లేటెస్ట్

ఠక్‌..ఠక్‌..ఠక్‌...మళ్లీ ‘జనం’లోకి ‘జగన్‌’...!

దాదాపు రెండేళ్ల క్రితం ఇదే ఎండాకాలంలో ఏదో ఒక నగరంలోనో..ఏదో గ్రామంలోనో..ఇటువంటి ఠక్‌..ఠక్‌..ఠక్‌..మంటూ శబ్దాలు వస్తూంటే...అక్కడే ఉన్న జనాలు దానికి ప్రతిగా ఈల‌లు, కేకలు, హర్షధ్వానాల‌ మధ్య తమ ప్రతి స్పందనను తెలుపుతూ ఉంటారు. అప్పుడు ఇటువంటి శబ్దాలు చేసింది..ఎవరో కాదు..నాడు ప్రతిపక్షనేత, ఇప్పుటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డే. నాడు సార్వత్రిక ఎన్నికల‌ ప్రచారం సందర్భంగా ఆయన ప్రసంగించిన ప్రతిసభలో ముందుగా ఆయన మైక్‌ తీసుకుని ‘ఠక్‌..ఠక్‌..ఠక్‌’ అంటూ మైక్‌ మీద సున్నితంగా తడుతూ ప్రజలందరి వైపూ తిప్పుతూ.. ‘నా అక్కచ్లెమ్మకు, అన్నల‌కూ, తాతల‌కు, అమ్మమ్మల‌కూ, నాయనమ్మల‌కూ’ నా వందనాలు అంటూ అదోరకంగా చేతులు తిప్పుతూ ప్రసంగాన్ని ప్రారంభించేవారు. ఏ ఊరు వెళితే ఆ వూరిపేరును పల‌కరిస్తూ..అప్పటి అధికారపక్షం ‘టిడిపి’పై జడి విమర్శలు కురిపించేవారు. ఆయన విమర్శల‌కు, ఆరోపణల‌కు ప్రజల‌ నుంచి మంచి సమాధానమే ల‌భించింది. చరిత్రలో ఎప్పుడూలేని ఘనవిజయాన్ని ఆయనకు రాష్ట్ర ప్రజలు కట్టబెట్టి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. 

ఇదంతా రెండేళ్ల క్రితం నాటి ముచ్చట. అప్పట్లో ప్రజల్లోకి ఎంతో దూకుడుగా వెళ్లిన ‘జగన్‌’ ముఖ్యమంత్రి అయి రెండేళ్లయినా మళ్లీ ఎన్నికల‌ సభల్లో ప్రసంగించలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కానీ, నగర కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో కానీ ఆయన ప్రచారం చేయలేదు. ఇంటి గడప దాటకుండానే ఆయన తన పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టారు. అటువంటి ‘జగన్‌’ త్వరలో జరగబోయే ‘తిరుపతి’ ఉపఎన్నిక సందర్భంగా మళ్లీ  బహిరంగసభలో ప్రసంగించబోతున్నారు. అప్పట్లో ఆయన చేసిన ప్రచారతీరు ప్రజల‌ను విశేషంగా ఆకట్టుకుంది. రెండేళ్ల అధికారం తరువాత తొలిసారి ఎన్నికల సభలో ప్రసంగించనున్న ‘జగన్‌’ ప్రచారం ఎలా ఉంటుందో అన్నదానిపై రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక..ప్రతిదానికి ‘చంద్రబాబు’ను, ఆయన పార్టీని విమర్శించిన ‘జగన్‌’ ఇప్పుడు ఏమి చెబుతారనేదానిపై రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

నాడు తనకు 20 మంది ఎంపీల‌ను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెస్తానని ప్రజల‌కు వాగ్ధానం చేశారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్ర ప్రజలు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కూడా కట్టాల్సిన అవసరం లేదని ఆయన నాటి ఎన్నికల‌ ప్రచారంలో చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్న తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో ప్రత్యేకహోదా ప్రసక్తి తెస్తారా..? అదే విధంగా పోల‌వరానికి ఇవ్వాల్సిన నిధులు, వెనుకబడిన జిల్లాకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు, లోటుబడ్జెట్‌ భర్తీ వంటి అంశాల‌పై ఆయన ప్రసంగిస్తారా..? ఇప్పటికే 22 మంది ఎంపీలు ఉన్న వైకాపా ప్రత్యేకహోదాపై సాధించిందేముందన్న ప్రశ్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఎంపీని గెలిపిస్తే..రాష్ట్ర ప్రజల‌కు వచ్చేదేమిటన్నప్రశ్నకూ ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆయన వీటి జోలికి అసలుపోరని, తాను అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, ‘చంద్రబాబు’, పవన్ ల‌‌పై విమర్శల‌తో ఎన్నిక ప్రచారాన్ని ముగిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాను పేదల‌కు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ‘చంద్రబాబు’ అండ్‌ కో అడ్డుకుంటున్నారని, తిరుపతిలో మళ్లీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే..సంక్షేమపథకాలు ఆగకుండా ముందుకు వెళతాయని ఆయన చెబుతారని అంటున్నారు. మొత్తం మీద రెండేళ్ల తరువాత ‘జగన్‌’ మళ్లీ ‘ఠక్‌..ఠక్‌..ఠక్‌’ మంటూ ప్రజల‌ ముందుకు వస్తున్నారు. మరి నాడు ప్ర‌జ‌ల నుండి వ‌చ్చిన‌ స్పందన నేడు   ఉంటుందో..? లేదో చూడాలి మరి. 

(285)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ