లేటెస్ట్

‘బుచ్చ‌య్య’ బాట‌లో మ‌రో ఇద్ద‌రు...!

మాజీ మంత్రి ‘బుచ్చ‌య్య చౌద‌రి’ వ్య‌వ‌హారం టిడిపిలో సంచ‌ల‌నం సృష్టించింది. త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని, పార్టీలో సీనియ‌ర్ అన్న గౌర‌వం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆవేద‌న చెందుతూ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న చెప్పిన మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ‘బుచ్చ‌య్య’ నోటి నుంచి ఇటువంటి మాట రావ‌డం టిడిపి శ్రేణుల‌ను నివ్వెర ప‌రిచింది. టిడిపి అధినేత ‘చంద్ర‌బాబునాయ‌డు’, ఆయ‌న కుమారుడు ‘లోకేష్’ లు త‌న ఫోన్ కూడా లిఫ్ట్ చేయ‌డం లేద‌ని, త‌న అవ‌స‌రం వారికి లేక‌పోతే తానెందుకు పార్టీలో ఉండాల‌ని, అందుకే రాజీనామా చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఆయ‌న‌ను బుజ్జ‌గించ‌డానికి అధినేత ‘చంద్ర‌బాబు’ ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని నియ‌మించి వారిని ఆయ‌న వ‌ద్ద‌కు చ‌ర్చ‌ల‌కు పంపారు. వీరి చ‌ర్చ‌ల త‌రువాత ‘బుచ్చ‌య్య’ రాజీప‌డ్డారో లేదో కానీ, ఆయ‌న వ్య‌వ‌హారం కొన‌సాగుతుండ‌గానే మ‌రో ఇద్ద‌రు నేత‌లు పార్టీని వీడుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.


తూర్పుగోదావ‌రికే చెందిన మాజీ ఎమ్మెల్యే ‘జ్యోతుల నెహ్రూ’ టిడిపి అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల కాలందాకా చాలా హుషారుగా రాజ‌కీయాల్లో ఉన్న ‘నెహ్రూ’ ఇటీవ‌ల కాలంలో పెద్ద‌గా క్రియాశీలకంగా లేరు. పార్టీ అధిష్టానం వివిధ అంశాల‌పై స‌రిగా స్పందించ‌డం లేద‌ని, ప్ర‌తిప‌క్షంగా పోరాట‌పంథాలో వెళ్ల‌డం లేద‌ని త‌న స‌న్నిహితుల‌తో చెబుతున్నారు. జిల్లా రాజ‌కీయాల్లోనూ త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే భావ‌న‌తో ఉన్నారు. పార్టీ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న తిరిగి వైకాపాలోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ లోపే ఈ వారం మొద‌ట్లో గుండెపోటు రావ‌డంతో ఆయ‌న హాస్ప‌టల్ లో చేరారు. ఆయ‌న హాస్ప‌ట‌ల్ లో చేరిన విష‌యం తెలిసి, టిడిపి, వైకాపాకు చెందిన నేత‌లు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. ఇది సాధారణంగా జ‌రిగేదే..కానీ..ఇక్క‌డే జిల్లాకు చెందిన మంత్రులు ఇద్ద‌రు ఆయ‌న ఉన్న హాస్ప‌ట‌ల్ కు వెళ్లి ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. దీనిలో ఏదో ఉంద‌నే ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. గ‌తంలో ఉన్న‌ట్లు ఆయ‌న టిడిపిలో క్రియాశీల‌కంగా లేక‌పోవ‌డం, వైకాపా నేత‌ల‌తో, మంత్రుల‌తో స‌న్నిహితంగా ఉండ‌డం ప‌లు అనుమానాల‌కు కార‌ణం అవుతోంది. కాగా..ఆయ‌న హాస్ప‌ట‌ల్ నుంచి వ‌చ్చిన త‌రువాత కొన్ని ఆక‌స్మిక వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ‘సుజ‌య‌కృష్ణ‌రంగారావు’ కూడా వైకాపాలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పెత్తనం ఎక్కువైంద‌ని, చంద్ర‌బాబు అశోక్ కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, తాను పార్టీలో ఉండే ప‌రిస్థితి లేద‌ని, వైకాపాలోకి తిరిగి వెళితే ఎలా ఉంటుంద‌నే భావ‌న‌తో ఆయ‌న ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం మీద బుచ్చ‌య్య వ్య‌వ‌హారం త‌రువాత మ‌రో ఇద్ద‌రు టిడిపిపై అసంతృప్తి స్వ‌రాన్ని వినిపించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ