WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌'కు మరోసారి షాక్‌ ఇచ్చిన 'ఉస్మానియా'

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు 'ఉస్మానియా యూనివర్శిటీ' విద్యార్థులు మరోసారి షాక్‌ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తనకు ఎదురులేదని, తెలంగాణ మొత్తానికి తన మాటే శిలాశాసనమని భావిస్తున్న ఆయనకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మకమైన 'ఉస్మానియా యూనివర్శిటీ' శతాబ్ది ఉత్సవాల్లో ఆయన కనీసం ప్రసంగించే సాహసం చేయలేదు. యూనివర్శిటీ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి మాట్లాడడం సహజంగా జరిగేదే కానీ...ఇక్కడ కెసిఆర్‌ మౌనముద్ర దాల్చారు. 

 కెసిఆర్‌ ప్రభుత్వంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రసంగిస్తే విద్యార్థులు చెప్పులు విసురుతారనే ఇంటిలిజెన్స్‌ వర్గాల రిపోర్ట్‌తోనే ఆయన సభలో మాట్లాడకుండా వెనుతిరిగారని వార్తలువస్తున్నాయి. ఆయన మాట్లాడకపోయినా...విద్యార్థులు తమ అసంతృప్తిని ఎక్కడా దాచుకోలేదు. ఆయన సభ నుంచి బయటకు వెళ్లే సమయంలో విద్యార్థులంతా 'కెసిఆర్‌ డౌన్‌ డౌన్‌' అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉస్మానియా విద్యార్థుల నుంచి ఇటువంటి అనుభవం ఎదురు కావడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చెప్పిన కెసిఆర్‌ రెండు రోజుల తరువాత ఖమ్మంలో నిరాహారదీక్ష విరమించడంతో 'ఉస్మానియా' అగ్నిగుండమైంది. ఇక్కడి విద్యార్థులు కెసిఆర్‌ ఆమరణనిరాహారదీక్ష విరమించుకోవడంపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. కెసిఆర్‌ దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కెసిఆర్‌ తాను నిరాహారదీక్షను విరమించుకోలేదని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇదంతా గతం...తాజాగా ఈ రోజు జరిగిన పరిణామాలతో 'ఉస్మానియా' విద్యార్థులు మరోసారి కెసిఆర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కెసిఆర్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో వారిలో అసంతృప్తిని రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒక్క కెసిఆర్‌పైనే కాదు...తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులపైన కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పిన టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాత కూడా న్యాయం చేయటం లేదని వారు అంటున్నారు. మొత్తం మీద నిన్నటి దాకా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఒకటే ఊదరగొడుతున్న వారికి, అధికారపార్టీకి విద్యార్థుల నిరసనలు, అసంతృప్తి చేదు వార్తే. మరి కెసిఆర్‌ విద్యార్థులను ఎలా దారికి తెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే...!


(384)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ