చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు.. చేపల మాఫియా బరితెగింపు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పల్నాడులో రోజూ 80–90 టన్నుల చికెన్‌ వేస్ట్‌ తరలింపు ఆరోపణలు

మత్స్య శాఖ అధికారులపై లంచం ఆరోపణలు.. కలెక్టర్‌కు ఫిర్యాదు

పల్నాడు: ప్రభుత్వ నిబంధనలు, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పల్నాడు జిల్లాలోని చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తక్కువ ఖర్చుతో చేపలను త్వరగా పెంచి అధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో కొందరు చెరువుల నిర్వాహకులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పల్నాడు జిల్లా పరిధిలో సుమారు 250 చెరువుల్లో 3,300 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంలో చేపల సాగు జరుగుతోంది. వీటిలో పంచాయతీలు, మత్స్యకార సొసైటీలకు చెందిన చెరువులతో పాటు ప్రైవేటు పట్టా భూముల్లో ఉన్న చెరువులు కూడా ఉన్నాయి. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన కొందరు వ్యాపారులు లీజుకు తీసుకున్న చెరువుల్లో క్యాట్‌ఫిష్‌, ఫంగస్‌, రూప్‌చంద్‌ వంటి చేప జాతులను సాగు చేస్తున్నట్లు సమాచారం.

దాణా ఖర్చు తగ్గించుకునేందుకు..

సాధారణంగా చేపలకు నూనె తీసిన చెక్క, బియ్యం తవుడు, ఫిలెట్స్‌ మిశ్రమంతో తయారు చేసిన దాణాను వినియోగిస్తారు. అయితే ఈ దాణా ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొందరు నిర్వాహకులు దానికి బదులుగా కోళ్ల మాంసం వ్యర్థాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చికెన్‌ వేస్ట్‌తో చేపలు వేగంగా పెరుగుతాయని, తద్వారా తక్కువ సమయంలో అధిక లాభాలు పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

రోజూ 80 నుంచి 90 టన్నుల వ్యర్థాలు?

నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, మాచర్ల, క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, గుంటూరు, పేరెచర్ల, చీరాలతో పాటు హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ భారీగా కోళ్ల మాంసం వ్యర్థాలను చెరువుల వద్దకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 80 నుంచి 90 టన్నుల వరకు చికెన్‌ వేస్ట్‌ వస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

నీటి కాలుష్యంపై ఆందోళన

చెరువుల్లో మాంసం వ్యర్థాలను వేయడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు బ్యాక్టీరియా వ్యాప్తి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా ప్రజలు, పశువులు, పక్షుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చికెన్‌ వేస్ట్‌ను తరలించే వాహనాల నుంచి తీవ్ర దుర్వాసన వస్తోందని, చెరువుల వద్ద పడేసిన వ్యర్థాలను తినేందుకు కుక్కలు అలవాటు పడటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

మత్స్య శాఖ అధికారులపై లంచం ఆరోపణలు

అమరావతి మండలంలోని తొండపి, తురకపాలెం, రావిపాడు, కేతముక్కల అగ్రహారం, లింగంగుంట్ల, అలాగే చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి ప్రాంతాల్లో చేపల చెరువుల్లో చికెన్‌ వేస్ట్‌ వినియోగిస్తున్న వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.

చికెన్‌ వేస్ట్‌ తరలిస్తున్న వాహనాలను స్థానికులు పట్టుకుని మత్స్య శాఖ అధికారులకు అప్పగించినప్పటికీ, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కొందరు అధికారులు రవాణాదారులు, చెరువుల నిర్వాహకులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంలో సుమారు రూ.5 లక్షల వరకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేట మత్స్య శాఖకు చెందిన సహాయకుడు మధుకు రూ.15 వేల ఫోన్‌పే లావాదేవీ జరిగినట్లు పేర్కొంటున్న రసీదు కూడా వెలుగులోకి వచ్చిందని ఫిర్యాదుదారు తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

కలెక్టర్‌కు ఫిర్యాదు

ఈ వ్యవహారంపై నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన కావూరి అశోక్‌కుమార్‌ సోమవారం జిల్లా ప్రజా వేదికలో కలెక్టర్‌ కృతికా శుక్లాకు ఫిర్యాదు చేశారు. చెరువుల్లో చేపలకు కోళ్ల మాంసం వ్యర్థాలను వేయడాన్ని తక్షణమే అరికట్టాలని ఆయన కోరారు.

చికెన్‌ వేస్ట్‌ రవాణాదారులు, చెరువుల నిర్వాహకులు, లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్స్య శాఖ అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లంచం ఆరోపణలకు సంబంధించిన ఫోన్‌పే రసీదు, చికెన్‌ వేస్ట్‌ రవాణా వాహనాలకు సంబంధించిన చిత్రాలను కలెక్టర్‌కు సమర్పించినట్లు తెలిపారు.

చెరువుల్లో కోళ్ల వ్యర్థాల వినియోగంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.