WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కేంద్ర సర్వీసులకు 'జవహర్‌రెడ్డి'...!

పంచాయితీరాజ్‌ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'జవహర్‌రెడ్డి' ఇటీవల సెలవుపై వెళ్లారు. దీనిపై ఆరా తీయగా ఆయనకు 'వెలగపూడి' రావడం ఇష్టం లేదని,అందుకే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎండి పోస్టుకు 'జవహర్‌రెడ్డి' గురి పెట్టారట. ఇది ఆయనకు లభించే అవకాశాలు లేనేలేవని అధికారవర్గాల సమాచారం. ఆగస్టు 15వ తేదీ వరకు సెలవు పొడిగించారని, ఈ లోపలే ఆయన కేంద్రంలో ఏదో పోస్టు సంపాదించుకుంటారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నప్పటికీ, మూడు నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏదో ఒక సంస్థకు అథిపతిగా తనకు పోస్టు లభించడం ఖాయమని 'జవహర్‌రెడ్డి' ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన ఏయే ఏయే పోస్టులపై గురిపెట్టారో...ఆయా పోస్టులను తమిళనాడు ఐఎఎస్‌ అధికారులు, ఉత్తరాది ఐఎఎస్‌ అధికారులు పొందేందుకు పావులు కదిపారు. ఈ విషయం తెలిసిన 'జవహర్‌రెడ్డి' ఢిల్లీ పెద్దలను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీదా సాదా పోస్టు తనకు వద్దని, గుర్తింపు ఉన్న పోస్టుల్లో మాత్రమే తనను నియమించాలని 'జవహర్‌రెడ్డి' కోరుతుండడం ఢిల్లీ పెద్దలకు మింగుడు పడడం లేదు. 'జవహర్‌రెడ్డి' వ్యవహారశైలిపై సిఎంఒ అధికారులు కూడా ఆరా తీస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'జవహర్‌రెడ్డి'కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన అది నిలుపుకోలేకపోయారు. సచివాలయ ఉద్యోగులను వెలగపూడి వెళ్లకుండా తిరగబడమని రెచ్చగొట్టారని విమర్శలు కొనితెచ్చుకున్న 'జవహర్‌రెడ్డి'పై సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సెలవుపై వెళ్లిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్వీసుల్లో 'జవహర్‌రెడ్డి' తిరిగి చేరే ప్రసక్తే లేదని, కేంద్రంలో పోస్టు దక్కకుంటే సెలవును మళ్లీ పొడిగించే అవకాశం ఉందని జిఎడి వర్గాలు చెబుతున్నాయి.

(318)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ