కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు అవుతున్నా నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయలేదు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఇంకెన్నాళ్లు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూడాలనే కోపం ఆశావాహుల్లో ఉంది. ఈ విషయాన్ని అధిష్టానం గ్రహించడంతో..ఇప్పుడు మరికొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి కూటమి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీపావళి తరువాత కొన్ని పోస్టులను భర్తీ చేస్తారంటున్నారు. ఈసారి మీడియా రంగానికి చెందిన వారికి పదవులు ఇస్తారనే ప్రచారం ఉంది. మీడియా సలహాదారు, ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్, సిఈఓ పోస్టులను భర్తీ చేస్తారంటున్నారు. దీనితో పాటు..మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టులను కూడా నింపబోతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఓ జర్నలిస్టుకు ఎస్వీబీసీ ఛానెల్ పదవి అప్పగించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ జర్నలిస్టు ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడును, ఆయన తనయుడు లోకేష్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. గతంలో ఇదే జర్నలిస్టు చంద్రబాబును ఆయన మంత్రివర్గ సహచరులను తీవ్రస్థాయిలో దూషించారు. 2014-19 సమయంలో సదరు జర్నలిస్టు ఓ ఆన్‌లైన్ పత్రికలో అప్పట్లో మంత్రుల గురించి నీచాతినీచంగా రాశారు. అయితే..ఇదే జర్నలిస్టు ఇటీవల ఎన్నికలకు ముందు కూటమికి మద్దతుగా వ్యాసాలు రాశారు. దీంతో..ఇప్పుడు ఈయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎస్వీబీసీ పదవిని అప్పగిస్తారంటున్నారు. ఇటీవల కాలంలో ఈయన భజన మామూలుగా లేదని జర్నలిస్టు వర్గాలు చెప్పుకుంటున్నాయి. పదవిపై హామీ రావడంతోనే..ఆయన ఈ విధంగా భజన చేస్తున్నారంటున్నారు.
టెన్త్‌క్లాస్ పేపర్ లీక్ కేసులో నిందితుడు...! ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదవతరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో సదరు జర్నలిస్టు ముఖ్యనిందితుడు. ఇతను ఈ కేసులో అరెస్టు కూడా అయ్యారు. అప్పట్లో ప్రభుత్వ సెక్యూరిటీ ప్రెస్ ప్రింట్ అవుతోన్న పరీక్ష పేపర్లను ఇతను దొంగిలించి పేపర్లును లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతనే పరీక్ష పేపర్లను లీక్ చేసి తరువాత అతను పనిచేస్తోన్న ప్రముఖ పత్రికలో పదవతరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని అతనే వార్త రాసి అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాడు. అప్పట్లో ఈ పేపర్ల లీక్ అంశంపై ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ను, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముద్దుకృష్ణమనాయుడుని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఉద్యమాన్ని నిర్వహించాయి. చివరకు దీనిపై ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఒక కమీషన్ ఏర్పాటు చేసి వాస్తవాలను బట్టబయలు చేశారు. అప్పట్లో ప్రభుత్వ సెక్యూరిటీ ప్రెస్‌లో పరీక్ష పేపర్లు ప్రింట్ అయ్యేవి. అత్యంత భారీ సెక్యూరిటీ ఉన్న ఈ ప్రెస్‌లోకి సదరు జర్నలిస్టు వర్కర్‌గా బనియన్‌తో వెళ్లారు. అప్పట్లో లెటర్‌ప్రెస్ ప్రింటింగ్ ఉండేవి. దీంతో..లెటర్ ప్రెస్‌లో ఉన్న అచ్చులను తన బనియన్‌పై ప్రింటుచేసుకుని, వాటిని తీసుకెళ్లి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని నానా రభస చేశాడు సదరు జర్నలిస్టు. ఇటువంటి జర్నలిస్టును ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం తరుపున అవార్డును కూడా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సదరు జర్నలిస్టు మాట్లాడుతూ తనకు చంద్రబాబు ఎవరో తెలియదని, తన పనితనం చూసి ప్రభుత్వమే అవార్డు ఇచ్చిందని గొప్పులు చెప్పుకుంటున్నారు. 2014-19 మధ్య సదరు జర్నలిస్టు చంద్రబాబు మంత్రులను అనరాని, రాయకూడని మాటలతో విమర్శించారు. ఇలాంటి ఇతనికి ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది.
కాగా..మీడియా సలహాదారు పోస్టును బ్రాహ్మణ వర్గానికి చెందిన జర్నలిస్టుకు ఇవ్వబోతున్నారు. ఈయన నిజంగా దీనికి అర్హుడే. మొదటి నుంచి చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ఈ జర్నలిస్టుకు ఇప్పటిదాకా నామినేటెడ్ పోస్టు రాకపోవడం ఆశ్చర్యకరమే. బ్రాహ్మణ వర్గానికి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా టిడిపి ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకోవాల్సిన అసరం ఎంతైనా ఉంది. సదరు జర్నలిస్టుకు ప్రాధాన్యత కలిగిక మీడియా సలహాదారు పదవి ఇస్తే ఆయనను గౌరవించినట్లే. అదే విధంగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఇచ్చినట్లే.
అధికారుల బదిలీలు...!
కాగా దీపావళి తరువాత కీలకమైన కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది. కొంత మంది సీనియర్ ఐఏఎస్‌లు తమకు కీలక స్థానాలు దక్కలేదని అలకపాన్పు ఎక్కారు. వీరికి ప్రాధాన్యత కలిగిన పోస్టులను ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారంటున్నారు. కాగా మరికొన్నిశాఖలకు హెచ్ఓడీలను నియమించనున్నారు. మరోవైపు..ఆర్‌టిఐ కమీషనర్ల నియామకం ఉందనే ప్రచారం ఉంది. గత కొంత కాలంగా దీనిపై వివాదాలు నడుస్తున్నాయి. ప్రధాన కమీషనర్ స్థానంలో ఇన్‌ఛార్జి కమీషనర్‌ను నియమిస్తారని, దీని వెనుక ఇద్దరు కీలక ఐఏఎస్‌లు చక్రం తిప్పుతున్నారంటున్నారు. మొత్తం మీద..దీపావళి తరువాత నామినేటెడ్ పోస్టులు, అధికారుల బదిలీలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.