English
🔴 Breaking News Updates...

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 8మంది మృతి

గురువారం ఉద‌యం జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో 8 మంది మృతి చెందారు. మ‌రో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్క‌డిక‌క్క‌డే  మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వారిని ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఇద్ద‌రు పురుషులు,   ఐదుగురు మహిళలు, బాలిక  ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందారు.   కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బొలేరో లో 23 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర మంత్రులు నిమ్మ‌ల రామానాయుడు, స‌త్య‌కుమార్‌యాద‌వ్‌,రాంప్ర‌సాద్‌రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌చేశారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని వారు అధికారుల‌కు సూచించారు.   మంత్రాలయం దగ్గర జరిగిన ప్రమాదం పై మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జ‌రిగిన తీరుపై  జిల్లా కలెక్టర్, ఎస్పి లను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి నిమ్మల. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించి, వారికి అండగా ఉండాలని జిల్లా అధికారులను ఆయ‌న ఆదేశించారు. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆయన అధికారుల‌కు సూచించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి : కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొలెరో-లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. కర్ణాటకకు చెందిన భక్తుల వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని, ఘటనా స్థలంలోనే 8 మంది మృతి చెందారని వివరించారు. గాయపడిన 10 మందికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.