వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించిన సకలశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి హవా ఇప్పుడూ ఆ పార్టీలో కొనసాగుతోంది. వైకాపాలో ఇప్పుడు అన్నీ ఆయనే. ఇంతకు ముందు పార్టీలో చక్రం తిప్పిన విజయ్‌సాయిరెడ్డి వైకాపాకు రాజీనామా చేయడం, రాయలసీమలో కీలకమైన పెద్దిరెడ్డి ఫ్యామిలీ కేసుల్లో జైలుకు పోవడంతో..ఇప్పుడు వైకాపాలో సజ్జల రామకృష్ణారెడ్డికి తిరుగులేని స్థాయికి చేరారు. పార్టీలో తిరుగులేని స్థితిలో ఉన్న సజ్జలకు ఆశ్చర్యకరంగా ప్రభుత్వం నుంచి కూడా తిరుగులేని సహకారం అందుతోందని వైకాపాలోని ఓ వర్గం అంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పట్లో అన్నింటిలో వేలు పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డిని అందరి కంటే ముందే జైలుకు పంపుతుందని కూటమి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ఆశించారు. అదే సమయంలో వైకాపా ఘోర ఓటమికి ఆయనే కారకుడని పేర్కొంటున్న వైకాపా కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులు ఆయన తప్పకుండా జైలుకెళతారని భావించారు. అయితే ఆశ్చర్యకరంగా కూటమి ప్రభుత్వం ఆయనపై ఇంత వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వంలో అన్ని విధాన నిర్ణయాలతో పాటు, జగన్ ఆయన మంత్రుల అవినీతికి సహకరించిన సజ్జలపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. రాజధానికి సంబంధించిన ఏదో చిన్న కేసు ఒకటి పెట్టారే తప్ప..మరే ఇతర కేసులు అతనిపై పెట్టలేదు. అంటే..అప్పట్లో సజ్జల ఎటువంటి అవినీతికి పాల్పడలేదనా...? లేక ఆయన చేసిన అవినీతిపై ఆధారాలున్నా..ఆయనో పావుగా వాడేందుకు మినహాయించారో తెలియదు కానీ..సజ్జలపై మాత్రం ఈగ వాలలేదు. గతంలో టిడిపిలో ఉన్న సజ్జల తరువాత వైకాపాలో చేరినా..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని కొందరు వైకాపా నాయకులు అంటున్నారు. మరి ఈ విషయం మాజీ సిఎం జగన్మోహన్‌రెడ్డికి తెలియదా..? అంటే ఏమోననే వారు కొందరు..కొందరు తెలిస్తే మాత్రం ఏమవుతుంది...? జగన్ ఆయన చేతిలో బందీగా ఉన్నాడని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సరే సజ్జల సంగతి అటుంచితే..ఆయన కోటరీగా పేరొందిన పలువురు వైకాపా నాయకులపై కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
సజ్జల కోటరీపై చర్యలు లేవా..?
సజ్జల కోటరీలో గుంటూరుకు చెందిన అప్పిరెడ్డి, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మొండితోక బ్రదర్స్, బాపట్ల మాజీ ఎంపి నందిగం సురేష్ తదితరులు ప్రముఖులు. అయితే వీరిలో ఒక్క నందిగం సురేష్ తప్ప మిగతా ఎవరిపైనా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో అప్పిరెడ్డిది ప్రముఖ పాత్ర. ఆయన జిల్లాలో చేయని అరాచకం లేదు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు అరాచకాల నుంచి ప్రతి దానిలో ఆయనకు భాగస్వామ్యం ఉంది. అదే విధంగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన మేరుగ నాగార్జున అరాచకాలకు అంతే లేదు. ఒక మహిళ ఆయన తనపై చేసిన లైంగిక దాడిపై పోరాటం చేస్తే వైకాపా, టిడిపి నాయకులు కుమ్మక్కై ఆయనను ఆ కేసును రక్షించారు. బాధిత మహిళతో సెటిల్‌మెంట్ చేయించారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన తలశిల రఘురాం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన మైనింగ్ విషయంలో చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. ఇక మొండితోక బ్రదర్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మరి వీరందరిపై ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. సజ్జలకు అత్యంత సన్నిహితులైన ఈ నేతలను సజ్జలే కాపాడుతున్నారా..? సజ్జల మనుషులు కనుక, సజ్జలను కాపాడినట్లు వారిని కూడా కూటమి ప్రభుత్వం కాపాడుతుందని వైకాపా నేతలే చెబుతున్నారు. మొత్తం మీద సజ్జల హవా అప్పుడూ ఇప్పుడూ కొనసాగుతుందని, సజ్జల తన ప్రయోజనాలను మాత్రమే కాపాడుకుంటూ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వైకాపా అభిమానులు, కార్యకర్తలు, సానుభూతిపరులు మండిపడుతున్నారు.