లేటెస్ట్

'చంద్రబాబు'పై కేసు వెనుక 'జగన్‌' వ్యూహమేమిటో...!?

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు  'నారా చంద్రబాబునాయుడు'కు సీఐడీ పోలీసులు నిన్న నోటీసులు ఇవ్వడంపై రాజకీయవర్గాల్లోనూ, న్యాయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ రైతులను 'చంద్రబాబు' మోసగించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు 'చంద్రబాబు'ను విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. తనకు కొంత మంది ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన రైతులు అసైన్డ్‌భూముల వ్యవహారంలో 'చంద్రబాబు' మోసగించారని,దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా సీఐడీ అధికారులకు లేఖ రాశానని 'ఆళ్ల' చెబుతున్నారు. 

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అసైన్డ్‌ భూముల రైతులకు అన్యాయం జరిగిందని దీనికి 'చంద్రబాబు' ఆయన మంత్రివర్గ సహచరులు కారణమని పేర్కొంటూ వైకాపా ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఇప్పటికే 'అమరావతి'లో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు త్రోసిపుచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా దళితరైతులను చంద్రబాబు మోసగించారని ప్రభుత్వం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై న్యాయవర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సీఐడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఎవరో కొందరు దళిత రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాము మోసపోయామని వినతిపత్రం ఇచ్చారని, దీనిపై విచారణ జరిపించాలని 'ఆళ్ల' సీఐడీకి లేఖ రాయడం, దాన్ని పట్టుకుని 'చంద్రబాబు'కు నోటీసులు ఇవ్వడం చట్టపరంగా చెల్లదని వారు పేర్కొంటున్నారు. 

ప్రభుత్వం  అసైన్డ్‌రైతులను మోసగించడానికి జీవో ఇచ్చారని, రైతులకు పరిహారం చెల్లించలేదని  'ఆళ్ల' తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆయన చెప్పినట్లు అమరావతి భూముల కోసం అసైన్డ్‌ రైతుల నుంచి తీసుకున్న భూములకు సాటి రైతులకు చెల్లించినట్లు పరిహారం చెల్లించారు. మరి ఇక్కడ అన్యాయం జరిగిందెక్కడ...? మోసపోయిందెక్కడ..? అనే ప్రశ్నలను వారు వేస్తున్నారు. అంతే కాకుండా ఎవరో రైతులు తనకు చెప్పారని చెబుతున్న ఎమ్మెల్యే ఆళ్ల మాటలు చెల్లవని కూడా వారంటున్నారు. ఇది న్యాయసమీక్షకు నిలవదని అంటున్నారు. సీఐడీ నోటీసులకు 'చంద్రబాబు' హాజరవుతారా..? లేక కోర్టుకు వెళ్లి కేసును రద్దు చేయమని కోరతారా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది 'సిల్లీ' కేసని, దీనితో 'చంద్రబాబు'ను బెదిరించలేరని 'చంద్రబాబు' తనయుడు 'లోకేష్‌' చెబుతుండగా, టిడిపి సీనియర్‌ నేతలు కూడా అదే చెబుతున్నారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో చూసే వారికి కూడా ఈ కేసు న్యాయసమీక్షకు నిలవదని అర్థం అవుతున్నా 'జగన్‌' ఎందుకు ఇప్పుడు 'చంద్రబాబు'పై ఈరకమైన కేసులు నమోదు చేయించారనే దానిపై పలు రకాలైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

మొదటగా చీటికి మాటికి తనపై కేసులు ఉన్నాయని 'చంద్రబాబు' ఎద్దేవా చేస్తున్నారని, ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయించడం ద్వారా అరెస్టు చేయించి, ఆయనపై కూడా కేసులు ఉన్నాయని చాటి చెప్పడం అయితే ఈ కేసులో 'చంద్రబాబు' కోర్టుల నుంచి స్టే తెచ్చుకుంటే తాము మొదటి నుంచి చెబుతున్నట్లు వ్యవస్థలను ఆయన మేనేజ్‌ చేయించారని ప్రచారం చేయడం మరోటి. కాగా..'చంద్రబాబు'పై కేసు నమోదు అయిన తరువాత తాము మొదటి నుంచి చెబుతున్నట్లు 'అమరావతి'లో అక్రమాలు జరిగాయని, దాని వల్లే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ పాలనారాజధానిని 'విశాఖ'కు మార్చడమే ఆయన లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పటికే న్యాయస్థానాల్లో 'రాజధాని' కేసులు విచారణలో ఉండడంతో ఇప్పుడు ఈ ప్రచారం చేయడం వల్ల పెద్దగా లాభం లేదని, అయితే 'అమరావతి' ఉద్యమకారుల నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసి కాళ్లబేరానికి తెచ్చుకోవడానికి మార్గంగా కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించిన తరువాత 'చంద్రబాబు'పై కేసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని, ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఈ కేసులు పెడుతున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఏదో ఒక లక్ష్యం లేకుండా ఇలా తలా తోక లేని కేసులు 'జగన్‌' పెట్టరని కూడా వారు అంటున్నారు.  

(418)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ