WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్లకే ఆదర్శం ఈ కలెక్టర్‌...!

ఐఎఎస్‌కు ఎంపిక అయిన వారు సబ్‌కలెక్టర్‌ స్థాయిలోనే అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ తరువాత జాయింట్‌ కలెక్టర్‌ హోదాలోకి వచ్చినా కూడా వారి అవినీతి రెట్టింపు అవుతుందని ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. ఈ విధంగా అవినీతికి పాల్పడ్డ కొందరు ఐఎఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసి ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించడం జరిగింది. ఇటువంటి వ్యవస్థలో నిజాయితీపరులు ఉండరని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో వారికి భిన్నమైన అధికారి ఒకరు ఉన్నారని ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఆయన ఎవరో కాదు...పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటంనేని భాస్కర్‌. ఇన్నేళ్లల్లో ఏ నాడూ అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఏ రాజకీయ నాయకుడు ఆరోపణ చేయలేదు..ఏ పత్రికా ఆ విధంగా వార్తలు రాయలేదు. 'భాస్కర్‌' తిరుమలలో జెఇఒగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆరేళ్ల అనుభవాన్ని ఆరు నెలల్లో అధికారికంగా చూపించి అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆదర్శమయ్యారు. అప్పటి ప్రభుత్వం ఆయన సేవలను సక్రమంగా వినియోగించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించి ఇప్పటికి రెండేళ్లు అయింది. ఈ రెండు సంవత్సరాల్లో ఆ జిల్లా ప్రజల అభిమానాన్ని ఆయన పొందారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు తప్ప మిగతా వారందరూ 'భాస్కర్‌' సేవలను కొనియాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పట్టిసీమ' ప్రాజెక్టు పూర్తి కావడానికి 'భాస్కర్‌' ఎంతగానో శ్రమించారని, అనేక రాత్రుళ్లు కాలువ గట్లపై ప్రయాణించారని, ఆయన పట్టుదల, కృషి వల్ల అనుకున్న సమయానికే 'పట్టిసీమ' ప్రాజెక్టు పూర్తి అయిందని సిఎం చంద్రబాబు అభినందించారు. ఈ రెండేళ్లల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ కుల,మతాలకు అతీతంగా ఎంతో మంది అర్హత కల బీదవారికి పెన్షన్లు ఇప్పించారు. ఆయన మరో రెండేళ్లు మా జిల్లాలోనే కలెక్టర్‌గా కొనసాగాలని నిజాయితీకల రాజకీయనాయకులతోపాటు, రాజకీయ విశ్లేషకులు, ఆ జిల్లా ప్రజలు కోరుతున్నారంటే 'భాస్కర్‌' కలెక్టర్‌గా ఎంత కష్టపడి పనిచేశారో స్పష్టం అవుతుంది. కృష్ణా పుష్కరాలు, పోలవరం నిర్మాణ వ్యవహారాలపై కలెక్టర్‌ భాస్కర్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గోదావరి పుష్కరాలను విజయవంతం చేయడానికి 'భాస్కర్‌' ఎంతో కష్టపడ్డారని, కష్టపడితే ఏదైనా సాధించగలరనే విషయం 'భాస్కర్‌' విషయంలో నిజమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. క్రింది స్థాయి ఉద్యోగులు, అధికారుల సహకారంతో రాత్రిబంవళ్లు కష్టపడి లక్ష్యాలను చేధించగలిగామని 'భాస్కర్‌' రుజవు చేశారు. ఈ రెండేళ్లల్లో అనేక అటుపోట్లు ఎదుర్కొన్నారు భాస్కర్‌. ముందు మంచిగా మాట్లాడుతూ వెనుక గోతులు తీసిన అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు ఆయనను బదిలీ చేయించాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన రెండేళ్లు కలెక్టర్‌గా బాధ్యతలు పూర్తి చేయడంతో బదిలీ చేయవల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును 'భాస్కర్‌' కోరారని ప్రచారం జరుగుతోంది. కానీ 'చంద్రబాబు' పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు భాస్కర్‌ను అక్కడే కొనసాగించాలని భావిస్తున్నట్లు సిఎంఒ వర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా తెలుపుతున్నాయి.

(743)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ