Janam Online

షాడో క్యాబినెట్‌...!?


మొంథా తుఫాన్ బీభ‌త్సం త‌రువాత మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అది చేసిన న‌ష్టంపై, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై, వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం చేసే విష‌యంపై  త‌న పార్టీ నేత‌ల‌తో ఈ రోజు తాడేప‌ల్లిలో స‌మావేశం నిర్వ‌హించారు. మొంథా తుఫాన్ తీవ్రంగా ప్ర‌భావం చూపన  మూడు రోజులూ జ‌గ‌న్ బెంగుళూరులోనే గ‌డిపారు. తుఫాన్ తీవ్ర‌త త‌గ్గిన త‌రువాత నిన్న ఆయ‌న తాడేప‌ల్లికి వ‌చ్చి ఈరోజు దానిపై పార్టీ నాయ‌కుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో ఆయ‌న చేసిన హ‌డావుడిని చూసి పార్టీనేత‌లు, ఇత‌రులు నోటి మీద వేలేసుకున్నారు. ఆయ‌న తాను అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన‌ట్లే..ఇప్పుడు కూడా రివ్యూ నిర్వ‌హించారు. త‌న పార్టీ జిల్లా నేత‌లు ఆయ‌నకు తుఫాన్ న‌ష్టం గురించి వివ‌రంగా చెబుతుంటే ఆయ‌న అధికార‌ద‌ర్పంతో మంద‌హాసాలు చేశార‌ట‌. తాను ఇంకా ముఖ్య‌మంత్రినేని, త‌న చుట్టూ ఉన్న‌వారంతా త‌న మంత్రుల‌న్న‌ట్లు ఆయ‌న ప్ర‌వ‌ర్తించార‌ని పార్టీ నాయ‌కులు చెప్పుకుంటున్నారు. జ‌గ‌న్‌కు ఎడ‌మ‌వైపు ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉప‌ముఖ్య‌మంత్రిగానూ, ఎప్ప‌టి వ‌లే స‌క‌ల‌శాఖ మంత్రి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుడివైపు ఉండ‌గా, మ‌రో మంత్రిగా అప్పిరెడ్డి, ఇంకో ఉప ముఖ్య‌మంత్రి, హోంమంత్రిగా జూపూడి ప్ర‌భాక‌ర్‌రావులు, ఐటి శాఖ మంత్రిగా అబ్బ‌య్య‌చౌద‌రిలు ఈ స‌మావేశంలో మంత్రుల పాత్ర పోషించార‌ట‌. దాదాపు షాడో క్యాబినెట్ తీరుతో జ‌గ‌న్ ఈ స‌మీక్ష నిర్వ‌హించార‌ట‌. వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయ‌కులు మాట్లాడుతుంటే..వాళ్లే జిల్లా క‌లెక్ట‌ర్లుగా ఆయ‌న భావించార‌ట‌. స‌మీక్ష‌లో పాల్గొన్న పార్టీ నాయ‌కులు సార్ ఈ జిల్లాలో వేల హెక్టార్లు పంట దెబ్బ‌తింద‌ని, ఇన్ని వేల హెక్టార్లు ఉంటే..ఇంత న‌ష్టం జ‌రిగింద‌ని వ్య‌వ‌సాయ అధికారుల కంటే బాగా లెక్క‌లు చెప్పార‌ట‌. వాస్త‌వానికి వాళ్ల‌కు ఏమీ తెలియ‌ద‌ని, వాళ్లు చెప్పేవ‌న్నీ కాకి లెక్క‌లేన‌ని అయితే అవే నిజ‌మైన‌ట్లు జ‌గ‌న్ భావిస్తూ..ముసిముసి న‌వ్వులు న‌వ్వార‌ని పార్టీ నాయ‌కులు చెప్పుకుంటున్నారు. వాళ్లు చెప్పే కాకి లెక్క‌ల సంగ‌తి తెలిసే జ‌గ‌న్ విర‌గ‌బ‌డి న‌వ్వుకున్నార‌ని..ఏదో స‌మావేశం నిర్వ‌హించాల‌న‌ట్లు మొక్కుబ‌డిగా స‌మావేశం నిర్వ‌హించి మ‌మ అనిపించార‌ని పార్టీ నాయ‌కులు అంటున్నారు. మొత్తం మీద‌..ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ ఇంకా తాను ముఖ్య‌మంత్రిన‌ని, త‌న ప‌క్క‌న ఉన్న‌వారంతా త‌న మంత్రుల‌న్న‌ట్లు, జిల్లా నాయ‌కులు క‌లెక్ట‌ర్లు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని వారు చెబుతున్నారు. కాగా పార్టీ నాయ‌కులు వ‌ర‌ద న‌ష్టం గురించి కాకి లెక్క‌లు చెప్పినా...మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో వాస్త‌వాలు చెప్పారంటున్నారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర దొరికింద‌నేది వాస్త‌వ‌మేన‌ని, ఇప్పుడు మాత్రం ఆ ప‌రిస్థితి లేదంటున్నారు. వ‌రి, మిర‌ప‌, పొగాకు, ఇత‌ర అప‌రాల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డంలేద‌నేది ప‌చ్చి వాస్త‌వ‌మే. అదే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ విష‌యంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం బాగానే ప‌నిచేసింద‌నే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌లు రైతాంగం నుంచి వ‌స్తున్నాయి. ముఖ్యంగా పంట‌ల‌కు మ‌ద్ద‌తుధ‌ర‌, క్రాప్ ఇన్సూరెన్స్ విష‌యంలో కూట‌మి విమ‌ర్శ‌లను ఎదుర్కొంటోంది.