WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోలింగ్ భవనానికి కలెక్టర్ కోన శంఖుస్థాప‌న‌...!

జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతలు వంటి విషయాలను తెలుసుకునే అవకాశం రియల్ టైం గవర్నెన్స్  ద్వారా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయపు ఆవరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  మ్యాట్రిక్స్ సంస్థ నిర్మించనున్న రియల్ టైం గవర్నెన్స్  కమాండ్ కంట్రోలింగ్ భవనానికి ఆయన శంఖుస్థాపన చేసారు.  దేశంలోనే ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్  విధానాన్ని      అమలులోకి తీసుకువచ్చిందని ఆయన చెప్పారు.   ఈ విధానం అమలుపై రాష్ట్రపతి కూడా మెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.  ఆర్.టి.జి ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసారని, అలాగే రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో కూడా ఆర్.టి.జి కమాండ్ కంట్రోలింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  ఇందుకోసం ప్రభుత్వం రూ.960 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 

          ప్రప్రధమంగా గుంటూరు, చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయాలలో  ఈ సెంటర్లను తొలిదశలో ఏర్పాటు చేస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు.  గుంటూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్ కార్యాలయపు ఆవరణలో సెంటర్ భవన నిర్మాణానికి 1,450 గజాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు.  రాబోయే ఐదు నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుని ఆర్.టి.జి తన కార్యకలాపాలను ప్రారంభించనున్నదని ఆయన చెప్పారు.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్.టి.జి రూపుదాల్చనున్నదని కలెక్టర్ చెప్పారు.  ఇదే ఆవరణలో నిర్మాణం చేపట్టిన సమావేశపు హాలు చివరి దశకు చేరుకుందని, దీనిని, ఆర్.టి.జి భవనాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపచేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.    మ్యాట్రిక్స్ సంస్థ మేనేజర్ కె.సుధీర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ఏం జరిగిన ఆర్.టి.జి ద్వారా తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 1,222 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  వీటిలో గ్రామీణ ప్రాంతాలలో 692, పట్టణ ప్రాంతాలలో 530 కెమెరాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు.  జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఆర్.టి.జి భవనంలో 30 మంది అధికారులు సమావేశం నిర్వహించేందుకు వీలుగా హాలు, కలెక్టర్ , యస్.పి లకు విడి విడిగా ఛాంబర్స్  వంటివి ఏర్పాటు కానున్నాయని చెప్పారు.   ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎ.యండి.ఇంతియాజ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

(167)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ