Janam Online

తిరుమలలో నో రీల్స్ః టీటీడీ హెచ్చరిక

అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో సోష‌ల్ మీడియా రీల్స్ తీస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఇటీవలి రోజుల్లో కొంతమంది తిరుమల ఆలయం ముందు అశ్లీలంగా, భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ వీడియోలు (రీల్స్) తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారని టీటీడీ దృష్టికి వ‌చ్చింది. దీనిపై టీటీడీ స్పందిస్తూ ఈ హెచ్చ‌రిక‌ల‌ను చేసింది.  తిరుమ‌ల‌లో ఈ విధమైన అనుచితమైన, అసభ్యమైన ప్రవర్తనలు తిరుమల వంటి పవిత్రమైన ఆధ్యాత్మిక స్థలంలో తగవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ చర్యలు భక్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తాయ‌ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా భంగం కలిగిస్తున్నాయని పేర్కొంది. తిరుమల ఒక భక్తి మరియు పూజ స్థలం మాత్రమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. లక్షలాది మంది శ్రీవారు దర్శనానికి వచ్చే భక్తుల భావాలను గౌరవించడం మనందరి బాధ్యత అని పేర్కొంది. టీటీడీ విజిలెన్స్‌ మరియు భద్రతా సిబ్బంది, ఈ విధంగా వీడియోలు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విధమైన చర్యలు చేపట్టిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విడుదలలో పేర్కొన్నారు.తిరుమల యొక్క ఆధ్యాత్మికతను, పవిత్రతను కాపాడేందుకు అశ్లీల వీడియోలు, రీల్స్ తీసే పనులకు భక్తులు దూరంగా ఉండి సహకరించాలని టీటీడీ కోరింది.