ఆమె ఒకప్పుడు సినీనటి. తెలుగుదేశం పార్టీకి చెందిన స్వర్గీయ మాజీ ఎంపి శివప్రసాద్ ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఆమెకు ఉన్న టాలెంట్‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. బాగానే సంపాదించుకుంది. తరువాత కాలంలో చిన్నగా శివప్రసాద్ సహాయంతో తెలుగుదేశం పార్టీలో చేరింది. టిడిపిలో చేరినప్పుడు ఆమె అప్పటి కాంగ్రెస్ పార్టీపై గట్టిగానే పోరాడింది. అయితే టిడిపిలో ఉన్నన్నాళ్లు ఆమెకు రాజకీయంగా ఏదీ కలిసిరాలేదు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయింది. దీనికి కులమే కారణమంటూ ఆమె టిడిపిని వదిలి కాంగ్రెస్‌లో చేరాలనుకుంది. దీనిపై అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిని కలసి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతలోనే వై.ఎస్ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో..కాంగ్రెస్‌లో ఆమె చేరడం వాయిదా పడింది. అదే సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లేదని జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి స్వంతంగా పార్టీ పెట్టుకోవడంతో సదరు నటి నేరుగా వైకాపాలో చేరిపోయింది. దాంతో ఆమెకు రాజకీయంగా అప్పటి వరకు ఎదుర్కొన్న గడ్డుపరిస్థితులు క్రమంగా తగ్గిపోయాయి. వైకాపాలో చేరిన తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని స్పల్ఫ తేడాతో ఓడించి అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. అసెంబ్లీలో నానా రచ్చ చేసినా 2019 జగన్ హవాలో ఆమె మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తరువాత మంత్రి కూడా అయింది. మంత్రి అయినా..అప్పట్లో ఆమె జబర్థస్త్‌ను విడిచిపెట్టడానికి పెద్దగా మనస్కరించలేదు. అయితే..పార్టీ అధినేత కలుగ చేసుకోవడంతో అయిష్టంగానే జబర్ధస్త్‌ను వదిలేసింది. ఈ లోపు ఆడుదాం..ఆంధ్రా అంటూ సొమ్ములు కొల్లగొట్టిందనే ఆరోపణలు, ఇతర అవినీతి ఆరోపణలు భారీగానే ఆమె మీద వచ్చాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో ఘోరాతిఘోరంగా సదరు నటి ఓడిపోయింది. దీంతో ఇక తనకు ఆంధ్రాలో ఛాన్స్ దొరకదని చెన్నె వెళ్లి రాజకీయాలు చేయాలని భావించింది. అయితే అక్కడ నుంచి సానుకూలత లేకపోవడంతో అయిష్టంగానే ఇప్పుడు వైకాపా రాజకీయాల్లో భాగం అవుతోంది. అయితే..ఆమెను వివిధ ప్రాంతాల్లో జరిగే వైకాపా సమావేశాల్లో ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని అధిష్టానం నాయకులకు ఆదేశించింది. దీంతో..ఆమెను వివిధ వర్గాల నాయకులు తమ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. అయితే..ఈ సమావేశాలకు ఆమె అంత సులువుగా రావడం లేదట. తనకు జబర్థస్త్‌లో ఒక షో చేస్తే..ఎంత వస్తుందో..అంత ఇస్తేనే వస్తానని ముందే చెబుతోందట. తాను తన నియోజకవర్గంలో ఉంటే..అక్కడకి కారును పంపించాలని, దానితో పాటు ఇతర ఖర్చులు ఇవ్వాలని ముందే చెబుతోందట. ఒకవేళ తాను హైదరాబాద్‌లో ఉన్నా కూడా అదే విధమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తోందట. ఆమెను పార్టీ సమావేశాలకు తీసుకువస్తే..కార్యకర్తలు, నాయకుల్లో జోష్ వస్తుందని, ఆమె లోకేష్‌ను, చంద్రబాబును పరుష పదజాలంతో దూషిస్తుంటే వచ్చిన కార్యకర్తలు పొంగిపోతారనే భావనతో ఎక్కువ మంది నాయకులు ఆమెను ఆహ్వానిస్తున్నారట. అయితే..ఆమెను తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చును చూసి వారు లబో దిబో మంటున్నారట. ఇదెక్కడి పార్టీరా..బాబూ..స్వంత పార్టీ సమావేశాలకు వచ్చేందుకు కూడా సొమ్ములు డిమాండ్ చేస్తారా...? వారు ధీర్ఘాలు తీస్తున్నారట. ఆమె, ఆమెతో పాటు కర్నూలుకు చెంది ఓ యువనేతను కూడా తీసుకువస్తున్నారని, వీరిద్దరూ ఉంటే సభ కానీ సమావేశంకానీ జోష్‌గా జరుగుతుందన్న భావన పార్టీ నాయకుల్లో ఉందట. దాంతో వారు ఏమి డిమాండ్ చేసినా..సమావేశాలు పెట్టుకునేవారు ఏదో విధంగా వారు అడిగినంత సమర్పించుకుని వారిని రప్పిస్తున్నారట. మొత్తం మీద..ఈ నటి వ్యవహారం వైకాపాలో చర్చనీయాంశంమైంది.