WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

29న టీఆర్‌ఎస్‌లోకి రమేశ్‌రాథోడ్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తిడిపి పార్టీకి అండదండగా ఉన్న కీలక నేతఆ పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు రమేశ్‌రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఈ నెల29న కారెక్కేందుకు ముహూర్తం కూడా ఖరారయ్యింది. ఆ రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న క్యాడర్‌తో కలిసి ఆయన గులాబీకండువా వేసుకోబోతున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రమేశ్‌రాథోడ్‌తో పాటు ఆయన భార్యమాజీ ఎమ్మెల్యే సుమన్‌ రాథోడ్‌.. ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన కుమారుడు రితేశ్‌ రాథోడ్‌.. ఆదిలాబాద్‌... కుమ్రంభీమ్‌...నిర్మల్‌ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆ పార్టీకి గడ్డుకాలం వచ్చినట్టే! టీడీపీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న వేణుగోపాలాచారి...జోగు రామన్న... నగేశ్‌ వంటి నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. రమేశ్‌రాథోడ్‌ ఒక్కడే పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతుండటం టీడీపీకి పెద్ద దెబ్బే!

నిజానికి  సాధారణ ఎన్నికలలో రమేశ్‌రాథోడ్‌ ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి...ఆయన కుమారుడు రితేశ్‌ రాథోడ్‌ ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీకి బలమైన క్యాడర్‌ ఉండి కూడా ఓడిపోవడాన్ని వారు తట్టుకోలేకపోయారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది.. ఆ ప్రచారాన్ని రమేశ్‌రాథోడ్‌ ఖండిస్తూ వచ్చారు. కేంద్రంలో తమ పార్టీ భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏదో ఒక నామినేటెడ్‌ పదవి లభిస్తుందని ఆశపడ్డారు. ఓ దశలో కేంద్ర గిరిజన సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి వరించబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. కారణాలు ఏమైనా నామినేటెడ్‌ పదవి దక్కలేదు.

తెలంగాణలో టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు అంతగా లేకపోవడంతో రాథోడ్‌ శిబిరంలో ఓ విధమైన నైరాశ్యం ఏర్పడిందట! దీంతో టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భావన ఏర్పడిందట! ఈ నేపథ్యంలోనే రమేశ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం తెరపైకి వచ్చిందట! ఆ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో మాట్లాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు కానీ కాంగ్రెస్‌లో చేరతారన్న అంశం క్రమేణా మరుగునపడిపోయింది. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం కూడా గాలం వేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా రమేశ్‌ రాథోడ్‌ గులాబీగూటికి చేరబోతుండటం జిల్లాలోని నేతలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరో ట్విస్టు ఏమిటంటే రమేశ్‌రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతారనే విషయం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలకు తెలియదట! అంతకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయట! నాలుగు రోజుల కిందట తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రిక ఇవ్వడానికి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. అక్కడే రాజకీయ భవితవ్యంపై చర్చ జరిగిందట! ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా టీడీపీలోనే కొనసాగితే రాజకీయంగా చాలా నష్టపోవలసి వస్తుందని.. టీఆర్‌ఎస్‌లో చేరితే భవిష్యత్తు ఉంటుందని తుమ్మల సూచించారట! అక్కడి నుంచే సీఎం కేసీఆర్‌తో సంప్రదింపులు జరపడంతో పాటు ప్రత్యేకంగా భేటి అయ్యారట! వచ్చే నెల పదిన జరిగే తమ కుమారుడి వివాహానికి కేసీఆర్‌ను ఆహ్వానించిన రమేశ్‌ అంతకు ముందే అంటే ఈ నెల ననే టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నారట! టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు ..ఇతర నేతలంతా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే కనుక రాజకీయ భవిష్యత్తుపై రమేశ్‌కు నమ్మకం కుదిరిందట!

మరోవైపు రమేశ్‌రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరకముందే జిల్లాలోని పలువురు గిరిజన ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలయ్యిందట! రాథోడ్‌ను అడ్జెస్ట్‌ చేయడం కోసం తమకు చెక్‌ పెడతారన్న భావన వారిలో ఏర్పడిందట! మరీ ముఖ్యంగా రమేశ్‌రాథోడ్‌ సొంత నియోజకవర్గమైన ఖానాపూర్‌కు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాథోడ్‌ కుటుంబంతో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు విభేదాలు ఉన్నాయి.. ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. రాథోడ్‌కు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలనుకుంటే ఆయన కచ్చితంగా ఖానాపూర్‌నే కోరుకుంటారు. ఇది రేఖానాయక్‌కు మింగుడుపడని అంశం.

ఒకవేళ ప్రస్తుత ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్ బోధ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మాత్రం ఎంపీ టికెట్‌ రమేశ్‌కు దక్కే అవకాశం ఉందట! అలా అయితే ప్రస్తుతం బోధ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బాపూరావుకు గడ్డుకాలం వచ్చినట్టే! ఒకవేళ బోధ్‌ టికెట్‌ బాపురావుకే ఇస్తే రాథోడ్‌కు ఆసిఫాబాద్‌ను కేటాయించే ఛాన్స్‌ ఉంది.. ఇదే జరిగితే ఆసిఫాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్థానానికి ఎసరు వస్తుంది.. నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న జ‌రిగి ఉట్నూరు కేంద్రంగా మరో గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడితే త‌ప్ప గిరిజన ఎమ్మెల్యేల ఆందోళనకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.

రమేశ్‌ రాథోడ్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి గట్టి భరోసా లభించిందట! ఇప్పటికిప్పుడు ఏదో ఒక నామినేటెడ్‌ పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారట! కొద్ది నెలల కిందట కేసీఆర్‌ నిర్వహించిన సర్వేలో రమేశ్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తేలిందట! అందుకే ఆదిలాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలకు ఇష్టం లేకపోయినా రాథోడ్‌ను పార్టీలో చేర్చుకోబోతున్నారు కేసీఆర్‌.

అంతేకాదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో కొందరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారట! ఇప్పుడున్న ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలలో ఇద్దరిని పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోవడం లేదని.. వారి తీరుతో పార్టీ బలహీనపడుతోందని కేసీఆర్‌ అనుకున్నారట! తాజా పరిణామాలతో రమేశ్‌ క్యాడర్‌లో ఓ విధమైన ఉత్సాహం ఏర్పడింది.. మరి రాథోడ్‌ చేరికతో జిల్లాలో టీఆర్‌ఎస్‌కు నిజంగానే ప్రయోజనం చేకూరుతుందాలేక గ్రూపు రాజకీయాలు అధికమవుతాయాఅన్నది కాలమే తెలపాలి.

(314)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ