ఓ సీనియర్ ఐఏఎస్ తన సర్వీసుకు రాజీనామా చేస్తానని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట. తనకు కూటమి ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పించడం లేదని, తన సేవలను వాడుకోవడం లేదని, ఈసారి కనుక తనకు అన్యాయం చేస్తే తన సర్వీసుకు రాజీనామా చేస్తానని ఆయన చెబుతున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సదరు ఐఏఎస్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇస్తారని అందరూ భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులం లెక్కలు వేసుకుని ఈ పోస్టును వేరే వర్గానికి చెందిన వారికి ఇచ్చారట. ఈ సందర్భంగా సదరు ఐఏఎస్‌ను పిలిపించుకుని ఈసారి తప్పనిసరిగా అవకాశం ఇస్తానని చెప్పారట. అయితే ఇదే సందర్భంగా సదరు ఐఏఎస్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వలేదని ఆయన సామాజికవర్గానికి చెందిన వారు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే..ఈ సామాజికవర్గంలో కొందరు సదరు ఐఏఎస్ తమ వర్గానికి ఏమీ చేయలేదని, ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో చర్చించుకున్నారు. అయితే..అత్యున్నతమైన పోస్టు తమ సామాజికవర్గానికి వచ్చే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇవ్వలేదని అప్పట్లో కొందరు బాగానే నసిగారు. అయితే..ఈసారి అత్యున్నతమైన పోస్టు మాత్రం సదరు ఐఏఎస్‌కు ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే..ఓకే..లేకుంటే..తన సర్వీసుకు రాజీనామా చేస్తానని సదరు ఐఏఎస్ చెబుతున్నారట.ఈయన వెనుక అదే సామాజికవర్గానికి చెందిన ఓ బిజెపి నాయకుడు ఉన్నారని, ఈసారి ఆ పోస్టు రాకుంటే రాజీనామా చేయాలని ఆయనే సూచించారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తేవడమే ధ్యేయంగా వీరు రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నారంటున్నారు. ప్రస్తుతం సదరు ఐఏఎస్‌కు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టునే ఇచ్చారు. అయితే అత్యున్నతమైన పోస్టులో అతనిని చూడాలని కోరుకుంటున్నవారు మాత్రం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని చెబుతున్నారట. మొత్తం మీద..తనకు ఆ పోస్టు దక్కకుంటే రాజీనామా చేస్తానని సదరు ఐఏఎస్ అన్నమాటలు అధికారవర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. మరి ముఖ్యమంత్రి ఏమి చేస్తారో చూడాలి.