రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తోన్న సిఆర్డీఏ కమీషనర్ కన్నబాబును రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బదిలీ చేసింది. ఆయనతో పాటు మరి కొందరు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా ఉన్న విజయరామ రాజును సిఆర్డీఏ కమీషనర్‌గా నియమించింది. మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఎం. విజయ సునీతను మార్కాపురం జిల్లా కలెక్టర్‌గానూ, ఆయుష్ డైరెక్టర్‌గా ఉన్న కొత్తమాసు దినేష్ కుమార్‌ను పోలవంర జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కార్యదర్శిగా ఉన్న రవి సుబాష్ (2013 బ్యాచ్) కు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. మరో ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డిని జీఏడికి సరెండర్ చేశారు. గత కొన్ని రోజులుగా ఐఏఎస్‌ల బదిలీలు ఉంటాయనే వార్తలను నిజం చేస్తూ ఈ రోజు కొందరు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. అయితే...రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన సిఆర్డీఏ కమీషనర్‌ను బదిలీ చేస్తారని ఎవరూ ఊహించలేదు.
సిఆర్డీఏ కమీషనర్‌గా ఉన్న కన్నబాబు మున్సిపల్‌మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు. గతంలో సిఆర్డీఏ కమీషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్‌ను బదిలీ చేసినప్పుడు కన్నబాబును నారాయణ కమీషనర్‌గా నియమించుకున్నారు. మంత్రి నారాయణకు కన్నబాబు అత్యంత ఇష్టుడుగా పేరుంది. అలాంటి కన్నబాబును ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారనే దానిపై రకరకాలైన వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తే ఇందుకు కారణమనే భావన కొందరు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆ పత్రికలో వచ్చిన వార్తల్లో నిజం ఉందని భావించిన ప్రభుత్వం కన్నబాబుపై వేటు వేసిందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత ప్రాధాన్యమైన రాజధాని అమరావతి నిర్మాణానికి నిజాయితీపరుడైన కాటంనేని భాస్కర్‌ను నియమించుకుంది. భాస్కర్ అయితే రాజధాని పనులు పరుగెత్తిస్తారనే భావనతో ఆయనను నియమించారని ప్రచారం జరిగింది. అయితే..మంత్రి నారాయణకు భాస్కర్‌కు పడకపోవడం..ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినా..అది విఫలం కావడంతో..చివరకు ముఖ్యమంత్రి మంత్రి నారాయణ వైపే నిలబడి భాస్కర్‌ను బదిలీ చేశారు. అయితే..భాస్కర్ బదిలీ తరువాత సిఆర్డీఏ కమీషనర్‌గా వచ్చిన కన్నబాబు రాజధాని పనులను వేగంగా చేయలేకపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లు కావచ్చినా..రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, అనుకున్నవేగంతో పూర్తిచేయలేకపోతున్నారని అటు రైతులు, ఇటు అమరావతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే రెండేళ్లు అయినా..ఇంకా ఏమీ జరగలేదనే భావన చాలా మందిలో నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని పనులు వేగంగా జరిపించాల్సిన కన్నబాబుపై రైతులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన రిటైన్‌బుల్ ప్లాట్‌లు ఇవ్వలేదని, ఇంకా ఇతర సమస్యలను పరిష్కరించలేదని వారు మీడియాకు ఎక్కుతున్నారు. అయితే..వీటిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంతలో ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త ఇప్పుడు బదిలీలకు కారణం అయిందంటున్నారు. కాగా..రెండేళ్లలోనే సిఆర్డీఏకు మూడో కమీషనర్ వస్తూండడంతో..రాజధాని పనులు ఎప్పుడు పూర్తి అవుతాయనే ఆందోళన ఇక్కడి రైతుల్లో..అమరావతి శ్రేయోభిలాషుల్లో వ్యక్తం అవుతోంది.