Janam Online

రాప‌ర్ వేధ‌న్‌పై రేప్ కేసు న‌మోదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని  ఓ పాట ద్వారా నిందించిన వివాదాస్పద రాపర్ వేధన్‌పై ఓ మహిళ డాక్ట‌ర్ బలాత్కార ఆరోపణలు చేసింది. దీంతో తిరుక్కాకర పోలీస్ స్టేషన్‌లో వేధ‌న్‌పై కేసు నమోదు అయింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  ఆ మహిళపై 2021 ఆగస్టు నుండి 2023 మార్చి వరకు వివిధ ప్రాంతాల్లో వేధన్ లైంగిక దాడులు చేశాడని ఆరోపించారు. వివాహం చేసుకుంటానని న‌మ్మించి, త‌న‌ను లైంగికంగా వాడుకున్నాడ‌ని, 2023లో త‌న‌ను వివాహం చేసుకోకుండా త‌ప్పించుకున్నాడ‌ని, పైగా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేశాడ‌ని ఆమె తెలిపింది. వేధన్‌ తనను మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించాడని, ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని, కోళికొడలోని ఒక ఫ్లాట్‌లో తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా, వేధన్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. త‌న ప్ర‌తిష్ట‌ను  దెబ్బతీయడాని  పన్నిన కుట్రగా ఆయ‌న పేర్కొన్నారు. తాను చట్టపరంగా దీనికి స‌మాధానం ఇస్తాన‌ని,  ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తానని కూడా ప్రకటించాడు. అయితే పోలీసు అధికారులు మ‌హిళ ఇచ్చిన  ఫిర్యాదు ఆధారంగా బలాత్కార కేసు నమోదు చేశారు. కాగా ఇదే వేధన్ ఇటీవల డ్రగ్స్ కేసులోనూ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఏప్రిల్ 28న అతడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రధానమంత్రి మోదీని అవమానించే విధంగా ఓ పాటను విడుదల చేయడంతో వేధన్‌ మీద విమర్శల వర్షం కురిసింది. పాలక్కాడ్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ వీఎస్ మినిమోల్ కూడా వేధన్‌పై ఫిర్యాదు చేశారు. మోదీపై దూషణలతో పాటు హిందూ సమాజాన్ని కులపరంగా దూషించే వ్యాఖ్యలు, సంఘంలో చిచ్చుపెట్టి సామాజిక వివాదాలకు దారితీసేలా వేధన్ పాట ఉందని ఆమె ఆరోపించారు. ప్రధానమంత్రిని అవమానించడంతో పాటు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని కూడా తక్కువచేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె అన్నారు. భారత శిక్షాసమితిలోని 500వ సెక్షన్ (అపకీర్తి), 153ఏ సెక్షన్ (వర్గాల మధ్య శత్రుత్వం రెచ్చగొట్టడం), 505 సెక్షన్ (జనాల్లో కలహాలు రేపే వ్యాఖ్యలు), అలాగే ఐటీ చట్టంలోని నిబంధనల కింద వేధన్‌పై ఎన్‌ఐఏ విచారణ చేయాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. వేధన్ ప్రస్తుతం డ్రగ్ కేసులో బెయిల్‌పై బయట ఉన్నా, వేలాదిమంది సమక్షంలో లైవ్ కాన్సర్ట్‌లు నిర్వహిస్తూ వాటిలో ద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు.