నేడో...రేపో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు
కసరత్తుపూర్తి చేసిన సిఎం చంద్రబాబు
పలు జిల్లాల కలెక్టర్ల మార్పు...!
భారీగా ఐపిఎస్ లూ బదిలీ...!
దాదాపు ఏడాదిన్నర తరువాత రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయబోతోంది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారవ్యవస్థపై పట్టుసాధించలేదనే భావన అధికార పార్టీలోనే వ్యక్తం అవుతోంది. దీనికి కారణం వ్యవస్థలోని కొందరు ఐఏఎస్ అధికారులు వైకాపాకు మద్దతు ఇస్తూ లోపాయికారీగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చినా..వారు మాత్రం వైకాపా నాయకులకే వత్తాసు పలుకుతున్నారని, వారి పనులే చేస్తున్నారనే టిడిపి, జనసేన నాయకులు ఇప్పటిదాకా ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటువంటి వారిని బదిలీ చేయాలని వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పలుసార్లు కోరినా..ఆయన వారిని బదిలీ చేయలేదు. అయితే..ఏడాదిన్నర నుంచి వేచి చూసిన ఆయన ఇక వారిలో మార్పురాదని గమనించి, అటువంటి వారిని బదిలీ చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సచివాలయంలో కొందరు ఐఏఎస్‌లు వైకాపాకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారితో పాటు జిల్లా కలెక్టర్లు కొందరు వైకాపా ఏజెంట్లుగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వీరందరినీ ఇప్పుడు బదిలీ చేయబోతున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.వీరితో పాటు పలువురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేయబోతున్నారు. ముఖ్యంగా జిల్లాల ఎస్పీలను మారుస్తారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా వైకాపాతో అంటకాగుతోన్న వారిపై బదిలీ వేటు వేయబోతున్నట్లు సమాచారం. వారితో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని కూడా బదిలీ చేస్తారంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరు ముఖ్యమంత్రికి నచ్చడం లేదని, వారు ఎంత చెప్పినా తీరు మార్చుకోవడం లేదని, దీంతో వారిపై వేటు వేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు డిప్యూటేషన్‌పై వచ్చేవారికి కీలక పోస్టులు ఇవ్వబోతున్నారు. కొందరు శాఖాధిపతులను ఇతర శాఖలకు బదిలీ చేస్తారంటున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, పంచాయితీరాజ్,మున్సిపల్, వైద్య,ఆర్థిక,పరిశ్రమల శాఖలకు చెందిన శాఖాధిపతులను బదిలీ చేస్తారంటున్నారు. కాగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు జరుగుతాయనే ప్రచారం ఉంది. అయితే..సిఎంఓలో ఎవరినీ కదిలించరని ప్రచారమూ ఉంది. ముఖ్యంగా యువ ఐఏఎస్ అధికారిని బదిలీ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా..ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమానం పొందారని ఆయనను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయరని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓను బదిలీ చేస్తారనే ప్రచారమూ ఉంది. అక్కడ ఉన్న శ్యామలరావును బదిలీ చేసి ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్‌ను అక్కడకు పంపుతారనే ప్రచారం ఉంది. మొత్తం మీద...నేడో..రేపో..బదిలీలు జరగవచ్చు. ఒక వేళ ఈ రెండు రోజుల్లో జరగకపోతే సోమవారం నాడు ఖచ్చితంగా బదిలీల జీవో రావచ్చని తెలుస్తోంది.