ఒంగోలు సమాచారశాఖ ఆర్‌జెడిగా పనిచేస్తోన్న ఐ.సూర్యచంద్రరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన ప్రస్తుతం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పబ్లిసిటీ సెల్ బాధ్యతలను ఎవరు చూస్తోరో ఇంకా తెలియరాలేదు. సమాచారశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే ఆయన సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో పనిచేస్తారా..? లేక ఆయన స్థానంలో వేరే వారిని నియమిస్తారో చూడాల్సి ఉంది. కాగా..ఆయనతో పాటు ఒంగోలు ఆర్ఐఇగా పనిచేస్తోన్న టి.నాగరాజను కూడా సమాచారశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసింది. ఆయన స్థానంలో విశాఖపట్నంలో ఆర్ ఐఇగా పనిచేస్తోన్న పి.శ్రీధర్‌రెడ్డిని ఒంగోలుకు బదిలీ చేశారు. కాగా..విశాఖపట్నం రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్‌గా సి.వి.కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణారెడ్డిని ప్రభుత్వం జీఎడికి సరెండర్ చేసింది. అప్పటి సమాచారశాఖ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు కృష్ణారెడ్డి సహకరించారనే ఆరోపణలతో ఆయనను జీఏడికి ప్రభుత్వం సరెండర్ చేసింది. దాదాపు తొమ్మిది నెలలు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సమాచారశాఖలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఏసీబీ, విజిలెన్స్ విచారణను ప్రభుత్వం చేయిస్తోంది. దీనిపై ఇప్పటి వరకూ ఏమీ తేలలేదు. అయితే..ఈ కేసు తేలకుండానే కృష్ణారెడ్డికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
కాగా మరోవైపు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయింట్ డైరెక్టర్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఒకరికి ఒక న్యాయం..మరొకరికి మరో న్యాయమా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే..గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయింట్ డైరెక్టర్ తనకు సమాచారశాఖలోనే పోస్టింగ్ కావాలని పట్టుపట్టడంతో ఆ అధికారికి పోస్టింగ్ ఇవ్వలేదని తెలుస్తోంది. తాను మళ్లీ అదే స్థానంలో వస్తానని, తన వ్యతిరేకుల సంగతి తేలుస్తానని సదరు అధికారి బెదిరింపులకు దిగుతున్నారు. పలువురు జర్నలిస్టులతో లడాయి పెట్టుకుని ఇప్పటికే సదరు అధికారి విమర్శల పాలయ్యారు. అయినా..సదరు అధికారిలో ఎటువంటి మార్పు రాలేదని జర్నలిస్టు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రెస్ అకాడమీ, ఒంగోలు ఆర్‌జెడి పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక పోస్టులో సదరు అధికారికి పోస్టింగ్ ఇస్తారనే సమాచారం ఉంది. అయితే..ఆ అధికారి అదే మొండిపట్టుదలతో ఉంటే మాత్రం మరికొన్నాళ్లపాటు పోస్టింగ్ కోసం ఎదురు చూడాల్సిందే. కాగా నెల్లూరు డీడీగా పనిచేస్తోన్న కె.సదారావును విశాఖపట్నంకు బదిలీ చేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమంలో మైక్‌లు పనిచేయకపోడంతో.. ముఖ్యమంత్రి సదారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పనితీరు బాగాలేదని మందలించారు. ఈ పరిణామాలతో ఆయన బదిలీ జరిగి ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది