ధనలక్ష్మిపురంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ వార్షిక శిక్షణా శిబిరం
నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలోని నారాయణ సీబీఎస్ఈ రెసిడెన్షియల్ హైస్కూల్లో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ ఆధ్వర్యంలో 20వ వార్షిక శిక్షణా శిబిరం ఘనంగా కొనసాగుతోంది. ఈ శిబిరాన్ని లెఫ్ట్నెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్యం నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సీసీ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తోటి వారిపట్ల గౌరవ భావం పెంపొందించడంతో పాటు సమాజ సేవ పట్ల అవగాహన కల్పించడంలో కూడా ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
శిబిరంలో పాల్గొంటున్న క్యాడెట్లకు శారీరక వ్యాయామం, వెపన్ ట్రైనింగ్, పరేడ్ డ్రిల్, మిలిటరీ చరిత్ర, సైబర్ క్రైమ్ అవగాహన, హెల్త్ అండ్ హైజిన్, మోరల్ ఎథిక్స్, పర్యావరణ పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అదేవిధంగా అంబులెన్స్ 108 సేవలు, సోషల్ అవేర్నెస్, నేవల్ కమ్యూనికేషన్, షిప్ మోడలింగ్, సీమఫోర్ తదితర అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నిర్వహిస్తున్నారు.
ఈ శిక్షణా శిబిరానికి అడ్జుటెంట్గా మల్లికార్జున్ రెడ్డి, ట్రైనింగ్ ఆఫీసర్గా గుండాల నరేంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సబ్ లెఫ్ట్నెంట్ ఎస్.కే. న్యామతుల్లా, సెకండ్ ఆఫీసర్లు పెంచల ప్రసాద్, ఎం.సురేష్, కె.సురేష్, గర్ల్ చైల్డ్ ఇన్స్ట్రక్టర్ పూజిత, చీఫ్ ఇన్స్ట్రక్టర్ లోకేష్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ ఎస్.వి. రామన్, పీఐ స్టాఫ్ రమణరావు, లక్ష్మణ్ కుమార్, లక్ష్మీనారాయణ, నవీన్, దీపక్, శివ తదితరులు క్యాడెట్లకు శిక్షణ అందిస్తున్నారు.
ఈ క్యాంపులో గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన సుమారు 500 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని శిక్షణ పొందుతున్నారు. శిబిరంలో కేర్టేకర్ రమాదేవి తదితరులు కూడా పాల్గొన్నారు.