రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నారని, లక్షల కోట్లు కుదరనివారు వేల కోట్లు లేకపోతే వందల కోట్లు ఆస్తులు పోగేసుకుంటున్నారని దేశ వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే పెద్ద మొత్తం..అయితే..ఇటీవల కాలంలో వంద కోట్లకు లెక్కే లేకుండా పోయింది. ఇప్పుడంతా...వేల, లక్షల కోట్ల లెక్కలే..! అధికార, ప్రతిపక్ష నేతలు వారు అన్నివేల కోట్లు తిన్నారు..వీరు లక్షల కోట్లు దండుకున్నారని విమర్శించుకుంటారు. అయితే..వీరందరిదీ ఒకటే దారి. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ. అయితే...ఇప్పుడు ఈ నాయకులకు కొందరు అధికారులు పోటీ ఇస్తూ వారితో పాటు అక్రమ సంపాదనను పోగేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారం చేతిలో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారుల సంపాదన చూస్తే మతిపోవాల్సిందే. రాజకీయనాయకులు దగ్గరగా వీరూ దండుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దేశంలో పరిస్థితి ఎలా ఉన్నా..మన తెలుగు రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారులు కొందరు వేయి కోట్లు పోగేశారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అధికారపార్టీతో అంటకాగిన వీరు..అడ్డగోలుగా సంపాదించారని, ఇలా సంపాదించిన ఐఎఎస్‌లు తమ సంపాదనను సింగపూర్, ఇతర అరేబియా దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొందరు ఐఏఎస్ అధికారులు వెయ్యికోట్లుకుపైగా సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. కెసిఆర్ పదవి నుంచి దిగిపోయిన తరువాత వారు ఇప్పుడూ దర్జాగా దండుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు కొందరు ఐఏఎస్‌లు ఇష్టారీతిన దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిలో కొందరు అత్యున్నతమైన పదవులు నిర్వహించారు. వీరు రిటైర్ అయ్యే నాటికి వెయ్యికోట్లు పోగేశారనే సాటి ఐఏఎస్‌లే వ్యక్తిగత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా అటువంటి అధికారులు ఉన్నారని, అయితే వీరిపై ఈగ కూడా వాలదని వారు అంతగా ప్రభుత్వ పెద్దలను ప్రభావితం చేస్తున్నారంటున్నారు. వీరి అవినీతిపై సాక్ష్యాధారాలు ఉన్నా..వారికి కేంద్రంలోని పెద్దల అండ ఉండడంతో..ఇక్కడి ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. వారి వల్ల ప్రజలకు భారీ స్థాయిలో నష్టం జరుగుతున్నా..కేంద్ర పెద్దలకు ఆగ్రహం వస్తుందనే భయంతో..వారిని వదిలేశారంటున్నారు. మొత్తం మీద..రాజకీయనాయకులకు తీసిపోకుండా ఐఏఎస్‌లు కూడా వేల కోట్ల సంపదను పోగేస్తున్నారనే విమర్శలు జోరుగా వస్తున్నాయి.