WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎవరీ 'కనకమేడల'....!?

తెలుగుదేశం పార్టీ తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సిఎం రమేష్‌తో పాటు మరో నాయకుడు 'కనకమేడల రవీంద్రకుమార్‌'ను ఎంపిక చేసింది. మొదటి నుంచి సిఎం రమేష్‌కు రెండోసారి అవకాశం వస్తుందని పార్టీలో అందరూ భావించారు. పార్టీ అధినేత 'చంద్రబాబు' కూడా ఆయనకు రెండోసారి రాజ్యసభ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి..ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన సమయంలోనూ...ప్రస్తుతం ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఉద్యమం సందర్భంలో కానీ...కడప జిల్లా రాజకీయాల్లో ఆయన పార్టీని బలోపేతం చేస్తున్న తీరుతో సంతృప్తి చెందిన ఆయనకు 'చంద్రబాబు' అవకాశం కల్పించారు. కడప జిల్లాకు చెందిన కొందరు నాయకులు సిఎం రమేష్‌కు ఇవ్వవద్దని కోరినా...ఆయన వారి మాటలను పట్టించుకోకుండా..తనకు విధేయతో ఉన్న 'రమేష్‌'కు రాజ్యసభ సీటు కట్టబెట్టారు. 

   కాగా...రెండో అభ్యర్థి 'కనకమేడల రవీంద్రకుమార్‌' ఎంపిక మాత్రం అనూహ్యంగా జరిగింది. ఉదయం వరకు ఎస్సీ వర్గానికి చెందిన 'వర్ల రామయ్య'కు దాదాపు ఖాయమైందనే ప్రచారం జరిగినా..చివరకు అనూహ్యంగా 'కనకమేడల' ఎంపికయ్యారు. టిడిపి లీగల్‌సెల్‌ నాయకునిగా పనిచేస్తున్న 'కనకమేడల' దాదాపు 20 సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందని ఎవరూ ఊహించలేదు. 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన ఆయనకు రాజ్యసభ సీటు రావడం వెనుక ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో న్యాయవ్యవస్థలో కీలకంగా ఉన్న ఒకరు... 'కనకమేడల'కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అంతే కాకుండా..గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ తరుపున కీలకమైన న్యాయపోరాటాలు చేస్తున్నందున, ఆయన చేసిన కృషికి గుర్తింపు ఇవ్వాలనే భావనతో...ఆయనను చివరి నిమిషంలో ఎంపిక చేశారని తెలుస్తోంది. మొత్తం మీద..టిడిపి తనకు వచ్చే రెండు స్థానాలను ఓసీ అభ్యర్థులకే ఇవ్వడం గమనార్హం.


(4053)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ