Janam Online

మ‌హిళా వ‌న్డే ఫైన‌ల్‌లో భార‌త్‌


ఎట్ట‌కేల‌కు భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ప‌లుసార్లు ఆ జ‌ట్టు చేతిలో ఓట‌మికి గురైన భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు సెమీఫైన‌ల్‌లో వారిని ఓడించి స‌గ‌ర్వంగా ఫైన‌ల్‌కు చేరారు. గురువారం నాడు న‌వీ ముంబాయిలో జ‌రిగిన ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మ్యాచ్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ పేవ‌రెట్ అయిన ఆస్ట్రేలియాను భార‌త్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది.  ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించినా భార‌త్ బ్యాట‌ర్లు మ‌నోనిబ్బ‌రాన్ని కోల్పోకుండా భారీ స్కోరును మ‌రో ఐదు వికెట్లు ఉండ‌గానే చేధించారు. చేధ‌న‌లో జెమీమా రోడ్రిగ్స్ కీల‌క పాత్ర పోషించారు. ఆమె 134 బంతుల్లో 127 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ స్కోరులో 14 బౌండ‌రీలు ఉన్నాయి. ఆమెకు కెప్టెన్ హ‌ర‌మాన్ ప్రీత్‌కౌర్ పూర్తిగా స‌హ‌క‌రించారు. కౌర్ 88 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్స్‌ల స‌హాయంతో 89ప‌రుగులు చేసి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. తొలుత 59 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్ త‌రువాత కౌర్‌, రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌తో కోలుకుంది. వీరిద్ద‌రూ ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను కాచుకుంటూ స్కోరును ప‌రుగులు పెట్టించారు. ముఖ్యంగా కౌర్ భారీ షాట్లు ఆడింది. 264 ప‌రుగులు త‌రువాత కౌర్ అవుట్ అయినా రోగ్రిడ్స్ ఆస్ట్రేలియాకు ఎటువంటి అవ‌కాశాన్ని ఇవ్వ‌కుండా విజ‌యం వ‌రించేవ‌ర‌కూ క్రీజ్‌లోనే ఉంది. దీప్తిశ‌ర్మ‌, ఘోష్ స‌హాయంతో ఆమె క‌ల‌లాంటి విజ‌యాన్ని భార‌త్‌కు అందించింది. న‌వంబ‌ర్ 2న జ‌రిగే ఫైన‌ల్‌లో భార‌త్ ద‌క్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది.