Conflict Of Interest అంటోన్న న్యాయనిపుణులు
రాజ్యాంగ పదవులలో నియమితులైన వ్యక్తులు పూర్తిగా వాటి నియమనిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి వుంటుంది. తాను చేపట్టిన పదవి తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న సంస్థలతో అప్పటివరకు ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని తెంచుకోవాల్సి వుంటుంది. ఇతరత్రా ఏ విధమైన లాభదాయక పదవిలోనూ కొనసాగేందుకు చట్టం అనుమతించదు. అయితే ఎంతో కీలకమైన ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ (ఎపి రెరా) లో పదవులు పొందిన వారు ఇతరత్రా సంస్థలలో నాయకత్వ స్థానంలో కొనసాగుతుండటం చర్చనీయాంశం అయింది. ఎపి రెరా అనేది రాజ్యాంగ బద్ధ సంస్థ. ఈ సంస్థ కు అపరిమితమైన అధికారాలుంటాయి. క్వాసీ జ్యుడిషియల్ అధికారాలు కలిగి వుంటుంది. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంపై పూర్తి పర్యవేక్షణ కలిగివుండి, దాని వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఎపి రెరా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వుంటుంది. ఈ సంస్థ కార్యకలాపాలను సమీక్షించే అధికారం ఉన్నతాధికారులు లేదా సంబంధిత శాఖామంత్రి చివరకు ముఖ్యమంత్రికి సైతం ఉండదు. అంతటి కీలకమైన ఎపి రెరా లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత ఎపి రెరా కు చైర్మన్ తో పాటు నలుగురు డైరెక్టర్ ల నియామకం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవం, పూర్వ నేపథ్యం ఉన్న శివారెడ్డి ఎపి రెరా చైర్మన్ గా నియమితులయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలో నియామకం కావటంతో శివారెడ్డి రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధం ఉన్న సంస్థల భాగస్వామ్యాలు, అసోసియేషన్ పదవులతో పాటు రాజధాని పరిరక్షణ కు సంబంధించిన ఉద్యమ పదవులను సైతం వదలి వేశారు. అయితే ఎపి రెరా లో డైరెక్టర్ గా నియమితులైన గుంటూరు కు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఎపి టాక్స్ బార్ అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. ఈ సంస్థ లో ఆడిటర్లు, న్యాయవాదులు ఎంతోమంది సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరిలో చాలామంది రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ సంస్థలకు కన్సల్టెంట్ లుగా, న్యాయ సలహాదారులుగా ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఈ సంస్థ రియల్ ఎస్టేట్ తరఫున ఎపి రెరా ముందు సైతం తన వాదనలు వినిపించాల్సి వుంటుంది. ఎపి రెరా చైర్మన్ లేదా డైరెక్టర్ లు రియల్ ఎస్టేట్ విజియోగదారుల ఫిర్యాదులు, ఆయా సంస్థల వాదనలు విని తీర్పు చెప్పవలసి వుంటుంది. అయితే తీర్పు ఇచ్చే స్థానం లో ఉన్న వ్యక్తులు ఫిర్యాదిదారుల తరఫున వాదించాల్సిన సంస్థలకు ఏకంగా అధ్యక్ష స్థానంలో ఉండటం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇది ఎపి రెరా స్వతంత్ర ప్రతిపత్తి, నిబద్ధతకు ప్రతిబంధకంగా మారుతుంది. ప్రస్తుతం ఎపి రెరా డైరెక్టర్ గా ఉన్న దామచర్ల శ్రీనివాసరావు పైనా ఇదే తరహా చర్చ కొనసాగుతున్నది. ఈవిధంగా ఎపి రెరా డైరెక్టర్, దానితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న మరొక సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించటం "Conflict Of Interest " కిందకు వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అంతేగాక ఎపి టాక్స్ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు హోదాలో దామచర్ల నిలువెత్తు ఫోటోలతో కూడిన భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేయటం సైతం ఎపి రెరా నిబంధనలకు విరుద్ధం అన్న వాదన వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై న్యాయపరమైన వివాదం తలెత్తి న్యాయస్థానం గడప తొక్కకముందే తగు చర్యలు చేపట్టి ఎపి రెరా ప్రతిష్ట మసకబారకుండా చూడాలని నిపుణులు కోరుతున్నారు.