లేటెస్ట్

ఓడిన 'టిడిపి' అభ్యర్థిపై రుబాబు..!

'విజయవాడ' టిడిపి తమ్ముళ్లకు ఇంకా బుద్దిరానట్లుంది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయినా తన్నుకుంటూనే ఉన్నారు. కొంత మంది సీనియర్‌ నాయకులు పనిగట్టుకుని చేసిన ప్రచారం వల్ల తాము ఓడిపోయామని, సీనియర్‌ నాయకులమని చెప్పుకునే వారి నీచత్వాన్ని బయటపెడుతుండగా వారిపై ఆ సీనియర్లు రుబాబు చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు ముందు టిడిపి 'విజయవాడ' మున్సిపల్‌కార్పొరేషన్‌ను ఖచ్చితంగా గెలుస్తుందని చాలా మంది భావించారు. అయితే పోలింగ్‌కు రెండు రోజుల ముందు టిడిపి సీనియర్‌ నాయకులు 'బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధావెంకన్న, నాగుల్‌మీరా'లు పార్టీలో ఎంపీ కేశినేని నాని పెత్తనాన్ని తాము సహించమని, టిడిపిలో 'కమ్మ' సామాజికవర్గపెత్తనం చెల్లదని, టిడిపికి బీసీలు, కాపులు అక్కర్లేదా..? అని ప్రశ్నించి ఆయనపై అసమ్మతిని ప్రకటించారు. తరువాత సాయంత్రానికి ఈ అసమ్మతి  చల్లారినా..పోలింగ్‌లో దాని ప్రభావం భారీగా కనిపించింది. 

విజయవాడ సెంట్రల్‌, విజయవాడ దక్షిణ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టిడిపి అభ్యర్థులు ఘోర ఓటమికి గురయ్యారు. దీనంతటికి ఈ అసమ్మతి నాయకులే కారణమని కార్పొరేటర్‌గా పోటీ చేసిన 'ఏదుపాటి రమణీ' భర్త రామయ్య సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దీనిపై టిడిపికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న 'రామయ్య'కు ఫోన్‌చేశారు. ఈ సందర్భంగా వారివురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరగగా, 'బుద్ధా వెంకన్న' అనుచరుడు 'లోకేష్‌' 'రామయ్య'కు ఫోన్‌చేయడంతో వారిద్దరూ బూతులు తిట్టుకున్నారు. ఈ మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు 'బుద్ధా' చేసిన వ్యాఖ్యలే తన ఓటమికి కారణమని 'రామయ్య' దంపతులు ఆరోపిస్తున్నారు. బీసీ కులాల ప్రస్తావన తెచ్చి తాను ఓడిపోవడానికి 'వెంకన్న' కారణమయ్యారని, పైగా ఇప్పుడు తనపై రుబాబు చేస్తున్నారని, ఇదెక్కడ న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఇక పార్టీలో ఉండమని, విశాఖ వెళ్లిపోతామని పోటీ చేసి ఓడిపోయిన 'రమణ' ఆ సంభాషణల్లో పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై సోషల్‌మీడియాలో 'రామయ్య'కు అత్యధికులు మద్దతు ఇస్తున్నారు. పార్టీ పట్ల క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే 'రామయ్య' వంటి కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, కార్యక్షేత్రంలో కార్యకర్తలు బాగా పనిచేస్తోన్న పైస్థాయిలో ఉన్న నాయకులవల్లే పార్టీకి ఈ గతి పట్టిందని, పనిచేయని పేపర్‌టైగర్లను పార్టీ వదిలించుకోవాలని వారు సూచిస్తున్నారు.

(294)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ