కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పిటిసి ఎన్నికల్లో అధికార టిడిపి కూటమి ఘనవిజయం సాధించడం పెద్దగా ఆశ్చర్యపడే విషయం కాదు. అయితే..ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..వై.ఎస్.కుటుంబానికి కంచుకోటలైన ఈ స్థానాల్లో వాళ్లు అజేయులని, వారు ఓడిపోరనే భావన ఇటు టిడిపితో పాటు..అటు వైకాపాలో కూడా మెండుగా ఉండేది. అయితే..వాళ్లేమీ అజేయులు కాదని, అధికారం లేకపోతే వాళ్లూ సామాన్య రాజకీయనాయకులేనని, గతంలో నిరూపితమైంది. తరువాత పలుసార్లు నిరూపితమైనా..కొంత మందికి అదో ఆనందం. పులివెందుల పులిని ఓడించడం అంత తేలిక కాదని చెప్పుకోవడం, లేని వీరదండాలు వేయడం కొందరికి వెర్రి ఆనందం. ఆ కుటంబాన్ని కావాలని వాళ్లు పొగుడుతారో..లేక అలా పొగిడినందుకు ఏమైనా నజరాలు ఉంటాయో..లేదో తెలియదు కానీ.. పులివెందులా..? వాళ్ల కోట..అంటూ..ఏవేవో చెబుతుంటారు. అయితే..ఇవన్నీ అధికారం ఉన్నప్పుడే..అధికారం లేకపోతే..ఎలా ఉంటుందో..ఇప్పుడు మరోసారి రుజువైంది. అధికారం ఉన్నప్పుడు అంగబలం, అర్థబలంతో ఎన్నికలను ఏకపక్షం చేసుకోవడం లేకపోతే..రాజీపడి..ఏదో విధంగా గెలవడం అదీ కాకపోతే..ప్రత్యర్థులను నిర్మూలించడం..ఇవే ఆ కుటుంబం ఇన్నాళ్లుచేసింది. అయితే..ఇప్పుడా అవకాశం లేకపోవడంతో, ప్రత్యర్థులు వారిని చిత్తుచిత్తుగా ఓడించారు. ఒకప్పుడు..వాళ్లు చేస్తే..అదేదో వీరత్వం అన్నట్లు..బిల్డప్‌లిచ్చే కొందరు జర్నలిస్టు..ఇప్పుడేదో అన్యాయం జరిగిందంటూ..పెడబొబ్బలు పెడుతున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోతామని జగన్మోహన్‌రెడ్డి కూడా ఊహించి ఉండరు. టిడిపి గెలుస్తుంది..కానీ..ఏదో కొంత తేడాతో..అయి ఉండవచ్చని ఊహించి ఉంటారు. అయితే అక్కడి ప్రజలు తమకు వచ్చిన అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకున్నారు. వై.ఎస్.కుటుంబంపై ఉన్న వ్యతిరేకతను ప్రపంచానికి చాటారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే..వై.ఎస్.కుటుంబం ఎన్నోసార్లు అక్కడ ఓడిపోయేదని ఈ ఎన్నిక రుజువు చేసింది. అయితే..ఈ మొత్తం వ్యవహారంలో టిడిపి గెలిచినా..దీన్ని తమ బలంగా వారు భావిస్తే..భవిష్యత్తులో ఘోరంగా దెబ్బతింటారు.
నంద్యాల గెలుపు...ఊహలపల్లకి..!
2014-19లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. అయితే..అప్పుట్లో రాయలసీమలో బలంగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఎలాగైనా గెలవాలని భావించి విస్తృతంగా ప్రచారం చేశారు. స్వయంగా ఎన్నికల బరిలోకి దిగి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును తూలనాడారు. ఆయనను నడిరోడ్డుపై కాల్చిపారేయాలని, ఇంకా ఏదేదో చేయాలని నోరుపారేసుకున్నారు. దీంతో చంద్రబాబు తనదైన వ్యూహాలను అమలు చేశారు. గ్రామాల వారిగా ఎమ్మెల్యేలను, మంత్రులను మొహరించి, భారీగా నిధులు ఖర్చు చేసి దాదాపు 24వేల మెజార్టీతో టిడిపిని గెలిపించారు. దీంతో..అప్పట్లో టిడిపికి మంచి ఊపువచ్చింది. ఈ ఊపును చూసుకుని..ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తమదే గెలుపనే ధీమాతో వ్యవహరించింది. కానీ..2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో టిడిపి తుడిచిపెట్టుకుని పోయింది. 24వేల మెజార్టీతో గెలిచిన నంద్యాలలో టిడిపి దాదాపు 44 వేల తేడాతో ఓడిపోయింది. ఉప ఎన్నికల్లోని బలం అసలైన బలం కాదని, సార్వత్రిక ఎన్నికలు వేరు..ఈ ఉప ఎన్నికలు వేరని టిడిపి తెలుసుకోకపోవడంతో..అప్పట్లో ఆ పార్టీ భారీగా నష్టపోయింది. ఇప్పుడు కూడా పులివెందుల జెడ్‌పిటిసి ఎన్నికల గెలుపును అతిగా ఊహించుకుంటే..అప్పటి ఫలితాలే పునరావృతం అవుతాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యంగానైనా అమలు చేస్తోంది. అయితే సంక్షేమపథకాలే ఎన్నికల్లో గెలిపించవని రుజువైన నేపథ్యంలో సంక్షేమంతోపాటు అభివృద్ది, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేయడం, స్థానిక నాయకులు గ్రామస్థాయిలో ప్రజలను వేధించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు కట్టు తప్పుతారో..అప్పుడే పార్టీ పతనానికి మొదట అడుగుపడుతుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిని అడ్డుకోకపోతే..ప్రమాద ఘంటికలు మొదలైనట్లే. పులివెందులను కొట్టాం..ఇంకేదో...కొట్టామంటే..నంద్యాల తరువాత వచ్చిన ఫలితాలే వస్తాయి...తస్మాత్ జాగ్రత్త!