ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం:లోకేష్

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని టిడిపి ప్రధాన కార్యదర్శి 'నారా లోకేష్' తెలిపారు. ఎన్నికల కోసం రాత్రనక, పగలనక శ్రమించిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలను అభినందిస్తున్నానని, ఈ ఎన్నికల్లో వైకాపా అరాచకాన్ని, జగన్రెడ్డి అధికారమదాన్ని ఎదిరించి గెలిచిన వారికి, పోరాడి ఓడిన వారికి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలే జరపకూడదనుకున్న వై.ఎస్.జగన్ సర్కారు అప్రజాస్వామిక వైఖరిని ప్రజల ముందు ఉంచడంలో సక్సెస్ అయ్యామని, ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామని వైకాపా నేతలు బెదిరించినా, నామినేషన్లు వేసిన కొందరిని చంపేసినా..అదరక...బెదరక తెలుగుదేశం సైనికులు ఎన్నికల బరిలో నిలిచారన్నారు. వైకాపాకు ఓట్లు వేయకుంటే పథకాలు ఆపేస్తామని ఓటర్లను భయపెట్టి జరిపిన ఎన్నికల ఫలితాలను చూసి నిరాశ చెందొద్దని, బాధ్యాతాయుతమైన ప్రతిపక్షంగా..ప్రజా సమస్యలపై పోరాడదామని, ఆ పోరాటంలో క్రమశిక్షణ, అంకితభావావం కలిగిన సైనికులుగా పనిచేద్దామని, ప్రజలకు అండగా నిలిచి వారికి మరింత చేరువుదామని 'లోకేష్' కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నిరుత్సాహపడవద్దు:చంద్రబాబు
ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు, నాయకులు బాగా కష్టపడ్డారని, ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని చోట్ల ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని, రౌడీయిజం, బెదిరింపులు, అధికారదుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఇదే స్ఫూర్తితో పనిచేద్దామని, రానున్న రోజుల్లో విజయం మనదేనని 'చంద్రబాబు' కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.