మూడు నెలల్లో 100 కంపెనీలు NSEలో లిస్ట్ కావాలి: నారా లోకేష్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

విజయవాడ, మే 13: ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. NSE, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన “SME IPO – Alternative Funding Option For Growth” అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగ అవసరాలను దగ్గరగా గమనించానని తెలిపారు. పెనుగొండలో కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్న పద్మావతి అనే మహిళ కథ తనను ప్రభావితం చేసిందన్నారు. ఉద్యోగం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి ఎలా మారుతుందో ప్రత్యక్షంగా చూసిన తర్వాతే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని నిర్ణయించామని వెల్లడించారు.

గత 23 నెలల్లో రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని, ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 800 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాయలసీమలో క్యారియర్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని, దీనినే “మల్టిప్లయర్ ఎఫెక్ట్” అంటారని లోకేష్ వివరించారు. పెద్ద పెట్టుబడుల చుట్టూ అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాయలసీమలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ; ఉత్తరాంధ్రలో డేటా సెంటర్లు, ఫార్మా; అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

ఎంఎస్ఎంఈలకు “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అందించేందుకు అన్ని అనుమతులను ఆన్‌లైన్‌లో సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 కంపెనీలు NSEలో లిస్ట్ అయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ పని చేయాలని సూచించారు.

చిన్న కంపెనీలు ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించిన మంత్రి, “మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని పారిశ్రామికవేత్తలు, మరిన్ని విజయగాథలు సృష్టిద్దాం” అని పిలుపునిచ్చారు.