‘కాంగ్రెస్’కు ఎంఐఎం స్నేహహస్తం...!
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన ‘రేవంత్‌రెడ్డి’ అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తున్నారు. వేగంగా పాలనా నిర్ణయాలను తీసుకుంటోన్న ఆయన, మరోవైపు రాజకీయ నిర్ణయాలను కూడా అంతే వేగంగా తీసుకుంటున్నారు. ‘రేవంత్‌రెడ్డి’ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు తీసుకోకముందు ఆయనపై పెద్దగా అంచనాలు లేదు. ఎటువంటి పాలనానుభవం లేని ఆయన ఎలా పరిపాలన చేస్తారో..అని చాలా మంది సందేహించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదాన్ని పొందుతున్నాయి. అప్పుడే ఆయన విజయవంతం అయ్యారని చెప్పడం తొందరపాటే అవుతుంది..కానీ..‘కాలు తొక్కినప్పుడే కాపురం చేసే కళ’ తెలుస్తోందన్న తెలుగు సామెత ప్రకారం అయితే ఆయన మొదటి అడుగులు స్థిరంగానే పడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలిక్షణమే..ఆరు హామీలపై సంతకం చేశారు. ఆ తరువాత..వికలాంగ మహిళకు ఉద్యోగం ఇచ్చి..తాను ఇచ్చిన హామీలపై ఎంత నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకోబోతున్నారో..ప్రజలకు సందేశం ఇచ్చారు. అదే విధంగా ‘ప్రగతి భవన్’కు ఉన్న ముళ్ల కంచెను తొలగించడం ఆయన ఇమేజ్‌ను ఆమాంతం పెంచేసింది. ఇంతకు ముందు ‘ప్రగతి భవన్’ ముందు అవమానాలకు గురైనవారు..‘రేవంత్’ చర్యతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వెంటనే..‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టడం..ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి ఆలకించడంతో..ఆయన అడుగులు స్థిరంగా ఉన్నాయని చాటి చెప్పారు. అదే సమయంలో విద్యుత్‌కు సంబంధించిన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి..గతంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలేది లేదని సుస్పష్టంగా తెలియచేశారు.
ఇవన్నీ పాలనాపరమైన నిర్ణయాలు కాగా..అసెంబ్లీలో అంతంత మాత్రమే మెజార్టీ ఉన్న కాంగ్రెస్‌కు ఇతర పార్టీల నుండి అవసరమైన మద్దతు సంపాదించడానికి ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ఎంఐఎంకు ప్రొటెంస్పీకర్‌గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికైన సీనియర్ సభ్యుల్లో ఒకరి ఆ అవకాశం వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఎన్నికైన వారిలో మాజీ ముఖ్యమంత్రి ‘కె.చంద్రశేఖర్‌రావు’ అత్యంత సీనియర్. అయితే..ఆయన బాత్‌రూమ్‌లో జారిపడి హాస్పటల్ పాలవడంతో..ఎంఐఎం పక్ష నాయకుడు ‘అక్బరుద్ధీన్’ను ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఎంఐఎంకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆయన రెండు ప్రయోజనాలను ఆశించారు. వాటిలో మైనార్టీ వర్గాలను ఆకట్టుకోవడం ఒకటి కాగా..రెండోది..వారికి స్నేహహస్తం అందించడం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎంఐఎం ఎంతో సహకారం అందించేది. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా..ఎంఐఎం వారికి సహకరించింది. అప్పట్లో ‘వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారితో మరింతగా కాంగ్రెస్ కలిసిమెలసి వ్యవహరించింది. అయితే..తరువాత అధికారంలోకి వచ్చిన ‘కిరణ్‌కుమార్‌రెడ్డి’ ఎంఐఎం పట్ల కఠినంగా వ్యవహరించారు. దాంతో..ఎంఐఎం కాంగ్రెస్‌కు దూరమైంది. వారు దూరం అయ్యారనే కన్నా..2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఎంఐఎం ‘టిఆర్‌ఎస్’కు కాపుకాచింది. గత తొమ్మిదన్నరేళ్ల నుంచి ఎంఐఎం..‘బిఆర్‌ఎస్’కు మద్దతు ఇస్తూ వస్తోంది. వారు పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని చోట్లా ‘బిఆర్‌ఎస్’కు మద్దతు ప్రకటించింది. అయితే..మొన్న జరిగిన ఎన్నికల్లో ‘బిఆర్‌ఎస్’ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో..ఎంఐఎం మౌనాన్ని ఆశ్రయించింది. ఈలోపు ‘బిఆర్‌ఎస్’ మరో ఆరు నెలల్లో ‘కెసిఆర్’ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, తమకు ఎంఐఎం, బిజెపితోపాటు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని తద్వారా..‘రేవంత్‌రెడ్డి’ప్రభుత్వాన్ని కూల్చి..కెసిఆర్ అధికారంలోకి వస్తారని మాజీ మంత్రి ‘కడియం శ్రీహరి’ ప్రకటించారు. దీంతో ఎంఐఎం ఏం చేస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. అయితే..ఇక్కడే..‘రేవంత్’తన బుర్రకు పదును పెట్టి..ఎంఐఎంను ఆకర్షిస్తున్నారు. ముందుగా ఆ పార్టీ శాసనసభాపక్షనేత ‘అక్బరుద్ధీన్’ను ప్రొటెంస్పీకర్‌ను చేయాలని నిర్ణయించడం, దానికి వారు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. 9వతేదీన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత..ఎంఐఎం పూర్తిగా అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుందని, వారు కాంగ్రెస్‌కు స్నేహస్తం చాస్తున్నారని, దాని ‘రేవంత్’ అందుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.మొత్తం మీద..తొలి రెండు రోజుల్లో ప్రజాభిమానం చూరగొన్న ‘రేవంత్‌రెడ్డి’ గత ముఖ్యమంత్రుల కన్నా, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా..పెద్దరికంగా, ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తూ..తటస్థుల మనస్సులను కూడా చూరగొంటున్నారని, దాంతో అందరూ ఆయనకు ఆకర్షితులవుతారని పరిశీలకులు పేర్కొంటున్నారు.