వాకాటి కరుణకు సర్వీస్ పొడిగింపు..? సచివాలయంలో ఆసక్తికర చర్చ

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణబాబు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి వాకాటి కరుణ ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. అయితే వీరిలో వాకాటి కరుణకు సేవా పొడిగింపు లభించే అవకాశంపై సచివాలయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.

సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సెర్ప్‌లో ఆమె నిర్వహిస్తున్న బాధ్యతలు, అమలు చేస్తున్న పథకాల పురోగతి, పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మరోసారి ఆమె సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నారనే చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సేవా పొడిగింపు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బి. రాజశేఖర్‌కు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఆ నిర్ణయంపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆయన సేవలను కొనసాగించింది.

ఇప్పుడు అదే తరహాలో వాకాటి కరుణ విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి అంశాల్లో ఆమెకు ఉన్న అనుభవం ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాల్లో సెర్ప్ కీలక పాత్ర పోషిస్తుండటంతో, ఈ దశలో నాయకత్వంలో మార్పు కంటే కొనసాగింపుకే ప్రాధాన్యం ఇవ్వవచ్చని కూడా చెబుతున్నారు.

మరోవైపు, ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న ఎం. కృష్ణబాబుకు కూడా సేవా పొడిగింపు లభించే అవకాశంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే..ఆయ‌న చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో..ఆయ‌న‌కు స‌ర్వీసు పొడిగింపు ఇవ్వ‌ర‌నే వాద‌నా ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన అధికారుల‌ను వీలైనంత దూరం ఉంచుతార‌ని, ఇప్పుడూ ఆయ‌న అదే చేస్తారంటున్నారు. అజయ్ జైన్ పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తున్నప్పటికీ, ఆయన విషయంలోనూ అధికారికంగా ఎలాంటి సంకేతాలు వెలువడలేదు.

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలతో పాటు పలు కీలక పరిపాలనా నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పదవీ విరమణ చేస్తున్న సీనియర్ అధికారుల సేవల కొనసాగింపుపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చలు పూర్తిగా అధికార వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారంపైనే ఆధారపడి ఉన్నాయి. వాకాటి కరుణకు సేవా పొడిగింపు ఇస్తారా? లేక కొత్త అధికారికి అవకాశం కల్పిస్తారా? అనే అంశంపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత రానుంది. అప్పటివరకు సచివాలయ వర్గాల్లో ఈ అంశం ఆసక్తికర చర్చగానే కొనసాగుతోంది.