WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ టిక్కెట్‌ ధర పదివేలా...?

తిరుమలలో ఉదయం బ్రేక్‌ దర్శనానికి శ్రీవారి దర్శనం కావాలంటే రూ.10వేలు చెల్లిస్తే పరమాత్ముని దర్శించుకునే అవకాశం దక్కుతుందట. రాత్రి పూట బ్రేక్‌ దర్శనాలను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో కేవలం ఉదయం పూట మాత్రమే బిగినింగ్‌ బ్రేక్‌ దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు అధికారులు. ఈ దర్శనం టిక్కెట్‌ ధర రూ.500/- మాత్రమే. అయితే దర్శనం విధానంలో మూడు రకాలుగా అమలు చేస్తున్నారు. అందులో ఒకటి లిస్ట్‌-1. దీనిలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు, సుప్రీం,హైకోర్టు న్యాయమూర్తులు ఇంకా ఇతర ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. రెండో లిస్ట్‌లో పైవర్గాల సిఫార్సులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర వర్గాల సిఫార్సులతో వచ్చేవారికి దీని ద్వారా దర్శనానికి వెళుతున్నారు. లిస్ట్‌-3లో ఇతరత్రా సిఫార్సులతో వచ్చిన వారికి, వ్యక్తిగతంగా వచ్చిన వారికి వారి వారి అర్హతలను బట్టి దర్శనం చేయిస్తుంటారు. ఏ దర్శనానికి టిక్కెట్‌ ధర ఐదు వందలరూపాయలు మాత్రమే. కానీ లిస్ట్‌-1 ద్వారా శ్రీవారిని దగ్గరగా ఉండి దర్శించుకోవచ్చు. ఆ దర్శనానికి స్వామివారి హారతి కూడా ఇస్తారు. ఆ విధంగా దర్శించుకోవాలనుకునే ధనవంతులు రూ.500 టిక్కెట్టు రూ.10వేలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారట. లిస్ట్‌-1 ద్వారా కేవలం వందమందికి మాత్రమే అవకాశం ఉండగా, ఎవరెవరి సిఫార్సుద్వారా వస్తున్నారో కానీ సోమవారం ఉదయం సుమారు 500మందికి టిక్కెట్లను ఇవ్వడం జరిగింది. విచిత్రమేమిటంటే ఇఒ సాంబశివరావు సిఫార్సులు లేవు. మిగతా వచ్చిన వారికి జెఇఒ శ్రీనివాసరాజు ఆమోదంతోనే జరిగిందట. ఆ దర్శనానికి వచ్చిన భక్తులను పరిశీలిస్తే వారిలో ఎక్కువ మంది బ్లాక్‌లో కొన్నవారే కనిపిస్తున్నారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని విజిలెన్స్‌వారు చెబుతున్నారు. ఈ జాబితాలో ఇఒ సిఫార్సు, కేంద్ర న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు లేరు. అయినప్పటికీ వందల మందికి టిక్కెట్లు ఇవ్వడం జరిగింది. ఇఒ, జెఇఒలు ఇద్దరూ సోమవారం నాడు తిరుమలలో లేరు. అయినా ఇంత మందికి ఎలా టిక్కెట్లు జారీ అయ్యాయో ఆ దేవునికే తెలియాలి. అన్ని టిక్కెట్లు ఎలా జారీ చేశారో అని జెఇఒ క్యాంప్‌ కార్యాలయ అధికారులను అడగగా, దీనిలో తమ ప్రమేయం లేదని, మెయిల్‌ ద్వారా జెఇఒగారు ఆమోదించారని దీంతో తాము జాబితాను రూపొందించామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ లిస్ట్‌ ద్వారా జారీ చేసే విధానంలో లక్షలు చేతులు మారుతున్న విషయం వాస్తవమేనని ఇందులో బోర్డు చైర్మన్‌ మరియు సభ్యుల సిఫార్సులు కూడా ఉన్నాయని విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని అధికారులు తెలిపారు.

(246)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ