లేటెస్ట్

‘సోము’ పాద‌యాత్ర‌...!?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు ‘సోము వీర్రాజు’ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆరు నెల‌ల త‌రువాత ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర నిర్వ‌హించాల‌నుకుంటున్నార‌ట‌. అధికార వైకాపా ప్ర‌జాకంట‌క‌పాల‌న చేస్తోంద‌ని, ఈ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసేందుకు ‘సోము’ పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని, త‌ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తో ఆయ‌న పాద‌యాత్ర నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇన్నాళ్లూ తెలంగాణ నేత‌లు చేస్తోన్న పోరాటం చూసి ఆంధ్రా నేత‌లు ఏమీ చేయ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, త‌న‌ను విమ‌ర్శించిన వారి నోళ్లు మూయించేందుకు ఇదే స‌రైన మార్గ‌మ‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని, రాబోయే రోజుల్లో ఆయ‌న పాద‌యాత్ర ద్వారా వారికి స‌మాధానం చెబుతారట‌. ‘సోము వీర్రాజు’ ప‌నితీరు బాగాలేద‌ని, ఆయ‌న‌ను అధ్య‌క్ష‌ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌ని, ఆయ‌న స్థానంలో మాజీ అధ్య‌క్షుడు ‘క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌’ను తిరిగి అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని ఇటీవ‌ల కాలంలో వార్త‌లు వ‌చ్చాయి. 


‘సోము’ వ‌ల్ల పార్టీ అథంపాతాళంలోకి పోతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తూండ‌డంతో త‌న ప‌ద‌వి కాపాడుకునేందుకు ఏదో ఒక‌టి చేయాల‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న పాద‌యాత్ర ఆలోచ‌న చేస్తున్నారంటున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ నేత‌ల‌తో పోల్చి విమ‌ర్శ‌లు చేస్తున్న నేత‌లు ‘సోము’ యాత్ర చేస్తే ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ‘బండి సంజ‌య్’ చేస్తోన్న‌పాద‌యాత్ర‌కు పార్టీ వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఆయ‌న‌కు పార్టీవ‌ర్గాల‌తోపాటు, ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో మైలేజ్ వ‌చ్చింది. మ‌రి ఆయ‌న‌ను చూసి ‘సోము’ పాద‌యాత్ర మొద‌లు పెడితే ఎలా ఉంటుంద‌న్న ప్ర‌శ్న బిజెపి వ‌ర్గాల నుంచే వ‌స్తున్నాయ‌. బిజెపి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్నాక అధికార‌పార్టీపై నోరెత్త‌ని ‘సోము’ యాత్ర‌కు ప్ర‌జ‌లు స్పందించ‌రని, ఆయ‌న యాత్ర చేస్తే న‌వ్వులు పాల‌వ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న వ్య‌తిరేకులు అంటున్నారు. ఎవ‌రెన్ని అనుకున్నాఆయ‌న‌ మాత్రం యాత్ర‌చేయాల‌నే ఉద్దేశ్యంతోనే ఉన్నార‌ట‌.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ