Janam Online

ఫ్రీ బస్సు ప్ర‌యాణంపై క్లారిటీ ఏదీ...!?

రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా అమ‌లులోకి తేబోతున్న మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప‌థ‌కానికి అంతా రంగం సిద్ధం అవుతోంది. వివిధ డిపోల్లో నూత‌న బ‌స్సుల‌ను సిద్ధం చేస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌ని కూట‌మి ఎన్నిక‌ల‌కు ముందు మ‌హిళ‌ల‌కు హామీ ఇచ్చింది. ఆ హామీ మేర‌కు ఏడాది త‌రువాత మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించేందుకు అనుమ‌తి ఇస్తోంది. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ఈ ప‌థ‌కం అమ‌లులోకి రానుంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు దీనిపై అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. ప్ర‌యాణీకుల‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అందించాల‌ని, దాని కోసం నూత‌న బ‌స్సుల‌ను కొనుగోలు చేయాల‌ని కూడా ఆయ‌న ఆదేశించారు. అదే విధంగా మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సులు న‌డ‌పాల‌ని కూడా ఆయ‌న అధికారుల‌కు సూచించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల్లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ ప‌థ‌కంలో అస‌లైన విష‌యంపై మాత్రం ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఇంత వ‌ర‌కూ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఉచిత బస్సు సౌక‌ర్యం ఎంత వ‌ర‌కు క‌లిగిస్తార‌నే దానిపై స్ప‌ష్టత లేదు. ముందుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు జిల్లాను ప్రాతిప‌దిక‌గా చేసుకుని ఉచిత బస్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని భావించారు. అయితే..దీని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పాత జిల్లాల‌ను పున‌ర్విభ‌జ‌న చేసింది. అంత‌కు ముందు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాల‌ను తీసుకువ‌చ్చింది. దీంతో ఇప్పుడు జిల్లాల విస్తీర్ణం చాలా త‌క్కువ‌గా ఉంది. ఇప్పుడు కొత్త జిల్లాల ప‌రిధిలో ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తే మ‌హిళ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు, అభ్యంత‌రాలు వ‌స్తాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. అతి చిన్న జిల్లాలు అవ‌డంతో..ఏ ఒక్క‌రికీ ఉప‌యోగం ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ పాత కృష్ణా జిల్లాను తీసుకుంటే ఇప్పుడు ఇక్క‌డ రెండు జిల్లాలు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లాలుగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎవ‌రైనా మ‌హిళ క‌నీసం పెన‌మ‌లూరు వెళ్లాల‌న్నా..ఉచిత బస్సు ప‌థ‌కం వ‌ర్తించ‌లేదు. పాత కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్న పెన‌మ‌లూరు విజ‌య‌వాడ ప‌రిధిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు పెన‌మ‌లూరు కృష్ణాజిల్లాలో ఉంది క‌నుక ఈ ప‌థ‌కం కింద పెన‌మ‌లూరు వెళితే..ఆ మ‌హిళకు ఉచిత బస్సు సౌక‌ర్యం వ‌ర్తించ‌దు. అదే విధంగా విజ‌య‌వాడ వార‌ధి దాటితే..గుంటూరు జిల్లా కింద‌కు వ‌స్తుంది. ఎవ‌రైనా మ‌హిళ అటు ఎయిమ్స్‌కు కానీ, ఇత‌ర కార్యాల‌యాల‌కు కానీ..వార‌ధి దాటి అవ‌త‌ల‌కు వెళితే ఉచిత బ‌స్సు సౌక‌ర్యం వ‌ర్తించ‌దు. దీంతో మ‌హిళ‌లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంది. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఏమి ఆలోచిస్తుందో..తెలియ‌దు. కానీ..ఇలా నూత‌న జిల్లాల ప‌రిధిలో ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తే..ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తుంది. అలా కాకుండా పాత జిల్లాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నా ఇబ్బందులు త‌ప్ప‌వు. 

100కిలోమీట‌ర్ల ప‌రిధి బెట‌ర్‌...!

ప్ర‌భుత్వం ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాలంటే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన బస్సుల్లో క‌నీసం వంద కిలోమీట‌ర్లు ప‌రిధిని నిర్ణ‌యిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. దీని వ‌ల్ల ప‌క్క ప‌క్కనే జిల్లాలు ఉన్నా పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌దు. ఇటు మ‌హిళ‌ల‌కు ఉప‌యోగం..అటు ప్ర‌భుత్వ ఉద్దేశ్యం నెర‌వేరుతుంది. మ‌రి ప్ర‌భుత్వం దీనిపై ఏమి చేస్తుందో..చూడాలి. ఒక‌వేళ అలా చేయ‌క‌పోతే పాత జిల్లాల ప‌రిధినైనా..పెట్టాలి. అలా కాకుండా నూత‌న జిల్లాల ప‌రిధి విధిస్తే ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు రావడం ఖాయం.