తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు ఇంటిపోరుతో సతమతమవుతున్నాయి. రెండు పార్టీలు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాతే..వారికి ఇంటిపోరు జోరుగా మొదలైంది. స్వంత చెల్లెళ్లు..అధికారం కోసం..అన్నలను ఎదిరించి...వారికి సవాళ్లు విసురుతున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి స్వంత సోదరి ఆయనతో విభేదించారు. తనను రాజకీయంగా ఎదగనీయడం లేదని, తండ్రి సంపాదించిన ఆస్తులను సరిగా పంచలేదనే కోపంతో ఆయనకు వ్యతిరేకంగా ఆయన సోదరి షర్మిల సుధీర్ఘ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బాటలోనే తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ నడుస్తోంది. అయితే..ఆంధ్రాకు, తెలంగాణకు తేడా ఏమిటంటే..బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కెసిఆర్ జీవించి ఉండగానే..ఆయన కుమార్తె ఆయన పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. స్వంత తండ్రితో పాటు, సోదరుడు, బావ, మరో తమ్ముడికి వ్యతిరేకంగా కెసిఆర్ కుమార్తె కవిత పోరుబాట పట్టారు. తనకు అధికారంలో భాగస్వామ్యం కల్పించలేదని, ఆస్తులు సరిగా ఇవ్వలేదనే భావనతోనే ఆమె కూడా తిరుగుబాటు జెండానె ఎత్తారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను శాసించిన ఈ రెండు కుటుంబాల్లోని మహిళలు స్వంత బంధువులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, వారిని విమర్శించడం, దూషించడం...ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణలో వై.ఎస్.కుటుంబానికి, కెసిఆర్ కుటుంబానికి తిరుగులేదు. ఆంధ్రాలో వై.ఎస్. కుటుంబ అండతోనే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన జీవించినంత కాలం ఆయన కుటుంబం ఒకటే మాటపై నిలిచేది. ఎప్పడైతే..ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందారో ఇక అక్కడ నుంచి ఆయన కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అయితే. 2014లో వై.ఎస్.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం వై.ఎస్.కుటుంబం మొత్తం కలిసి పనిచేసింది. స్వయంగా ఆయన సోదరి షర్మిల 1500కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అయితే..ఆ ఎన్నికల్లో ఆయన ఓడినా..తరువాత 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. అయితే ఈ విజయం వెనుక తాను ఉన్నాననే భావనతో ఆయన సోదరి షర్మిల అధికారంలో భాగస్వామ్యం అడిగారు. అయితే..దీనిని నిర్విద్దంగా తిరస్కరించిన జగన్ ఆమెను బలవంతంగా తన పార్టీ నుంచి దూరం పెట్టారు. దీంతో..ఆమె తన అన్న ఓటమి కోసం, రాజకీయంగా పట్టుసాధించడం కోసం, ఆస్తుల కోసం..ఆయనపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన ఓటమి కోసం తీవ్రంగా యత్నించి సఫలీకృతురాలయ్యారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే జరుగుతోంది. తెలంగాణలో తిరుగులేని కెసిఆర్ కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయి. ఆయన కుమార్తె, కుమారుడు అధికారం కోసం ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతూ..పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె కవిత తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ.. అన్నాచెళ్లెళ్ల మధ్య పోరు జరగబోతోంది. రాజకీయంగా ఎంతో ఉన్నతిని సాధించిన వై.ఎస్.కుటుంబం, కెసిఆర్ కుటుంబం స్వంత మహిళలను మాత్రం వాడుకుని వదిలేశారని, ఈ రెండు కుటుంబాలు ఈ విషయంలో దొందూదొందేననే భావన వ్యక్తం అవుతోంది.