83,865 మందికి రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
త్వరలో లబ్దిదారులతో 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇళ్లకు క్యూఆర్ కోడ్ డోర్ నెంబర్లు
తాగునీరు కలుషితం కాకుండా స్మార్ట్ వాటర్ పైప్ లైన్ గ్రిడ్
123 యూఎల్బీల్లో మౌలిక వసతులకు 100 రోజుల ప్రణాళిక అమలు
త్వరలోనే మరో 70 అన్న క్యాంటిన్లు ప్రారంభం
మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, మార్చి 18 : గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లో ప్రతీ ఇంటికి క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని సీఎం చెప్పారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకుని అన్ని వివరాలు క్యూఆర్ కోడ్‌తో లింక్ చేయాలన్నారు. భారత్ బిల్, మన మిత్రతో అనుసంధానించాలని చెప్పారు. అలాగే ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైపులైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. పండ్లు, పాలు, కూరగాయలు అమ్మేవాళ్ల వివరాలు రిజిస్టర్ చేయాలని సూచించారు.
17 లక్షలు దాటిన పురమిత్ర రిజిస్ట్రేషన్లు
మరోవైపు పురమిత్ర యాప్‌ను రాష్ట్రంలో 17 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని ద్వారా అన్ని మున్సిపల్ సేవలు పొందగలుగుతున్నారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ యాప్ ద్వారా 92 వేల గ్రీవెన్స్‌లు రాగా, వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. పురమిత్ర యాప్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను బట్టి, ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాన్ని హాట్ స్పాట్‌గా గుర్తించి స్థానిక అధికారులు అక్కడ పర్యటించి సమస్యలు పరిష్కరించేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతో పాటు, అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. సీసీ కెమెరా విజువల్స్, డ్రోన్ షాట్స్, శాటిలైట్ మ్యాప్స్ వంటి విషయాల్లో డేటా ఇంటిగ్రేషన్ జరగలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ బాండ్స్ జారీతో పాటు, అర్బన్ అథారిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో 484 కి.మీ మేర రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉండగా... వాటిలో ముందుగా రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తిరుపతిలో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో 123 యూఎల్బీలు ఉంటే... 100 చోట్ల మాత్రమే గతంలో ఎన్నికలు జరిగాయని... ఇందులో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు ఉన్నాయని... మరో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ మార్చి 17 నాటికి 86 యూఎల్బీల్లో పాలక సంస్థల కాలపరిమితి ముగిసిందని వివరించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా... రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలును కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టాలన్నారు. స్వర్ణముఖి, కపిల తీర్థం జల వనరులతో తిరుపతిలో సమర్ధ నీటి నిర్వహణ జరగాలని సీఎం అన్నారు. విజయవాడ-అమరావతి కెనాల్ సిటీలుగా, విశాఖ బీచ్ సిటీగా తీర్చిదిద్దాలని చెప్పారు.
112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు
మున్సిపల్ షాపు అద్దెలు... ప్రస్తుతం 3 ఏళ్లకు ఒకేసారి 33 శాతం పెంచడానికి బదులుగా ప్రతీ ఏటా తక్కువ శాతం మాత్రమే పెరిగేలా కొత్త విధానం తీసుకురావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.15,893 కోట్ల విలువైన మొత్తం 622 మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2024 నుంచి ఇప్పటివరకు పట్టణాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తకు గాను... 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని జూన్ కల్లా పూర్తి స్థాయిలో తొలగింపు జరుగుతుందన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో విలీనమైన గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అధికారుల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు.
అన్నక్యాంటిన్లకు ఏడాదికి రూ.167 కోట్ల వ్యయం
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మరో 70 అన్న క్యాంటిన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అన్న క్యాంటిన్లను సూపర్ సక్సెస్ చేసేందుకు... రాజస్థాన్‌లోని అన్నపూర్ణ రసోయి, తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 204 అన్న క్యాంటీన్లకు ఏడాదికి రూ.167 కోట్లు వ్యయం అవుతోందని అధికారులు తెలిపారు. అయితే అన్న క్యాంటిన్లను కార్పొరేట్ సంస్థలు, దాతల సాయంతో నడిపించేలా పటిష్టం చేయాలని సీఎం సూచించారు.
అమరావతిలో వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు
మరోవైపు అమరావతి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. 72 కి.మీ మేర పవర్ డక్ట్ ద్వారా అమరావతికి విద్యుత్ సరఫరా చేసే పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే అమరావతిలో గాలి నాణ్యత పెరిగేలా చూడాలన్నారు. పెద్దఎత్తున నిర్మాణం పనులు జరుగుతున్నందున స్ప్రింక్లర్ల వినియోగం ద్వారా దుమ్ము, ధూళిని కట్టడి చేయాలన్నారు. రాజధానిలో టిప్పర్లు ఓవర్ లోడ్‌తో వెళ్లకుండా, తప్పనిసరిగా కవర్లు కప్పేలా రవాణా జరగాలన్నారు. రాజధానిలోని అన్ని రోడ్లలో టిప్పర్లు తిరగకుండా... కొన్ని నిర్దేశించిన మార్గాల్లోనే వాటిని అనుమతించాలన్నారు. అమరావతిలో నిర్మించ తలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ గురించి సీఎం చర్చించారు. అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్లు సిద్ధమయ్యాయని అధికారులు తెలపగా, నెలాఖరులో వాటిని పరిశీలిస్తానని సీఎం చెప్పారు. విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, రైతు బజార్లు, హోటళ్లు వంటివి రాజధానికి ఏకకాలంలో రావాలన్నారు. రాజధాని అమరావతి రహదారులను విజయవాడ, మంగళగిరి, తాడేపల్లితో త్వరితగతిన కనెక్ట్ చేయాలన్నారు. సమీక్షలో చివరిగా టౌన్, కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్ రూపొందించిన ప్రజాహిత ప్రణాళిక పుస్తకాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.