Janam Online

టిడిపికి ఇబ్బందులు తెచ్చిపెట్టిన అచ్చెన్న...!

రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆడ‌బిడ్డ నిధి అమ‌లు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల‌ని, అలా అయితేనే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌గ‌లుగుతామ‌ని ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ర‌కంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌మ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పిన‌ట్లేయింది. ఒక‌వైపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..హామీ ఇచ్చిన ఒక్కో ప‌థ‌కాన్ని అమ‌లు చేసుకుంటూ వ‌స్తున్నారు. త‌ల్లికి వంద‌నం, ఉచిత సిలీండ‌ర్‌, రైతుసుఖీభ‌వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి య‌త్నిస్తోంది. కొంత వ‌ర‌కూ చేయ‌గ‌లిగింది. అయితే ఇప్పుడు అత్యంత సీనియ‌ర్ నేత అయిన అచ్చెన్నాయుడు ఆడ‌బిడ్డ నిధి గురించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.


ఒక‌వైపు ప్ర‌తిప‌క్షం సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయ‌డం లేదంటూ నానా గంద‌ర‌గోళం చేస్తుంటే..దానికి మ‌ద్ద‌తు ఇస్తోన్న‌ట్లుగా అచ్చెంనాయుడు చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో అచ్చెన్నాయుడు వ్య‌వ‌హారంపై పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా ఉన్న అచ్చెంనాయుడు త‌న శాఖ గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి కానీ, ఇత‌ర్ర‌తా వ్య‌వ‌సాయ‌శాఖ‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌పై కానీ ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌న పేషీని అవినీతిప‌రుల‌తో నింపేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మంత్రి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా..ఆయ‌న‌ను ప‌క్క‌న‌పెట్ట‌కుండా కొన‌సాగిస్తున్నారు. అదేమంటే..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌ల వ‌ద్ద అంతా నిజాయితీప‌రులున్నారా..? అంటూ అంత‌రంగికుల‌తో ప్ర‌శ్నిస్తున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో కూడా పార్టీలేదూ..బొక్కాలేదు..అంటూ అసంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. సీనియ‌ర్ లీడ‌ర్ అయిన ఆయ‌న వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించ‌డం, ప్ర‌భుత్వానికి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే..ఆయ‌న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తార‌నే ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారాన్ని రేపుతాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.