Janam Online

మ‌ద్యం కేసులో సంచ‌ల‌నంఃరూ.11కోట్లు ప‌ట్టివేత‌

మ‌ద్యం కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వేలాది కోట్లు దోచుకున్న మ‌ద్యం దొంగ‌ల‌ను సిట్ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టేసుకుంది. దోచుకున్న సొమ్మును బ‌య‌ట‌కు తెస్తోంది. ఈ క్ర‌మంలో ఈ రోజు రూ.11కోట్ల న‌గ‌దును ప‌ట్టుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం సులోచ‌నా ఫార్మ్‌గెస్టు హౌస్‌లో మ‌ద్యం సొమ్ముల డంపును సిట్ గుర్తించింది. లిక్క‌ర్‌స్కామ్‌లో 40వ నిందితుడైన వ‌రుణ్‌పురుషోత్తం ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం సిట్ త‌నిఖీలు నిర్వ‌హించ‌గా రాజ్‌క‌సిరెడ్డి, చాణ‌క్య‌ల ఆదేశాల మేర‌కు ఈ కంపెనీలో 12 అట్ట‌పెట్టెల్లో రూ.11కోట్ల సొమ్ముల‌ను దాచిపెట్టిన‌ట్లు సిట్ గుర్తించింది. ఈ మేరకు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. గ‌త వైకాపా ప్ర‌భుత్వ హ‌యాంలో భారీగా మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగిన వైనంపై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేయిస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసులో కీల‌క‌మైన రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డితో పాటు, అప్ప‌టి సిఎం కార్య‌ద‌ర్శి ధ‌నుంజ‌య‌రెడ్డి, ఓఎస్టీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డితో పాటు ప‌లువురిని సిట్ అరెస్టుచేసింది. అక్ర‌మ‌ద్యం ద్వారా దాదాపు రూ3వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని సిట్ త‌న ఛార్జిషీట్‌లో పేర్కొంది. అయితే అస‌లు ఎటువంటి కుంభ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నిన్న కూడా వ్యాఖ్యానించారు. క‌క్ష‌పూరితంగా త‌మ పార్టీ నేత‌ల‌ను అరెస్టు చేస్తున్నార‌ని, వారంతా అమాయ‌కులు, శుద్ద‌పూస‌లంటూ ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ కేసులో అస‌లైన నిందితుడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌నేన‌ని కూట‌మి నేత‌లు అంటున్నారు. సిట్ కూడా దాదాపు అదే నిర్ధార‌ణ‌కు వ‌స్తోంది. ఆయ‌న‌ను త్వ‌ర‌లో అరెస్టు చేస్తార‌నే ప్ర‌చారం ఉన్నా...కేంద్రంలోని బిజెపి పెద్ద‌ల అనుమ‌తి వ‌స్తేనే అరెస్టు ఉంటుందని కొంద‌రు రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు పెద్ద మొత్తంలో న‌గ‌దు ల‌భ్యం కావ‌డంతో..కేసులో కీల‌క‌ప‌రిణామ‌మ‌ని, ఇక‌పై అస‌లైన బిగ్‌బాస్ అరెస్టు త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.