ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి కార్తికేయ మిశ్రాపై ప్రముఖ ప్రవచనకారుడు, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థుల్లో నైతికవిలువలను పెంపొందించడానికి నిర్వహించిన ఓ సభలో చాగంటి కోటేశ్వరరావు ప్రసంగిస్తూ..పశ్చిమగోదావరి కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా పనిచేసినప్పుడు తాగునీటి విషయంలో ఆయన స్పందించిన తీరును ఊదాహరిస్తూ..కలెక్టర్ అంటే కార్తికేయ మిశ్రాలా ఉండాలన్నారు. కలెక్టర్‌గా తన పాలనలో ఆయన ప్రజలకు గుర్తిండిపోయే పనులు చేశారని దానికి తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన చెప్పారు. తమ జిల్లాలో డొక్కా సీతమ్మ విగ్రహం పెడుతున్నప్పుడు తాను ప్రసంగాలు చేశానని, అది చూసి కలెక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రా తమ ఇంటికి వచ్చారని, ఆ సమయంలో తాను మంచినీటిని బయట నుంచి కొని తెచ్చుకుంటున్నానని, అది చూసిన కార్తికేయ మిశ్రా..ఏమిటి గురువుగారూ..మీకు మంచినీళ్లు లేవా..అని ప్రశ్నించారని, దానికి తాను స్పందిస్తూ..ఇక్కడ ఉప్పు నీళ్లు వస్తుంటాయని, తామందరం మంచినీళ్లు కొనుక్కుంటామని చెప్పానని, దానికి ఆయన బదులిస్తూ..మీకేనా..ఈ సమస్య ఈ ప్రాంతమంతా ఉందా..అని ప్రశ్నించారని, తాను ఈ ప్రాంతమంతా...ఈ సమస్య ఉందని చెప్పడంతో..ఆయన దిగ్బ్రాంతికి గురయి తాను జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రాంతంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడితే అది తనకు అవమానమంటూ... వెంటనే అధికారులతో మాట్లాడి పదిరోజుల్లో మంచినీటి సమస్యను పరిష్కరించారని, ఆ ప్రాంతమంతా.. కొళాయిలు, గొట్టాల ద్వారా మంచినీటిని సరఫరా చేసి ఆ ప్రాంత మంచినీటి సమస్యను పరిష్కరించారని, ఇప్పటికీ ఆ ప్రాంత వాసులందరూ..కార్తికేయ మిశ్రా చేసిన పనులను తలచుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. తాను కార్తికేయ మిశ్రాను పొగిడి ఆయనతో..ఏవో పనులు చేయించుకోవడానికి ఇది చెప్పడం లేదని, తాను ఇప్పటికే రిటైర్ అయి ఉన్నానని, ఇటువంటి సమయంలో..ఆయన చేసిన మంచిని చెప్పడం కోసమే..ఇది చెబుతున్నానని చాగంటి అన్నారు. ఒక మంచి వ్యక్తి కలెక్టర్ అయితే..ఎలా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారో..కార్తికేయ మిశ్రా ఉదాహరణ అని ఆయన చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో అక్కడే ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌లు సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. కాగా కార్తికేయ మిశ్రా నారా లోకేష్‌కు మంచి మిత్రుడు. తన మిత్రుడు చేసిన మంచిని చాగంటి చెబుతుంటే..లోకేష్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆనందించారు.