సీఎంఓలోకి యువ జిల్లా కలెక్టర్..? చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారా!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోకి ఓ జిల్లాకు చెందిన యువ క‌లెక్ట‌ర్‌ను తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కార్యాల‌య ఇన్‌ఛార్జిగా ప‌నిచేస్తోన్న రిటైర్డ్ ఐఏఎస్ విజ‌యానంద్ అనారోగ్యంతో కార్యాల‌యానికి రావ‌డం లేదు. రిటైర్డ్ అయిన ఆయ‌న ఇంకా ఎంత కాలం ఇక్క‌డ ప‌నిచేస్తారో తెలియ‌దు. ఆయ‌న ఆరోగ్యం ఎంత‌గా స‌హ‌క‌రిస్తుందో తెలియ‌దు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న స్థానంలో ఎవ‌రిని నియ‌మిస్తార‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక స్ప‌ష్ట‌త లేదు. అయితే..త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐఏఎస్‌ల బ‌దిలీల్లో సిఎంఓ కార్యాల‌యంలో మార్పులు జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో రాజ‌మౌళి, కార్తికేయ మిశ్రా, ప్ర‌ద్యుమ్న‌, విజ‌యానంద్‌లు ప‌నిచేస్తున్నారు. అయితే విజ‌యానంద్ అనారోగ్యానికి

గురికావ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ వ‌స్తారా?  రారా అనే ప్ర‌శ్న‌లు ప‌లువురి నుంచి వ‌స్తున్నాయి. అయితే..ఆయ‌న వ‌చ్చినా..రాకున్నా..మ‌రో ఐఏఎస్ అధికారిని సిఎంఓలో నియ‌మిస్తార‌నే ప్ర‌చారం స‌చివాల‌య వ‌ర్గాల్లో జోరుగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న ముగ్గురిలో ఒక‌రిని త‌ప్పిస్తార‌ని అంటున్నారు. వైకాపాకుచెందిన మాజీ మంత్రి ఆర్‌.కె.రోజాకు కొమ్ముకాస్తున్న అధికారిని త‌ప్పిస్తార‌ని, ఆయ‌న స్థానంలో ఓ జిల్లాకు చెందిన క‌లెక్ట‌ర్‌ను సిఎంఓలోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుకు ఆయ‌న‌పై మంచి గురి ఉంద‌ని, ఆయ‌నైతే తాను అనుకున్న ప‌నులు వేగంగా జ‌రుగుతాయ‌నే భావ‌న ఆయ‌న‌లో ఉందంటున్నారు. కీల‌క‌మైన జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా ఉన్న ఆ అధికారిని త్వ‌ర‌లోనే సిఎంఓకు తెస్తారంటున్నారు. అయితే..ఇది ఎప్పుడు

జ‌రుగుతుంద‌నే దానిపై స్ప‌ష్ట‌త లేదు. త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం భారీగా ఐఏఎస్‌, ఐపిఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌బోతోంద‌ని, అప్పుడే ఇది జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం ఉంది. కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌రువాత రాష్ట్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తారంటున్నారు. అయితే..మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే..దాని త‌రువాతే ఐఏఎస్‌ల బ‌దిలీలు ఉంటాయి. కాగా..చంద్ర‌బాబు ఇప్ప‌ట్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌ర‌ని, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే..అదో త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారుతుంద‌ని, ఇప్ప‌టి మంత్రుల‌నే మ‌రికొన్నాళ్లు కొన‌సాగిస్తే..పోతుంద‌నే భావ‌న‌లో ఆయ‌న ఉన్నారంటున్నారు. మొత్తం మీద‌..ఒక వేళ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లేక‌పోయినా ఐఏఎస్‌ల బ‌దిలీలు ఉంటాయంటున్నారు. అప్పుడే సిఎంఓలో కూడా మార్పులు ఉంటాయ‌నే ప్ర‌చారం ఉంది.