందా..?
  7. ఇవి కాక ఇంకేమైనా నిగూఢ ర‌హ‌స్యాలు ఉన్నాయా..?
  8. జ‌గ‌న్‌ను స‌జ్జ‌ల అడ్డుకుంటున్నారేమోన‌న్న అనుమానాలు..?

వైకాపా అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాజ‌మండ్రి యాత్ర ప‌దే ప‌దే వాయిదాలు ఎందుకు ప‌డుతోంది. మ‌ద్యం కుంభ‌కోణంలో రాజంపేట పార్ల‌మెంట్ స‌భ్యుడు, లోక్‌స‌భ‌లో పార్టీ నాయ‌కుడు అయిన మిధున్‌రెడ్డి సిట్ అరెస్టు చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంపించింది. ఈ కుంభ‌కోణంలో ఆయ‌నే కీల‌క‌పాత్ర‌ధారి అని సిట్ పేర్కొంటోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ప‌లువురిని సిట్ అరెస్టు చేసింది. అయితే..ఈ కేసులో అరెస్టు అయిన కీల‌క‌నేత మిధున్‌రెడ్డిని జైలులో జ‌గ‌న్ ప‌రామ‌ర్శ చేస్తార‌ని ఇప్ప‌టికే ప‌లుసార్లు పార్టీ ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి గ‌త మంగ‌ళ‌వారం జ‌గ‌న్ రాజ‌మండ్రి వెళ్లాల్సింది. కానీ..ఎందుకో ఆ ప‌ర్య‌ట‌న వాయిదా...ప‌డింది. త‌రువాత 5వ తేదీన వెళ‌తార‌ని ప్ర‌చారం సాగింది. అయితే మ‌ళ్లీ మంగ‌ళ‌వారం వ‌చ్చింది కానీ..ఆయ‌న మాత్రం రాజ‌మండ్రి వెళ్ల‌లేదు. ఆయ‌న తాడేప‌ల్లిలో ఉండి కూడా మంగ‌ళ‌వారం రాజ‌మండ్రి వెళ్ల‌లేదు. రాజ‌మండ్రి ప‌ర్య‌ట‌న వాయిదాతో ఆయ‌న ఇక్క‌డ పార్టీ నాయ‌కుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. నాయ‌కులంతా ఆయ‌న రాజ‌మండ్రి వెళ‌తార‌ని భావిస్తే..అందుకు విరుద్దంగా ఆయ‌న ఇక్క‌డే హ‌డావుడిగా పార్టీ నాయ‌కుల‌తో స‌మీక్ష‌లు చేస్తూ కాలం గ‌డిపేసి..త‌రువాత బెంగుళూరుకు వెళ్లిపోయారు.  ఎందుకు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ యాత్ర ప‌దే ప‌దే వాయిదాప‌డుతోంది అన్న‌దానిపై వైకాపా నాయ‌కుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ ఓడిపోయిన త‌రువాత కూట‌మి ప్ర‌భుత్వం ప‌లువురి నాయ‌కుల‌పై వివిధ కేసుల‌ను బుక్ చేసి జైలుకు పంపించింది. ఇలా జైలుకు పంపించిన నాయ‌కులంద‌రినీ జ‌గ‌న్ జైలుకు వెళ్లి ప‌రామ‌ర్శించివ‌చ్చారు. మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, మాజీ ఎంపి నందిగం సురేష్‌, మాజీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఇలా ప‌లువురి నాయ‌కుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. మ‌రి ఒక‌ర‌కమైన నేత‌ల‌నే ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్ కీల‌క‌మైన మిధున్‌రెడ్డిని ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేద‌న్న చ‌ర్చ పార్గీ వ‌ర్గాల్లో ఉంది. ఎందుకు..? ఆయ‌న ప‌దే ప‌దే రాజ‌మండ్రి ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకుంటున్నారు...? ఆయ‌న‌ను రాజ‌మండ్రి వెళ్ల‌నీయ‌కుండా..అడ్డుకుంటుంది..ఎవ‌రు..?  దీని వెనుక ఎవ‌రి హ‌స్తం ఉందో..అస‌లు వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో..అంతుచిక్క‌డం లేద‌ని వైకాపా నాయ‌కుడు ఒక‌రు మా ప్ర‌తినిధితో వ్యాఖ్యానించారు.

భూమ‌న వ‌ద్దంటున్నారా..? 

చిత్తూరు జిల్లాకు చెందిన మిధున్‌రెడ్డిని జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌నీయ‌కుండా ఉండ‌డానికి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డే కార‌ణ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కూ పెద్దిరెడ్డి కుటుంబానికి మొద‌టి నుంచీ ప‌డ‌దు. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో భూమ‌న జిల్లాలో ప‌ట్టుపెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. గ‌త వైకాపా ప్ర‌భుత్వంలో అత్యంత కీల‌క‌మైన శాఖ‌ను పెద్దిరెడ్డి నిర్వ‌హించార‌ని, జిల్లా మొత్తం ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచింద‌ని, ఆయ‌న ఏమి చెబితే అది జ‌రిగింద‌ని, అప్ప‌టి త‌ప్పుల‌కు, దోపిడీకి పెద్దిరెడ్డే కార‌ణ‌మ‌ని, ఇప్పుడు ఆయ‌న‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఇబ్బందులు పెడుతుంది క‌నుక ఆయ‌న‌కు జ‌గ‌న్ వైపు నుంచి ఎటువంటి స‌హ‌కారం లేకుండా చేయ‌డానికి య‌త్నాలు చేస్తున్నార‌ని వైకాపా నాయ‌కులు భావిస్తున్నారు. నేరుగా భూమ‌న ఈ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం లేద‌ని, ఆయ‌న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో చెప్పిస్తున్నార‌ని, జ‌గ‌న్‌ను రాజ‌మండ్రి వెళ్ల‌కుండా ఆప‌డంలో స‌జ్జ‌ల హ‌స్తం ఉంద‌నే ప్ర‌చారం ఉంది. కాగా పెద్దిరెడ్డి కుటుంబం బిజెపి ట‌చ్‌లోకి వెళ్లింద‌ని, వాళ్లు బిజెపిలో చేర‌తార‌నే అనుమానంతోనే జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌ను ప‌దే ప‌దే వాయిదా వేసుకుంటున్నార‌ని మ‌రో ప్ర‌చారం ఉంది.


సిగ్గేసిందా...?

కాగా మ‌ద్యం కుంభ‌కోణంలో త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, అప్ప‌టి సిఎంఓ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ధ‌నుంజ‌య‌రెడ్డి, త‌న‌కు ఓ ఎస్టీడీగా ప‌నిచేసిన కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిలతో పాటు, త‌న‌కు స‌న్నిహితులైన క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, గోవింద‌ప్ప బాలాజీలు అరెస్టు అయి మాసాలు గ‌డుస్తున్నా..జ‌గ‌న్ వాళ్ల‌ను ప‌ల‌క‌రించ‌లేదు. మ‌ద్యం కేసులో వీరంతా కీల‌క నిందుతులుగా సిట్ పేర్కొంది. అయితే..అప్ప‌టి మ‌ద్యం పాల‌సీలో కుంభ‌కోణ‌మే లేద‌ని, అస‌లు కేసే లేద‌ని మొన్న‌టి దాకా జ‌గ‌న్ వాదించారు. అది అక్ర‌మ కేసు అని ప‌దే ప‌దే పేర్కొంటున్నారు. మ‌రి అక్ర‌మ కేసు అని చెబుతోన్న ఆయ‌న అక్ర‌మ కేసులో అరెస్టు అయిన త‌న‌వాళ్ల‌ను ప‌రామ‌ర్శించాలి క‌దా..?  వ‌ల్ల‌భ‌నేని వంశీ, కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, నందిగం సురేష్‌ల కంటే వీళ్లు తీసిపోయారా..? మ‌రి ఎందుకు జ‌గ‌న్ వాళ్ల‌ను ప‌రామ‌ర్శించ‌డం లేదు. బ‌హుశా వాళ్ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి సిగ్గేసి ఉంటుంది. నిన్న‌టి దాకా..24గంట‌లూ త‌న‌తో ఉన్న‌వారిని జైలులో చూడాల్సి రావ‌డం ఆయ‌న‌కు సిగ్గుగా అనిపించిందేమో..అని వైకాపా నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. ఏమిట‌న్నా..మ‌మ్మ‌ల‌ను జైలు పాలు చేశావ‌ని వాళ్లు అడుగుతారేమో అన్న భ‌యం ఉందేమో..లేక వాళ్లు బెదిరింపుల‌కు దిగుతారేమో అన్న భ‌యం కూడా ఉందేమో అని ఆయ‌న అన్నారు. కాగా.. మ‌ద్యం కుంభ‌కోణంలో సంపాందించిన అక్ర‌మ సొత్తు వీళ్లు స‌రిగా పంచ‌లేదేమో..? జ‌గ‌న్ వాటాను ఆయ‌న‌కు స‌రిగా ఇవ్వ‌లేదేమో..ఇప్పుడు ఈ కేసులో బ‌య‌ట‌ప‌డుతోన్న సొత్తు..దాచుకున్న సంప‌ద‌న‌, కొన్న ఆస్తులు చూసి జ‌గ‌న్‌కు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంద‌ని, త‌న‌కు తెలియ‌కుండా, త‌న‌కు ఇవ్వ‌కుండా ఇంత సంపాదించారా..?  వీళ్లు ఇంత న‌మ్మ‌క ద్రోహానికి పాల్ప‌డ‌తారా..? అనే కోపంతోనే ఆయ‌న వారిని ప‌రామ‌ర్శించ‌డం లేదేమో అని కూడా ఆయ‌న అన్నారు. మొత్తం మీద జ‌గ‌న్ మ‌ద్యం కుంభ‌కోణ నిందితుల‌ను పార్టీ అధ్య‌క్షుడి హోదాలో ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం పార్టీలో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది.