ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని, తమ పథకాలు సూపర్‌హిట్ అంటూ ఈరోజు అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నింటినీ నెరవేర్చామని చెబుతోంది. అయితే ఒకటి రెండు పథకాలను అమలు చేయలేదు కానీ..మిగతా పథకాలను ఖచ్చితంగా అమలు చేశారు. దీనిపై ప్రజల్లో కొంత సంతృప్తి వ్యక్తం అవుతోంది. కావాలని విమర్శలు చేసేవారిని వదిలేస్తే..కూటమి ఇచ్చిన హామీలను సరిగానే నెరవేరుస్తోందనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ముందుగా హామీ ఇచ్చినట్లు ఒకేసారి సామాజిక పెన్షన్లను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచారు. అదే సమయంలో తాము హామీ ఇచ్చిన మూడునెలల బకాయిలను సైతం ఒకేసారి రూ.7వేలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినెలలోనే అందించారు. అంతే కాకుండా సామాజిక పెన్షన్లను వివిధ వర్గాలకు రూ.15వేల వరకూ ఇస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో సామాజిక పెన్షన్లను అందించలేదు. ఒక ఉచితంగా ఇస్తోన్న మూడు సిలిండర్లను కూడా పంపిణీ చేసింది. మొదటి నెలలో కొద్దిగా తడబాటుకు గురయినా..ఇప్పుడు ఉచిత సిలిండర్లు సక్రమంగానే పంపిణీ అవుతోంది. ఇక ప్రధానమైన మరో పథకం తల్లికివందనం సూపర్‌డూపర్ హిట్ అయింది. ఒక ఇంట్లో ఎంత మంది చదువుకునేవాళ్లు ఉంటే..వాళ్లందరికీ ఈ పథకాన్నివర్తింపచేశారు. దీంతో లబ్దిదారులు ఎక్కడలేని సంతృప్తి కనిపించింది. గతంలో జగన్ కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయగా కూటమి ప్రభుత్వం అందరికీ ఇవ్వడంతో...దీనిపై ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తమైంది. అయితే..ఈ సానుకూలతను చెడగొట్టడానికి వైకాపా అర్హులను తగ్గించారని, ఎస్సీలకు పథకాన్ని ఇవ్వలేదని ఫేక్ ప్రచారాన్ని చేసింది. వాళ్లు ఎంత ప్రచారం చేసినా..పథకాన్ని గతంలో కంటే మిన్నగా ఇవ్వడంతో..వారి ఫేక్ ప్రచారానికి పెద్దగా స్పందన రాలేదు.
ఇక ఆలస్యంగానైనా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం, అదీ సంతృప్తిగా సాగుతుండడం మహిళల్లో ప్రభుత్వం పట్ల పూర్తి సానుకూలత వ్యక్తం అవుతోంది. మహిళా ప్రయాణీకులు ఇది ప్రభుత్వం తమకు కల్పించిన ప్రైడ్‌గా భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి సౌకర్యం మహిళలకు ఉన్నా..అక్కడ వాళ్లలో సంతృప్తి లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చూపుతో ఈ పథకాన్ని అత్యంత పటిష్టంగా అమలు చేస్తూండడంతో..ఈ పథకం విజయవంతంమైంది. కాగా రైతులకు ఏడాదికి ఇస్తామన్న రూ.20వేల ఆర్థిక సహాయాన్ని తొలివిడత ఇచ్చేశారు. గతంలో వైకాపా కేవలం రూ13వేలు మాత్రమే ఇచ్చేది. ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మెగా డిఎస్సీని నిర్వహించి ఫలితాలను ప్రకటించేశారు. అర్హులైన వారికి నేడో రేపో అపాయింట్‌మెంట్ ఇచ్చేస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు జోరుగా నడుస్తున్నాయి. ఎవరికైనా రూ.5లతో సంతృప్తికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఉదయం అల్ఫాహారం, మధ్యాన్నం, సాయంత్రం భోజనాన్ని అతి తక్కువ రేట్లకు అందిస్తుండడంతో..పేదల్లో సంతృప్తి కల్గిస్తోంది. మరోవైపు తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. రూ.99 మద్యాన్ని అమ్ముతోంది. దీనిపై కూడా కొంత వరకూ సానుకూలత కనిపిస్తోంది. అయితే..సంక్షేమపథకాల అమలులో కనిపిస్తోన్న సంతృప్తి ఇతర విషయాలపై ప్రజల్లో కనిపించడం లేదు.
ముఖ్యంగా పార్టీ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేసిన నిజమైన కార్యకర్తలను పార్టీ అధినాయకత్వం వదిలేసిందనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. తమను పట్టించుకోవడం లేదని, తమకు ఏ పనులూ కావడం లేదని, పార్టీ కోసం ఇంత చేస్తే..నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తి వారిలో ఉంది. దీన్ని పరిష్కరించేవారే పార్టీలో కనిపించడం లేదు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజలపై పెత్తనం చేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇక అధికార వ్యవస్థ మొత్తం వైకాపా నేతలకే అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర సచివాలయంలో ఇంకా వారి పెత్తనమే సాగుతోంది. వివిధ సెక్షన్లలో, పైస్థాయి ఐఏఎస్, ఐపిఎస్ వర్గాల్లో ఎక్కువ మంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీకి పనిచేసిన వారికి ఎటువంటి పనులు చేయడం లేదని, సొమ్ములు ఉన్నవారి వద్ద సొమ్ములు తీసుకుని వారికే పనులు చేస్తున్నారని, పార్టీ వారిని పట్టించుకునేవారు లేరని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అదే విధంగా అతి ముఖ్యమైన రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం నానా గందరగోళానికి గురవుతోంది. భూసేకరణ, సమీకరణ అంటూ హడావుడి చేస్తోంది. ఇచ్చిన భూములకే ఇంకా న్యాయం చేయలేదని, ఇప్పుడు మళ్లీ భూములు ఏమిటనే భావన అక్కడి రైతుల్లో వ్యక్తం అవుతోంది. రాజధాని పనులు చురుగ్గా జరగడం లేదనే భావన వ్యక్తం అవుతోంది. ఇక వైకాపా అవినీతిపై కఠిన చర్యలు తీసుకోలేదని, వారితో రాజీపడి కొన్ని కేసులను నీరుగారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తమ బకాయిలను విడుదల చేయాలని వారు కోరుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలా ఉంటే..సంక్షేమ పథకాలు అమలు సంతృప్తికరంగా ఉన్నా..కూటమికి ఓటేసిన వారిలో ఎక్కువ మందికి అవి అందడం లేదు. దీనితో..ఇవన్నీ వైకాపా వారికే ఉపయోగకరంగా ఉన్నాయని, వైకాపాకు ఓటేసిన వారికే ఇప్పుడు సంక్షేమపథకాలు అందుతున్నాయని, తమ పరిస్థితి ఏమిటని కూటమి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమపథకాలను తమకు ఇవ్వాలని వారు కోరుతున్నా ప్రభుత్వం నిబంధనల పేరుతో..వారికి ఇవ్వలేకపోవడం ఖచ్చితంగా మైనస్సే. మొత్తం మీద..సంక్షేమ పథకాలు సూపర్‌డూపర్‌గా అమలు చేస్తోన్నా..కీలకమైన కొన్ని విషయాల్లోమాత్రం ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాటిని ప్రభుత్వ పెద్దలు సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.